Friday, March 14, 2025
Homeఓడినా అడుగు ముందుకేశాం

ఓడినా అడుగు ముందుకేశాం

మనం నిలబడ్డాం… టీడీపీని నిలబెట్టాం

. దేశ ఐక్యతకు బహుభాషా విధానం అవసరం
. జనసేన ఆవిర్భావ సభలో పవన్‌ కల్యాణ్‌

విశాలాంధ్ర బ్యూరో – కాకినాడ: ఎన్నికల్లో ఓడినా అడుగు ముందుకే వేశామని, ఎన్నికల్లో విజయం సాధించామని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం శివారులోని చిత్రాడలో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ఆయన శుక్రవారం ప్రసంగించారు. జయకేతనం పేరుతో ఏర్పాటు చేసిన సభకు భారీ సంఖ్యలు జనసేన నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ‘మనం నిలబడ్డాం.. పార్టీని నిలబెట్టాం. నాలుగు దశాబ్దాల టీడీపీని నిలబెట్టాం. 2019లో మనం ఓడిపోయినప్పుడు మీసాలు మెలేశారు.. జబ్బలు చరిచారు. మన ఆడపడుచుల్ని అవమానించారు. ప్రజల్ని ఇబ్బంది పెట్టారు. ఇదేం న్యాయమని వీర మహిళలు అడిగితే కేసులు పెట్టి జైళ్లలో వేశారు. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడిని కూడా జైల్లో పెట్టారు. నన్ను అణచివేసేందుకు అనేక కుట్రలు చేశారు. అసెంబ్లీ గేటు కూడా తాకనీయమని సవాల్‌ విసిరారు. 21 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో, ఇద్దరు ఎంపీలతో పార్లమెంట్‌లో అడుగు పెట్టాం. దేశమంతా మన వైపు చూసేలా 100 శాతం స్ట్రైక్‌ రేట్‌ సాధించాం’ అని పవన్‌ అన్నారు. బహుభాషతోనే దేశం ఐక్యంగా ఉంటుందని పవన్‌ చెప్పారు. తమిళనాడు సహా అన్ని రాష్ట్రాలకు ఒకే విధానం ఉండాలని ఆయన అన్నారు. పవన్‌ ప్రసంగిస్తుండగా ఓజీ…ఓజీ అంటు ఆయన అభిమానులు నినాదాలు చేశారు. దీంతో వారిని వారించేందుకు పవన్‌ కష్టపడ్డారు. తన మాట వినడం వల్ల విజయం సాధించామని, ఇప్పుడు కూడా సినిమాల ప్రస్తావన వద్దని చెబుతున్నానని, తన మాట వినాలను నవ్వుకుంటూ చెప్పారు. అదే సమయంలో గత వైసీపీ ప్రభుత్వంపై పవన్‌ విమర్శలు గుప్పించారు. రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. తనను తిట్టని తిట్టు లేదు…చేయని కుట్ర లేదన్నారు. అన్నింటినీ భరించి ముందుకు సాగినందుకే ఇవాళ జయకేతనం ఎగురువేస్తున్నామన్నారు. పార్టీ పెట్టాలంటే తండ్రులు సీఎం కావాల్సిన అవసరం లేదు. మామలు కేంద్రమంత్రులు కావాల్సిన అవసరం లేదు. బాబాయిలను చంపాల్సిన అవసరం అంతకంటే లేదంటూ జగన్‌పై పవన్‌ పరోక్ష విమర్శలు గుప్పించారు.
దేశ నేతగా పవన్‌ ఎదగాలి: నాదెండ్ల
ఎన్ని అవమానాలు ఎదురైనా జనసేన నిత్యం ప్రజల పక్షాన నిలబడిరదని ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్‌, మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. ‘2019లో జనసేనకు భవిష్యత్తు ఉందా? అనే సందర్భంలోనూ భవన నిర్మాణ కార్మికులకు భరోసా ఇచ్చాం. కష్టమైన ప్రయాణంలో అనేక అవమానాలు ఎదుర్కొన్నాం. మన నాయకుడిని ఇబ్బందులు పెట్టిన రోజులను మర్చిపోలేం. ఆర్థికంగా నిలబడలేని వ్యక్తులు కూడా పార్టీ కోసం నిలబడ్డారు. తనతో పాటు నిలబడిన ప్రతి ఒక్కరినీ పవన్‌ గౌరవించారు. కష్టపడి యువతరాన్ని నాయకత్వంగా మార్చాలని చెప్పారు. జనసేనలో ప్రస్తుతం 12.32 లక్షల మంది సభ్యులున్నారు. ప్రతిపక్షంలో ఒక విధంగా… అధికారంలో ఉండగా మరో విధంగా లేము. రాష్ట్రానికే కాదు… దేశానికి కూడా ఉపయోగపడేలా పవన్‌ ఎదగాలి. జనసేన ఎప్పుడూ సామాన్యుల పక్షానే నిలబడుతుంది. అధికారులతో కలిసి పేదలకు పథకాలు అందేలా జన సైనికులు కృషి చేయాలి. ప్రశ్నించే స్థాయి నుంచి పరిష్కరించే స్థాయికి మనం ఎదిగాం. పదవులు వచ్చినా… రాకున్నా పార్టీకి అండగా ఉందాం. మన పోరాటంలో 463 మంది జనసైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరణించిన జనసైనికులకు పవన్‌ అండగా ఉన్నారు. మన అడుగులు సామాన్యుడివైపే నడుస్తాయి’ అని నాదెండ్ల మనోహర్‌ అన్నారు.
పవన్‌ను ప్రజలే గెలిపించారు: నాగబాబు
పిఠాపురం: పిఠాపురం ప్రజలు, జన సైనికులకు రుణపడి ఉన్నామని ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు. ‘నాయకులు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏం జరుగుతుందో చూశాం. నోటిదురుసు ఉన్న నేతకు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. రాజకీయాల్లో జాగ్రత్తగా మాట్లాడాలని పవన్‌ చెప్పారు. జగన్‌ లాంటి హాస్యనటులు ఎన్నో కలలు కన్నారు. కళ్లు మూసి తెరిసే లోపే తొమ్మిది నెలలు గడిచిపోయాయి. ఇంకోసారి కళ్లు మూసి తెరిస్తే ఐదేళ్లు గడచిపోతాయి. ఆ తర్వాత అధికారం మాదే అని జగన్‌ అంటున్నారు. ఇంతకన్నా అద్భుతంగా ఎవరూ హాస్యం పండిరచలేరు. మరో 20 ఏళ్ల వరకు జగన్‌ ఇలాగే కలలు కంటూనే ఉండాలని నా సలహా. ప్రజల బాగోగులు చూసే వ్యక్తి పవన్‌ కల్యాణ్‌. అలాంటి ఒక గొప్ప వ్యక్తి కావాలి. లేదంటే ఆయనకు అనుచరుడిగా ఉండాలి. వచ్చే రెండు, మూడు తరాల గురించి ఆలోచించే వ్యక్తి పవన్‌. పవన్‌ కల్యాణ్‌ అడగకుండానే వరాలిస్తారు. నాకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చిన పవన్‌కు కృతజ్ఞతలు. జనసైనికుడిని అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నా. పిఠాపురంలో పవన్‌ విజయానికి తానే కారణమని ఎవరైనా అనుకుంటే అది వారి ఖర్మ. పవన్‌ గెలుపునకు ఆయన, పిఠాపురం పౌరులే కారణం’ అని నాగబాబు అన్నారు.
ప్రాణం ఉన్నంత వరకు పవన్‌తోనే: బాలినేని
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో సినిమా తీయాలనేది తన కోరిక అని, ఇదే విషయం ఆయనకు చెప్పానని మాజీ మంత్రి, ఆ పార్టీ నేత బాలినేని శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ‘పిఠాపురం సాక్షిగా అన్నీ నిజాలే చెబుతా. నాకు ప్రాణం ఉన్నంత వరకు… పదవి ఉన్నా, లేకపోయినా పవన్‌ కల్యాణ్‌ వెంటే ఉంటా. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎంతో నష్టపోయా. మా తండ్రి ఇచ్చిన ఆస్తిలో సగం అమ్మేశా. జగన్‌ వల్ల నేను, నా కుటుంబ సభ్యులు ఎంతో బాధపడ్డాం. న
ా ఆస్తులు, నా వియ్యంకుడికి ఉన్న ఆస్తులను కూడా జగన్‌ కాజేశారు. జగన్‌ చేసిన అన్యాయాలు చెప్పాలంటే సమయం సరిపోదు. రఘురామకృష్ణరాజు ఏదో అన్నారని లోపల పెట్టి ఆయన్ను కొట్టించావు. చేసిన పాపాలు ఎక్కడికీ పోవని జగన్‌ తెలుసుకోవాలి. కూటమి ప్రభుత్వం వచ్చాక చిన్న చిన్న వారిని అరెస్టు చేస్తున్నారు. స్కాములు చేసి… కోట్ల రూపాయలు సంపాదించిన వారిని ఇంకా అరెస్టు చేయడం లేదు. అదే నా బాధ. వైఎస్‌ను అడ్డం పెట్టుకుని జగన్‌ సీఎం అయ్యారు. పవన్‌ కల్యాణ్‌ స్వశక్తితో ఎదిగి నాయకుడు అయ్యారు’ అని బాలినేని అన్నారు. సభలో మంత్రి దుర్గేశ్‌, ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితరులు మాట్లాడారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు