. ఎగుమతిదారుల పోటీతో పెరిగిన ధరలు
. క్వింటా మిర్చి గరిష్టంగా రూ.24 వేలు
. తాలుకాయలకూ గిరాకీ!
. నష్టాల్లో ఉన్న రైతులకు ఉపశమనం
విశాలాంధ్ర -సచివాలయం: ఆకాశమే హద్దుగా మిర్చి ధరలు దూసుకుపోతున్నాయి. ఇన్నాళ్లూ ‘ధరల లేమితో’ కుదేలైన మిర్చి రైతుకు ఈ సీజన్ ఎర్ర బంగారం అందించింది. మిర్చి రైతులకు ఈ ఏడాది సంక్రాంతి తర్వాత అదృష్టం తలుపు తట్టింది. గత ఏడాది ధరలు లేక కుదేలైన రైతాంగానికి, ఈ ఏడాది మార్కెట్ పరిస్థితులు భారీ ఊరటనిస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా కొన్ని ప్రత్యేక రకాల మిర్చి ధరలు రికార్డులను తిరగరాస్తున్నాయి. రాష్ట్రంలో మిర్చి సాగు వివరాలను జిల్లా లవారీగా పరిశీలిస్తే, రాష్ట్రం మొత్తం మీద సాగు విస్తీర్ణం…దిగుబడిలో గుంటూరు, పల్నాడు, కర్నూలు జిల్లాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ప్రస్తుత 2026 సీజన్ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ప్రధానంగా ఉమ్మడి గుంటూరు, ప్రకాశం కర్నూలు జిల్లాల్లోనే 95 శాతం పైగా సాగు జరుగుతోంది. జిల్లాలవారీగా హెక్టార్లలో పంట విస్తీర్ణ వివరాలు ఇలా ఉన్నాయి… పల్నాడు 60 వేలు, కర్నూలు 55 వేలు, ప్రకాశం 35 వేలు, గుంటూరు 20 వేలు, బాపట్ల 17 వేలు, ఎన్టీఆర్ 12 వేలు, కృష్ణా 10 వేలు, ఇతర జిల్లాల్లో 7వేల హెక్టర్లలో మిర్చి సాగైంది. మిర్చి విస్తీర్ణంలో పల్నాడు ప్రథమ స్థానంలో ఉండగా, మార్కెటింగ్ ,వాణిజ్య పరంగా గుంటూరు కేంద్ర బిందువుగా ఉంది. బాపట్ల, పల్నాడు జిల్లాలు హెక్టారుకు అత్యధిక దిగుబడి సాధిస్తున్న జిల్లాలుగా రికార్డు సృష్టించాయి. గత ఏడాదితో పోలిస్తే సాగు ఖర్చులు పెరగడం, గతేడాది సరైన ధరలు లేకపోవడం వల్ల ఈసారి సాగు విస్తీర్ణం కొంత మేరకు తగ్గింది. అయితే ప్రస్తుత గిరాకీ దృష్ట్యా రైతులు వచ్చే సీజన్లో సాగును పెంచే అవకాశం ఉంది. ఈ సీజన్లో నాణ్యతతో కూడిన కొత్త పంట రావడంతో వ్యాపారుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ప్రధానంగా ఎగుమతి రకాలకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. ఆసియాలోనే అతిపెద్దదైన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డులో అనూహ్య రీతిలో మిర్చి ధరలు పెరిగాయి. ఒక్కో రకం క్వింటాకు రూ. 20 వేల మార్కును సునాయాసంగా దాటేసి, రికార్డు స్థాయి లావాదేవీలకు వేదికైంది. ప్రీమియం రకాలైన 2043 రకం అత్యధికంగా 24 వేలు పలికింది. ఆ తర్వాతి స్థానాల్లో డీడీ 22,500, 341 రకం 21,500 వద్ద ట్రేడ్ అయ్యాయి. సాధారణ రకాలు సూపర్-10, సువర్ణ, బ్యాడిగి క్వింటాకు రూ.20 వేల చొప్పున అమ్ముడయ్యాయి. గత కొద్ది రోజులుగా స్తబ్దుగా ఉన్న ‘తేజ’ రకం సైతం పుంజుకుని 16 వేల కు చేరింది. ఈసారి మార్కెట్లో కనిపించిన అతిపెద్ద మార్పు ఏమిటంటే తాలు కాయకు లభించిన డిమాండ్. గతంలో నాణ్యమైన కాయలకు లభించే ధరలు ఇప్పుడు తాలు కాయలకు లభిస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తేజ తాలు రకం రూ.11,500 నుంచి 12,000, సీడ్ తాలు రూ.14,000 నుంచి 14,500 పలుకుతున్నాయి. చైనా, థాయ్‌లాండ్ దేశాల నుంచి ఆర్డర్లు పెరగడమే మార్కెట్ జోష్‌కు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. కొత్త పంటలో రంగు, కారం (ఘాటు) సమపాళ్లలో ఉండటం కూడా కారణమైంది. ధరలు పెరగడానికి ప్రధాన కారణాలేంటంటే… సాగు విస్తీర్ణం తగ్గటం.. గత ఏడాది (2024-25) ధరలు లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఫలితంగా ఈ ఏడాది సాగు విస్తీర్ణం 1.96 లక్షల హెక్టార్ల నుండి 1.08 లక్షల హెక్టార్లకు (సుమారు 45 శాతం తగ్గుదల) పడిపోయింది. చైనాకు ఏటా 2 లక్షల టన్నుల తేజా రకం ఎగుమతి అవుతుండగా, ఈసారి చైనాతో పాటు వియత్నాం, థాయ్‌లాండ్ దేశాల నుండి డిమాండ్ రెట్టింపైంది. అకాల వర్షాల వల్ల గతేడాది 11.67 లక్షల టన్నుల దిగుబడి రాగా, ఈ ఏడాది అది కేవలం 5.85 లక్షల టన్నులకే పరిమితం కావచ్చని అధికారుల అంచనా. గత ఏడాది స్టాక్ తక్కువగా ఉండటంతో కంపెనీలు భారీగా కొనుగోళ్లు జరపడంతోపాటు గత ఏడాది అప్పుల ఊబిలో చిక్కుకున్న రైతుకు, ప్రస్తుత మార్కెట్ పరిస్థితి రైతుల కళ్లల్లో కాంతులు నింపింది. గుంటూరు మార్కెట్ యార్డులో నిత్యం 50 వేల నుండి 60 వేల టిక్కీలు వరకు కొత్త పంట వస్తోంది. నాణ్యతతో పాటు రంగు, ఘాటు అధికంగా ఉన్న కాయల కోసం వ్యాపారులు పోటీ పడుతున్నారు. గతేడాది క్వింటా రూ.10 వేల నుంచి 15 వేలకే పరిమితమైన మిర్చి, ఇప్పుడు రెట్టింపు ధర పలుకుతుండటం రైతుల్లో ఆత్మవిశ్వాసం నింపుతోంది. ఇదే ఊపు కొనసాగితే గత ఏడాది మిర్చి రైతులు చవిచూసిన ఆర్థిక నష్టాల నుంచి ఉపశమనం లభించనుంది.


