రాహుల్‌తో అభిషేక్ బెనర్జీ రహస్య సమావేశం
న్యూదిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో వైఫల్యం చెందిన అనంతరం టీఎంసీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీలో రాజకీయ అనిశ్చితి నెలకొంది. నాయకుల్లో నిరాశ, భయం మొదలైంది. దీనితో ఎమ్మెల్యేలు, ఎంపీలు వరుసగా పార్టీని వీడుతుండడంతో టీఎంసీ రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీంతో టీఎంసీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం కోసం ఇటీవల జరిగిన ఇండియా కూటమి సమావేశంలో ఇరుపార్టీల నేతలు చర్చించినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ప్రచారాలను పార్టీ నేతలు కొట్టిపడేశారు. కాగా ప్రస్తుతం మమతా బెనర్జీతో ఉన్న టీఎంసీ ఎంపీలు అభిషేక్ బెనర్జీ నేతృత్వంలో నేడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో రహస్యంగా సమావేశమయ్యారు. దీంతో కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం కానుందనే వార్తలకు బలం చేకూరినట్లైంది. కాగా కాంగ్రెస్‌లో విలీనానికి టీఎంసీ నేతలే మొదట ప్రతిపాదన తెచ్చారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. సొంత పార్టీ నేతల నుంచి తిరుగుబాటు ఎదురవుతుండడం, పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారడంతో ఈ విలీనానికి మమత కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీ ఇమ్రాన్ మసూద్ ఇరు పార్టీల విలీనానికి బహిరంగంగా పిలుపునిచ్చిన కొద్ది రోజులకే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
మమత వస్తే కలుషితం: బెంగాల్ కాంగ్రెస్
మమతను కాంగ్రెస్ అధిష్ఠానం దగ్గరకు తీసుకుంటే 15 ఏళ్ల టీఎంసీ అరాచక, అవినీతి పాలన ప్రభావం పార్టీపై పడుతుందని పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ‘అధిష్ఠానంపై పూర్తి నమ్మకం ఉంది. మమతా బెనర్జీతో పొత్తు ఉండదు. మురికినీరు కలిస్తే స్వచ్ఛమైన నీరు కూడా కలుషితమవుతుంది’ అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అబ్దుల్ మన్నాన్ పేర్కొన్నారు. మరో సీనియర్ నేత అధీర్ రంజన్ చౌధరి కూడా ఘాటుగా స్పందించారు. ‘పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌ను తుడిచేయాలన్న లక్ష్యంతో ఒకప్ప్పుడు మమత పార్టీని చీల్చారు. ఇప్ప్పుడు ఆమే…గాంధీ కుటుంబం మద్దతు కోరుతున్నారు. ఎవరు చేసిన రాజకీయ చర్యలకు వారు బాధ్యత వహించాల్సిందే’ అని అన్నారు.
కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం!
- Advertisement -


