అమరావతి పనుల పునఃప్రారంభం
నవ నగరాల నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి గతంలో శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగానే మళ్లీ పనులు పునః ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నరేంద్ర మోదీని సీఎం చంద్రబాబు ఇటీవల దిల్లీ వెళ్లినప్పుడు ఆహ్వానించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. రాజధానిలో నవ నగరాల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాన్ని మోదీ చేతుల మీదుగా చేయించాలని నిర్ణయించారు. తొలి దశలో రాజధానిలో నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.64,721 కోట్లు వెచ్చించనుంది. నిర్మాణ పనులను మిషన్ మోడ్‌లో చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈనెల 17న జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తర్వాత కాంట్రాక్ట్ ఏజెన్సీలకు అగ్రిమెంట్ లెటర్లు జారీ చేయనుంది. వర్క్ ఆర్డర్లు జారీ కాగానే ఏజెన్సీలు పనులను ప్రారంభించనున్నాయి. వచ్చే నెల మూడవ వారం వరకు ప్రధాని షెడ్యూల్ బిజీగా ఉండటంతో ఆ తరువాత షెడ్యూల్ ఖరారు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా రాజధాని పనులకు ప్రధాని శంకుస్థాన చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత వైసీపీ ప్రభుత్వం రావడంతో రాజధాని పనులు ఆగిపోయాయి. దీనిపై రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులు ఐదు సంవత్సరాల పాటు ఆందోళనలు కొనసాగించినా జగన్ ప్రభుత్వం కరుణించలేదు. ఈ నేపథ్యంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు, అమరావతి, పోలవరం ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచారు. కేంద్రంలోని ఎన్డీఏ కూటమిలో కూడా చంద్రబాబు కీలకంగా మారడంతో ఆయన కోరిన వెంటనే రాజధాని పనులకు ప్రపంచ బ్యాంక్ ద్వారా రుణం మంజూరుకు కేంద్రం సహకరించింది. రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ సమావేశంలో దాదాపు రూ.40 వేల కోట్ల విలువైన పనులకు ఆమోదముద్ర పడిరది. కాంట్రాక్టు ఏజెన్సీలకు అంగీకార పత్రాలు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు కలిసి దాదాపు రూ.13 వేల 400 కోట్ల రుణాలను ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. అలాగే హడ్కో నుంచి మరో రూ.11 వేల కోట్ల రుణ సమీకరణకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసింది. దానికి సంబంధించి అనుమతి లేఖ కూడా రాష్ట్రానికి వచ్చింది. రాష్ట్రం నుంచి అంగీకారం తెలుపుతూ ముంబైలోని హడ్కో కార్యాలయానికి లేఖ పంపారు. అలాగే జర్మనీకి చెందిన ఆర్థిక సంస్థ నుంచి మరో రూ.5 వేల కోట్ల రుణాలు తీసుకోవడంతో పాటు రూ.1,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్‌గా తీసుకోనున్నారు. మొత్తం రూ.31 వేల కోట్ల నిధులు ప్రభుత్వం వద్ద అమరావతి నిర్మాణానికి సంబంధించి సిద్ధంగా ఉన్నాయి. 2014`19 మధ్యకాలంలో దాదాపు రూ.43 వేల కోట్ల విలువైన టెండర్లను పిలిచి రూ.9 వేల కోట్ల వరకు ఖర్చు పెట్టారు. ఐకానిక్ కట్టడాలకు రాక్ ఫౌండేషన్ పూర్తికాగా, ప్రజాప్రతినిధుల క్వార్టర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, ఐఏఎస్‌ల బంగ్లాలు దాదాపు 60 నుంచి 80 శాతం పూర్తయ్యాయి. వీటన్నింటికీ పాత టెండర్లు రద్దు కావడంతో అంచనాలు భారీగా పెరిగాయి. మరలా కొత్త అంచనాలతో టెండర్లు ఖరారు చేస్తున్నారు. రైతులిచ్చిన భూములతో పాటు ప్రభుత్వ, అటవీ భూములన్నీ కలిపి సుమారు 53,500 ఎకరాల భూములు రాజధానికి ఉండగా, వీటిలో 30 శాతం వరకు గ్రీన్ అండ్ బ్లూగా అభివృద్ధి చేయాలని సీఆర్‌డీఏ నిర్ణయించింది.