Homeసీమకు నీటి కోసం సీపీఐ ఆందోళన

సీమకు నీటి కోసం సీపీఐ ఆందోళన

- Advertisement -

మైదుకూరులో భారీ ప్రదర్శన
పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ నుంచి నీరు విడుదల చేయాలని డిమాండ్

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి రాయలసీమకు నీటిని విడుదల చేయకపోవడంపై సీపీఐ మండిపడింది. ఎగువప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద జలాలు వస్తున్నాయని, ప్రాజెక్టులో 175 టీఎంసీలు, 874 అడుగుల ఎత్తు వరకు నీరు ఉందని, అయినా రాయలసీమకు నీరు ఇవ్వకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యమని విమర్శించింది. ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించింది.

విశాలాంధ్ర`మైదుకూరు: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి రాయలసీమకు నీటిని విడుదల చేయకపోవడంపై సీపీఐ మండిపడింది. ఎగువప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద జలాలు వస్తున్నాయని, ప్రాజెక్టులో 175 టీఎంసీలు, 874 అడుగుల ఎత్తు వరకు నీరు ఉందని, అయినా రాయలసీమకు నీరు ఇవ్వకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యమని నిందించింది. ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించింది. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీ నుంచి రాయలసీమకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ మంగళవారం ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా మైదుకూరు నాలుగు రోడ్ల కూడలిలో బహిరంగ సభ జరిగింది. సీపీఐ కడప జిల్లా కార్యదర్శి గాలి చంద్ర మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావం వల్ల రాయలసీమలో తగినంత వర్షపాతం నమోదు కాలేదు. సాధారణ సాగు కూడా కనిపించడం లేదు. వాతావరణం వేసవిని తలపిస్తోంది. ఎండలు మండుతున్నాయి. భూగర్భ జలాలు గణనీయంగా పడిపోతున్నాయి. మేత లేక పశువులు కబేళాలకు తరలిపోతున్నాయని ఆయన అన్నారు. ఎగువ నుంచి శ్రీశైలానికి వరద నీరు వస్తున్నప్పటికీ విద్యుత్ ఉత్పత్తి పేరుతో ఆ నీటిని నాగార్జున సాగర్‌కు తరలిస్తున్నారని, రాయలసీమ ప్రాజెక్టులపై మాత్రం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి కేవలం 8 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం ద్వారా ఒరిగేదేమిటని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి 44 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 80శాతం పూర్తయిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అర్ధాంతరంగా ఆపేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప రాయలసీమ ప్రయోజనాలు ఎక్కడున్నాయని నిలదీశారు. కరవు పీడిత ప్రాంతాల పట్ల ఎగువ రాష్ట్రాలకు ఉన్న శ్రద్ధ చంద్రబాబు ప్రభుత్వానికి లేకపోవడం విచారకరమన్నారు. గోదావరి నదీ జలాలను పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు, శ్రీశైలం నుండి రాయలసీమకు నీటిని తరలిస్తామని చంద్రబాబు నమ్మబలికారని, ఆచరణలో అది ఎక్కడా కనిపించడం లేదన్నారు. శ్రీశైలంలో నీళ్లు ఉన్నా రాయలసీమకు ఎందుకు నీరివ్వడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబుకు అమరావతి, పోలవరం తప్ప రాయలసీమ కనిపించడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు ఎంవీ సుబ్బారెడ్డి, సీపీఐ, ప్రజాసంఘాల నాయకులు పి.శ్రీరాములు, వి.వీరశేఖర్, పి.సుబ్బరాయుడు, పి.మస్తాన్, పీవీ రమణ, ఇమ్మానియేల్, పడిగే వెంకటరమణ, రవికుమార్, మిడుతూరు ప్రసాద్, పి.భాస్కర్, ప్రభాకర్, షేక్ షావలి, ఏవీ శివరాం, బీవీ శ్రీనివాసులు, సుబ్బరాయుడు, పవన్, ఓబులేసు, సఫా, నాగరాజు, కేశవ, హరి, ప్రమీల, సుజాత, రామమూర్తి, శంకర్ రెడ్డి, రామాంజనేయులు, ఓబుళపతి, శేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు