. పొగాకుకు రూ.12,500 ధర చెల్లించాల్సిందే
. కిలోకు రూ.500 తగ్గకుండా కోకో గింజలు
. నష్టపోయిన మిర్చి రైతులను ఆదుకుంటాం
. పూర్తిస్థాయిలో ధాన్యం సేకరణ
. సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశం
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : వ్యవసాయ ఉత్పత్తులకు ధరలు తగ్గకుండా… పంట మొత్తాన్ని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్రంలో పొగాకు రైతులు ఎట్టిపరిస్థితుల్లో నష్టపోకూడదని, పొగాకు రేటు తగ్గకుండా గిట్టుబాటు ధరకు ట్రేడర్లు కొనుగోలు చేయాలని చెప్పారు. రైతులు, పరిశ్రమలు-సంస్థల యజమానులు ఇద్దరితోనూ స్నేహపూర్వకంగా ఉంటానని, అలాగని రైతులకు అన్యాయం జరిగితే మాత్రం సహించేది లేదని సీఎం స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ట్రేడర్లు దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత సంక్షోభాన్ని నివారించాలని సూచించారు. నిర్లక్ష్యం చేసినా… రైతులను ఇబ్బందిపెట్టినా చర్యలు తీసుకోవడానికి వెనుకాడనని ముఖ్యమంత్రి కొనుగోలుదారులను హెచ్చరించారు. ఉండవల్లి నివాసంలో శుక్రవారం ముఖ్యమంత్రి పొగాకు, కోకో, మిర్చి, ధాన్యం కొనుగోళ్లు-గిట్టుబాటు ధరలపై అధికారులు, ట్రేడర్లతో సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా పొగాకు ధర పతనంపై ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. రైతుల్లో నమ్మకం నింపాలని, ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా చూడాలని ఆధికారులకు స్పష్టం చేశారు.
20 మిలియన్ కిలోల పొగాకు లక్ష్యం
హెచ్డీ బర్లీ పొగాకును నాణ్యత ఆధారంగా క్వింటాల్‌కు రూ.12,500కు కంపెనీలు కొనుగోలు చేయాలని చంద్రబాబు స్పష్టంచేశారు. జీపీఐ, ఐటీసీ కంపెనీలు తక్షణమే 20 మిలియన్ కిలోల కొనుగోళ్లు ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. వచ్చే సాగు సీజన్లో అంతర్జాతీయ డిమాండ్, ధరల ఆధారంగా హెచ్డీ బర్లీ సాగు విస్తీర్ణాన్ని నియంత్రించేలా… ఈ రకం సాగు వైపు మళ్లకుండా రైతుల్లో అవగాహన పెంచేందుకు 2025 జూన్ నుంచి సమావేశాలు నిర్వహించాలని సూచించారు. రైతుల ఇళ్లల్లోనూ, పొలాల్లోనూ ఎక్కడా పొగాకు నిల్వలు మిగిలిపోకూడదని, తక్షణం కంపెనీలు కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి అవసరమైతే గోడౌన్లలో నిల్వ ఉంచుకోవాలన్నారు. పొగాకు ధర పతనం కాకుండా చర్యలు తీసుకోవడంలో పొగాకు బోర్డు విఫలమైందని, జీపీఐ, ఐటీసీ వంటి ట్రేడర్లతో సరైన సమన్వయం లేదని ముఖ్యమంత్రి అన్నారు. అత్యధిక ధరలు ఆశ చూపించి రైతులు పొగాకు సాగు చేసేలా చేస్తున్న కంపెనీలు… తీరా పంట చేతికి వచ్చేసరికి అమాంతం ధరలు తగ్గించడం సరికాదన్నారు. కనీస మద్దతు ధర కల్పించకుండా సంక్షోభాన్ని సృష్టిస్తున్నారని కంపెనీల తీరును ముఖ్యమంత్రి తప్పుబట్టారు. ఈ సమస్యను అధిగమించాలంటే బైబ్యాక్ పాలసీ ఉత్తమమని, ఇకపై కంపెనీలతో రైతులు బైబ్యాక్ ఒప్పందం చేసుకోవాలని సూచించారు. కోకో పంట గిట్టుబాటు ధరపై సమీక్షించిన ముఖ్యమంత్రి… కోకో గింజలను కిలోకు రూ.500 ధరకు తగ్గకుండా కొనుగోలు చేయాలని మాండలీజ్ సంస్థకు సూచించారు. కోకో గింజల కొనుగోలులో రైతులను దోపిడీ చేయడాన్ని సహించేది లేదన్నారు. ఇతర కంపెనీలతోనూ సంప్రదింపులు జరిపి కిలో రూ.500 ధరకు కొనుగోలు చేసేలా సమన్వయం చేయాలని సూచించారు. కోకో సాగు నుంచి…. పంట విలువ పెంపు వరకు ప్రణాళికను మాండలీజ్ సంస్థ రూపొందించాలని చెప్పారు. ఆయిల్‌పామ్ తరహాలో ఒక ప్రత్యేక విధానం రూపొందించాల్సి అవసరం ఉందన్నారు.
నష్టపోయిన మిర్చి రైతులతో జాబితా
వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా మిరప పంట విక్రయించిన రైతుల జాబితా సిద్ధం చేయాలని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. తక్కువ ధరకు అమ్మడం ద్వారా రైతులు ఎంతమేర నష్టపోయారనే దానిపై అధ్యయనం చేయాలని చెప్పారు. ఈ జాబితాలో దళారులను పూర్తిగా తొలగించి, నిజమైన రైతులను మాత్రమే చేర్చాలని స్పష్టం చేశారు. మిర్చి సాగులో పురుగుమందుల వినియోగం తగ్గించేలా… ఎగుమతులకు తగ్గట్టు నాణ్యతాప్రమాణాలు పాటించేలా అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్రంలో ఇంకా రైతుల దగ్గర మిగిలి ఉన్న ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. ఇప్పటివరకు ఈ రబీలో 1,41,144 మంది రైతుల నుంచి 17.62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, రూ.3,258 కోట్లు జమ చేసినట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.
యోగా డేకు మోదీ
విశాఖపట్నంలో జరిగే 11వ అంతర్జాతీయ యోగా డేను రికార్డు సృష్టించేలా ఏర్పాట్లు చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. జూన్ 21వ తేదీన జరిగే యోగా డే కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రధాని స్వయంగా ప్రకటించారు. దీంతో ఈ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయేలా చేపట్టే కార్యాచరణపై క్యాంప్ ఆఫీస్‌లో అధికారులతో సీఎం సమీక్ష చేశారు. ప్రధాని వస్తున్న ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించడంతో పాటు… రాష్ట్రంలో యోగా అభ్యాసానికి ఇది నాంది పలకాలి. రాష్ట్రంలో ప్రతి ఒక్కరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలి. కనీసం రెండు కోట్లమందికి ఈ కార్యక్రమం చేరాలి. దీని కోసం ప్రజలను సన్నద్ధం చేసేందుకు ఈనెల 21 నుంచి జూన్ 21 వరకు యోగా నెలగా పాటించాలి. ఏపీలో జరిగే యోగా డే గత పదేళ్ల కార్యక్రమాలను తిరగరాసేలా ఉండాలని సీఎం మార్గనిర్దేశనం చేశారు.