Homeవిభేదాలు… గ్రూపులు సహించను

విభేదాలు… గ్రూపులు సహించను

- Advertisement -

. జగన్‌ కుట్ర రాజకీయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి
. బడ్జెట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లండి
. టీడీపీ నేతలకు సీఎం చంద్రబాబు హెచ్చరిక

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : పార్టీలో ఎక్కడా విభేదాలకు తావుండరాదని, నేతల మధ్య గ్రూపులు సహించబోనని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు హెచ్చరించారు. అసెంబ్లీ సమావేశాలు వాయిదాపడిన తర్వాత ముఖ్యమంత్రి శాసనసభ కాన్ఫరెన్స్‌ హాలులో టీడీఎల్పీ సమావేశం నిర్వహించారు. ఈసమావేశానికి కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌తో పాటు, ఎంపీలు కూడా హాజరయ్యారు. ఈసందర్భంగా మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టికెట్‌ దక్కాలంటే ఎమ్మెల్యేల పనితీరులో మార్పు రావాలని స్పష్టం చేశారు. ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మళ్లీ సభకు రావాలన్న భావనతో పనితీరును మెరుగుపర్చుకోవాలన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలకు మధ్య సమన్వయం ఉండాలని సూచించారు. మరోపక్క వైసీపీ, జగన్‌ కుట్ర రాజకీయాలతో జాగ్రత్తగా ఉండాలన్నారు. వైసీపీ చేసే కుటిల రాజకీయాల పట్ల అప్రమత్తంగా లేకపోవడం వల్లే 2019 ఎన్నికల్లో నష్టపోయామని చంద్రబాబు విశ్లేషించారు. నేరం చేసి పక్కవాడిపై నెపం వేయడంలో వైసీపీ నేతలు సిద్దహస్తులని వివేకా హత్య ఘటనను వివరించారు. వివేకా హత్య కేసులో,కోడి కత్తి వ్యవహారంలో జగన్‌ అండ్‌ కో ఆడిన నాటకాలు, చేసిన కుట్రలపై సీఎం 2019 నుంచి 2024వరకు వరుసగా జరిగిన పరిణామాలను వివరించారు. ఆ కుట్రల పట్ల అప్రమత్తంగా లేకపోవడంతోనే మనం గత ఎన్నికల్లో నష్టపోయామన్నారు.నాడు ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ కూడా కుట్రలను పసిగట్టలేకపోయిందన్నారు. ఇటీవల తాడేపల్లి ప్యాలెస్‌ వద్ద జరిగిన అగ్నిప్రమాదంలోనూ కుట్ర కోణం ఉందని, ఆ ప్రమాదంపై సీసీటీవీ ఫుటేజ్‌ కోరినా ఇవ్వలేదని సీఎం గుర్తు చేశారు. అలాగే గత ఎన్నికలకు ముందు గులకరాయి డ్రామాను తిప్పి కొట్టిన విధానాన్ని గుర్తు చేశారు. ఎమ్మెల్యేలు యాక్టివ్‌గా ఉండాలని, సోషల్‌ మీడియాలో భాగం కావాలని పిలుపునిచ్చారు. మంచిని, నిజాన్ని ముందే గట్టిగా చెప్పక పోతే, వైసీపీ వాళ్లు చెడునే విశ్వవ్యాప్తం చేస్తారని హెచ్చరించారు.కష్టాల్లో కూడా మంచి బడ్జెట్‌ను ప్రజలకు అందించామని, దీనిపై అవగాహన ఏర్పరచుకుని ఈ బడ్జెట్‌ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే బాధ్యత ఎమ్మెల్యేలదే అని చంద్రబాబు అన్నారు. వేదికపై మంత్రి నారా లోకేశ్‌, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ప్రభుత్వ చీప్‌విప్‌ ఆంజనేయులు, ఎమ్మెల్సీ పంచుమర్తి అనూరాధ ఆశీనులయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు