Homeగోదావరి పుష్కరాలకు విస్తృత ఏర్పాట్లు

గోదావరి పుష్కరాలకు విస్తృత ఏర్పాట్లు

- Advertisement -
  • 10 కోట్లమంది పుణ్య స్నానాలు చేసేలా 440 ఘాట్ల అభివృద్ధి
  • రూ.4వేల కోట్లతో పనులు… నాణ్యతపై రాజీలేదు
  • అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ప్రకృతి ఆరాధన-ఆధ్యాత్మిక చింతన మమేకం చేస్తూ గోదావరి పుష్కరాలు వైభవంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఎక్కడా పవిత్రత దెబ్బతినకుండా, భక్తులకు సమస్యలు తలెత్తకుండా ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జులై 7 వరకు 12 రోజుల పాటు పుష్కరాలు అత్యంత వైభవంగా జరిపేలా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. పుష్కరాలు కేవలం ప్రభుత్వం నిర్వహించడమే కాదని… స్థానిక ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు. పుష్కరాల్లో భాగంగా రూ.4,026 కోట్లతో చేపట్టనున్న 4,932 పనులకు సంబంధించి ముఖ్యమంత్రి మంగళవారం సచివాలయంలో సమీక్షించారు. పుష్కరాలకు ఇంకా 10 నెలల సమయమే ఉన్నందున త్వరితగతిన అన్ని పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేయాలన్నారు. పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని స్పష్టం చేశారు. 2015 మహా పుష్కరాల్లో ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 4.86 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు చేయగా. 2027లో 8 నుంచి 10 కోట్ల మంది గోదావరి పుష్కరాలకు తరలి వస్తారని అంచనా వేస్తున్నట్టు అధికారులు వివరించారు. రోజుకు సుమారు కోటి మంది పుణ్య స్నానాలు చేసే అవకాశం ఉందన్నారు.
రద్దీని తట్టుకునేలా మొత్తం 440 ఘాట్లు సిద్ధం చేస్తున్నామన్నారు. వీటిలో ప్రస్తుతం ఉన్న 259 ఘాట్లను అభివృద్ధి చేయడంతో పాటు అదనంగా 181 కొత్త ఘాట్లను నిర్మిస్తున్నామన్నారు.
టెంపుల్ టూరిజంపై ప్రత్యేక దృష్టి
గోదావరి పరివాహక ప్రాంతంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయని, పిఠాపురంలో శక్తి పీఠం సహా పంచారామాల్‌లో 4 క్షేత్రాలు, ఇంకా ద్వారకా తిరుమల, అన్నవరం, వాడపల్లి, అంతర్వేది వంటి ప్రధాన ఆలయాలను కలుపుతూ టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి చేయాలని సీఎం అధికారులకు సూచించారు. పుష్కరాలకు వచ్చే భక్తులు పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించేందుకు వీలుగా హోం స్టేలను ప్రోత్సహించాలన్నారు. కొత్తగా హోటళ్ల నిర్మాణం చేపట్టేవారికి త్వరితగతిన అనుమతులు ఇవ్వాలన్నారు. అలాగే రాజమహేంద్రవరంలో వివిధ కార్యక్రమాల నిర్వహణ కోసం కన్వెన్షన్ సెంటర్ నిర్మించాలి.
దేశ విదేశాల్లో ప్రముఖులు అందరికీ గోదావరి పుష్కరాలకు ఆహ్వానం అందించాలి. రాష్ట్ర విశిష్టత తెలిసేలా, ప్రతిష్ట పెరిగేలా చేసేందుకు ఇదొక అవకాశంగా భావించాలి. కూచిపూడి ఈవెంట్ వంటివి భారీ తరహాలో నిర్వహించేలా దేవా దాయ-పర్యాటక శాఖలు ప్రణాళికలు రూపొందించాలి. పుష్కర ఘాట్లను కలిపే రహదారుల నిర్మాణం సహా, పుష్కరాలు జరిగే 6 జిల్లాలో ఏ రోడ్లపైనా గుంతలు కనిపించకూడదు. పోలవరం ప్రాజెక్టును సందర్శించేలా రహదారుల నిర్మాణం జరగాల్సి ఉంది. బ్రిడ్జిల సామర్ధాయూన్ని పరిశీలించి, దానికి అనుగుణంగా మరమ్మతులు చేయాలి. గోదావరిలో చుక్క కూడా మురుగు నీరు కలవకుండా చూడాలి. అధికారులు ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలి. హేవ్లాక్ బ్రిడ్జి, సమీపంలో దీవుల అభివృద్ధి పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. దేశ, విదేశాల నుంచి వచ్చే భక్తులు, పర్యాటకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రపంచస్థాయి మౌలిక వసతులు, రవాణా, పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్య సేవలు, భద్రత, వసతి, సాంకేతిక పరిజ్ఞానంతో సమగ్ర ఏర్పాట్లను అద్భుతంగా చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు. గోదావరి జన్మస్థానం నుంచి సముద్ర సంగమం వరకు అనేక ఉప నదులు, వాగులు, ఏరులు కలుస్తున్నందున ‘అఖండ గోదావరి’ పేరుతో పుష్కరాలు నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు. ఈ సమీక్షలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, వై సత్యకుమార్ యాదవ్, గోదావరి పుష్కరాల ప్రత్యేకాధికారి, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు