బడ్జెట్ రూ.3,22,359 కోట్లు
. రెవెన్యూ వ్యయం రూ.2,51,162 కోట్లు
. మూలధన వ్యయం రూ.40,635 కోట్లు
. రెవెన్యూలోటు రూ.33,185 కోట్లు
. ద్రవ్యలోటు అంచనా రూ.79,926 కోట్లు
. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన పయ్యావుల, మండలిలో కొల్లు
విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: రాష్ట్ర శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శుక్రవారం రూ.3.22,359 కోట్లతో 2025-26 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టారు. తొలుత ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏర్పాటైన మంత్రివర్గ సమావేశం బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. అనంతరం సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ పత్రాలు అందజేశారు. ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో పయ్యావుల కేశవ్, శాసనమండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. రూ.48,341.14 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను ఆ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు విడిగా ప్రవేశపెట్టారు. మొత్తం బడ్జెట్‌లో రెవెన్యూ వ్యయం రూ.2,51,162 కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ.40,635 కోట్లు, రెవెన్యూ లోటు రూ.33,185 కోట్లు, ద్రవ్యలోటు రూ.79,926 కోట్లుగా అంచనా వేశారు. 2024
25 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ వ్యయం 2,24,342 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ.24,072 కోట్లు, రెవెన్యూలోటు రూ.48,311 కోట్లు. ఇదే కాలానికి ద్రవ్యలోటు రూ.73,362 కోట్లు. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో రెవెన్యూ లోటు 3.01 శాతంగా, ద్రవ్యలోటు 4.57 శాతంగా ఉన్నాయి. ప్రస్తుత బడ్జెట్ అంచనాల్లో జీఎస్డీపీలో రెవెన్యూలోటు 1.82 శాతంగా, ద్రవ్యలోటు 4.38 శాతంగా ఉండవచ్చునని అంచనా వేసింది. గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసకర పరిస్థితుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం ఎంతో క్లిష్టతరమైన అంశంగా పరిగణిస్తున్నామని మంత్రి పయ్యావుల అన్నారు. అంధ్రప్రదేశ్ రుణ సామర్థ్యం సున్నాకు చేరుకుందని, దేశంలోనే అప్పు తీసుకునే వీలులేని ఏకైక రాష్ట్రంగా మిగిలిందన్నారు. ఈ పరిస్థితుల్లో బడ్జెట్‌ను ఎలా రూపొందించాలని తలలు పట్టుకుంటున్న స్థితిలో… ముఖ్యమంత్రి చంద్రబాబు ధైర్యం చెపుతూ ‘అణుదాడిలో విధ్వంసమైన హిరోషిమా నగరం లేచి నిలబడగా లేనిది… ఆర్థిక విధ్వంసానికి గురైన ఏపీని తిరిగి నిలబెట్టలేమా’ అని చెప్పిన మాటల స్ఫూర్తితో ఈ బడ్జెట్‌ను రూపొందించామని వివరించారు. వృద్ధిరేటును 15 శాతానికిపైగా సాధించడం, తలసరి ఆదాయాన్ని పెంచడం, పేదరికాన్ని రూపుమాపడం ద్వారా అభివృద్ధి ఫలాలను అత్యంత అణగారిన వర్గాలకు అందించడమే లక్ష్యంగా బడ్జెట్ కూర్పు చేసినట్లు వెల్లడిరచారు. అప్పులు చేయడమే తప్ప, వాటిని తీర్చడం పూర్తిగా మరిచిన గత ప్రభుత్వ తప్పుడు విధానాలను సరిచేస్తున్నామన్నారు. వీటిలో ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గత ఏడాది జూన్ 12 నాటికి దాదాపు రూ.23,556 కోట్లు బకాయిలు చెల్లించాల్సి వచ్చిందన్నారు. గత ప్రభుత్వం 93 కేంద్ర ప్రాయోజిత పథకాలను నిలిపివేయగా, వాటికి మ్యాచింగ్ గ్రాంట్‌గా చెల్లించాల్సిన రూ.99,371 కోట్ల బకాయిలు చెల్లించి వాటిలో 74 పథకాలను పున:ప్రారంభించామన్నారు. ఇవిగాక నీటిపారుదల, రహదారులకు సంబంధించిన రూ.12,735 కోట్ల బకాయిలు చెల్లించామన్నారు. పంచాయతీలు, మున్సిపాలిటీల బలోపేతం కోసం రూ.2,793 కోట్ల నిధులను, ఎన్టీఆర్ భరోసా, ఎన్టీఆర్ వైద్య సేవ, దీపం 2.0 పథకాలకు రూ.31,613 కోట్లు విడుదల చేశామని తెలిపారు. ఇక రాష్ట్రానికి అత్యంత కీలకమైన అమరావతి, పోలవరం ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వ సహకారంతో మళ్లీ పట్టాలెక్కించామన్నారు. కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత ఆర్థిక వృద్ధి మళ్లీ గాడిన పడిరది. 202425 ఆర్థిక సంవత్సరపు మొదటి ముందస్తు అంచనాల ప్రకారం రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తి 12.94 శాతం వృద్ధి చెందింది. కీలకమైన అన్ని రంగాలు బలం పుంజుకున్నాయి. వీటిలో వ్యవసాయం, అనుబంధ రంగాలు 15.86 శాతం, పరిశ్రమలు 6.71 శాతం వృద్ధి సాధించగా, సేవల రంగం 11.70 శాతం వృద్ధి సాధించిగలిగాయని వివరించారు. తమ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అతికొద్దికాలంలోనే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రధాన హామీలు అమలు చేశామన్నారు. గతంలో రూ.3వేలు ఉండే సామాజిక పెన్షన్‌లను రూ.4 వేలకు పెంచి ఇస్తున్నాం. పేదల కోసం రాష్ట్రవ్యాప్తంగా 204 అన్న క్యాంటిన్లు ఏర్పాటు చేశాం. దీపం 2.0 పథకం కింద ఉచితంగా సిలెండర్లు పంపిణీ, అర్చకులు, ఇమామ్‌లు, మౌజన్‌లకు గౌరవ వేతనం పెంపు, మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ నియామకాలకు శ్రీకారం చుట్టడం వంటివి చేపట్టామన్నారు. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ చెప్పినట్లుగా వ్యవసాయం గాడి తప్పితే మరేదీ సక్రమంగా సాగడానికి అవకాశముండదన్న మాటలను సీరియస్‌గా పరిగణించి ఈ బడ్జెట్‌లో వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధికి కేటాయింపులు చేశామని తెలిపారు. మహిళలు
మహరాణులు అని నమ్మే తమ ప్రభుత్వం దీపం 2.0 పథకాన్ని ప్రారంభించిందన్నారు. ప్రతి తల్లి తన పిల్లలను పాఠశాలకు పంపేలా వారిని ప్రోత్సహించే లక్ష్యంతో మరో సూపర్ సిక్స్ హామీలో భాగంగా 202526 విద్యాసంవత్సరం నుంచి తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించి 1 నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులకు రూ.15 వేల ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. విద్యారంగ అభివృద్దే లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ 100 విశ్వవిద్యాలయాల్లో ఏపీ యూనివర్సిటీలను నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. పేద, మధ్యతరగతి వర్గాలకు కూడా కార్పొరేట్ వైద్యం అందేలా ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమా పథకం అమలు ప్రణాళికలు సిద్ధం చేశాం. రాష్ట్రంలో 95.44 లక్షల గ్రామీణ గృహాలకు తాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. గత ప్రభుత్వంలో విధ్వంసానికి గురైన అమరావతి రాజధానిని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, రాష్ట్ర అభివృద్ధికి గ్రోత్ ఇంజిన్‌గా దోహదం చేసేలా దీనిని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటంలో, ప్రచారం చేయడంలో తెలుగు భాషకున్న ప్రాముఖ్యతను గుర్తించి ఇందుకోసం ప్రత్యేకంగా బడ్జెట్‌లో రూ.10 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఆరోగ్యవంతమైన, సుసంపన్నమైన, సంతోషకరమైన సమాజ నిర్మాణం దిశగా నూతన శకానికి నాంది పలికేందుకు స్వర్ణాంధ్ర
2047 లక్ష్యంగా అభివృద్ధి, సంక్షేమానికి బడ్జెట్‌లో పెద్దపీట వేశామని తెలిపారు. ఇందుకోసం చంద్రబాబు నాయకత్వంలో అందరం మనవంతు తోడ్పాటునందించి స్వర్ణాంధ్ర లక్ష్య సాధనను సాకారం చేసుకుందామని మంత్రి పయ్యావుల కోరారు.