Homeవిశ్లేషణచరిత్రగతిని మార్చిన అక్టోబరు సోషలిస్టు విప్లవం

చరిత్రగతిని మార్చిన అక్టోబరు సోషలిస్టు విప్లవం

- Advertisement -

108 సంవత్సరాల క్రితం 1917 అక్టోబర్‌లో రష్యాలో జరిగిన సోషలిస్టు విప్లవం ప్రపంచ చరిత్రగతిని మార్చిన మహత్తర ఘటన. పెట్టుబడిదారీ విధానానికి గట్టి సవాల్‌ విసిరిన సంఘటన. పెట్టుబడిదారీ విధానం నుంచి సోషలిజానికి పరివర్తన చెందేందుకు జరిగిన మౌలిక మలుపు. 1917 అక్టోబర్‌ విప్లవం పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఆనందం వ్యక్తం అయింది. మానవజాతి చరిత్రలో నూతనదశ ప్రారంభమైంది. జారుచక్రవర్తి ‘జైలు’లాంటి సామ్రాజ్యంలోని వందకు పైగా జాతులు గల ప్రాంతంలో అధికారం కార్మిక, కర్షక సోవియట్‌ రాజ్యం చేతిలోకి వచ్చింది. సుదీర్ఘమైన, భీకర పోరాట అనంతరం మాత్రమే ఇది సాధ్యమైంది. లెనిన్‌ నాయకత్వాన బోల్షివిక్‌ వీరులు సామాజిక నిర్మాణంలోని పెట్టుబడిదారీ పొరను చీల్చి పారేశారు. వర్గాధిపత్యాన్ని ధైర్యంగా బద్దలు కొట్టి, నూతన మార్గం చేపట్టారు. యావత్‌ మానవ జాతికి భవిష్యత్తు అవకాశాలను ఆవిష్కరించింది. చరిత్ర పూర్వదశ అంతమై ‘‘చరిత్ర ప్రారంభదశ’’ ప్రారంభమైందని సగర్వంగా ప్రకటితమైనది. విప్లవం పశ్చిమ దేశాల్లో కాకుండా వెనకబడిన రష్యాలో సంభవించడం పట్ల అనేక మంది మేధావులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే, సామ్రాజ్యవాదుల మధ్య పరస్పర అనైక్యతను లెనిన్‌ గమనించారు. ప్రపంచ పెట్టుబడిదారీ దేశాల గొలుసులో అతి బలహీనమైన లింకు రష్యాలోని జారిజమేనని లెనిన్‌ నిర్ధారణకు వచ్చారు. ఆయన నాయకత్వంలో సోవియట్‌ ప్రజలు దాన్ని బద్దలుకొట్టి, మొట్టమొదటి సోషలిస్టు రాజ్యాన్ని స్థాపించారు. ఆ కర్తవ్యాన్ని సాధించడానికి అజేయమైన ఒక సిద్ధాంత శక్తినీ దానిపై ఏర్పడిన పార్టీని ఆయన నిర్మించారు. విప్లవ కేంద్రం పశ్చిమం నుంచి తూర్పుకు కదులుతూ ఉందని రుజువు చేశారు. బోల్షివిక్కులు సకాలంలో దృఢంగా ముందుకు సాగారు, గనుక విప్లవం సాధ్యమైంది. రష్యా బాగా వెనకబడి వుంది, కాబట్టి అది విప్లవం నిర్వహించలేదని మరికొం దరు వాదించారు. ఈ వాదనలను లెనిన్‌ ప్రతిభావం తంగా తిప్పికొట్టారు. ’’ఒక వైపేమో బాగా వెనకబడిన భూయాజమాన్య వ్యవసాయం, అత్యంత అమాయకులైన రైతాంగం, మరో వైపేమో బాగా అభివృద్ధి చెందిన పారిశ్రామిక పెట్టుబడీ, ఫైనాన్స్‌ పెట్టుబడి’’ రాజ్యమేలు తున్నాయని లెనిన్‌ చెప్పారు. విప్లవాన్ని సాధ్యం చేసేం తగా రష్యాలోని ఉత్పాదక శక్తులు వృద్ధి చెందలేదన్న వాదనలను లెనిన్‌ తిరస్కరిం చారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో సామ్రాజ్య వాద యుద్ధాన్ని రష్యన్‌ ప్రజల అంతర్యుద్ధంగా మార్చాలని ఆయన పిలుపు నిచ్చారు. అందుకోసం విప్లవ శక్తులను సంఘటితం చేశారు. ఆ తర్వాత, అక్టోబర్‌ విప్లవాన్ని సాధించారు.
రష్యాలో నూతనంగా అధికారాన్ని స్వీకరించిన కార్మిక, కర్షక, విప్లవశక్తులు నూతన సమాజ నిర్మాణానికి పూనుకున్నాయి. జార్‌ చక్రవర్తికి అనుకూలంగా ఉండే ప్రతిఘాతశక్తులు, అంతర్‌ యుద్ధానికి తెగబడ్డాయి. బూర్జువావర్గం ఎడతెగకుండా శత్రుచర్యలు కొనసాగించింది. మరోవైపు, బాల్యావస్థలో ఉన్న సోషలిస్టు వ్యవస్థను కూల్చి, తిరిగి పెట్టుబడిదారీ, భూస్వామ్య వ్యవస్థను పునరుద్ధరించాలనే దుష్టతలంపుతో 14సామ్రాజ్యవాద దేశాలు రష్యాపై సైనికదాడికి పాల్పడ్డాయి. బ్రిటిష్‌ ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్‌ సోవియట్‌ యూనియన్‌ పీకపిసికి పారేయాలనుకున్నాడు. అప్పటికి సాధ్యంకాలేదు. నాటి నుంచి నిరంతరాయంగా సామ్రాజ్యవాదులు తమ శత్రుచర్యలను కొనసాగిస్తూనే వచ్చారు. జోక్యందారీ యుద్ధాలు, ఆర్థికదిగ్బంధనాలు, విప్లవ ప్రతీఘాతక శక్తులకు సహాయం, సోషలిజంపై ఎడతెగని నిందా ప్రచారం, ఇంకా ఇతరేతర బెదిరింపులు, ఇవే శత్రువులు వాడిన ఆయుధాలు! వర్గ శత్రువును దీటుగా ప్రతిఘటించటానికి 1918 ఫిబ్రవరిలో ఎర్రసేన ఏర్పాటు అయింది. మొదటి ప్రపంచ యుద్ధం, మూడేళ్లు సాగిన అంతర్యుద్ధం, విదేశీ సైన్యాల ముట్టడితో రష్యా ఆర్థిక పరిస్థితి ఘోరంగా దెబ్బతిన్నది. జోక్యందారీ యుద్ధాలను 1920 లో సోవియట్‌ ప్రభుత్వం తిప్పికొట్టగలిగింది. ఈ కాలంలో ‘‘యుద్ధకమ్యూనిజం’’ విధానాన్ని అమలు జరిపారు. ప్రజలు దుర్భర పరిస్థితుల నెదుర్కొన్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం కోసం లెనిన్‌ నూతన ఆర్థిక విధానాన్ని ప్రవేశ పెట్టారు. 1921 నాటికి సోవియట్‌లో పరిస్థితులు కొంతవరకు కుదుటపడ్డాయి. రెండు ముందడుగులు వేయటానికి వీలుగా ఒక వెనకడుగు వేయటానికి కూడా తాము సుముఖమేనని లెనిన్‌ స్పష్టంచేశారు. వివిధ జాతుల సమ్మేళనంతో 1922 డిసెంబర్‌ 30 వ తేదీన యూనియన్‌ ఆఫ్‌ సోవియట్‌ సోషలిస్ట్‌ రిపబ్లిక్‌ ఏర్పడిరది. మొత్తం15 రిపబ్లిక్‌లలో 8 ఆసియా ప్రాంతానికి చెందినవి. తద్వారా యూరప్‌, ఆసియాల సోవియట్‌ రిపబ్లిక్‌ యూనియన్‌ ఏర్పడుతున్నదని లెనిన్‌ అన్నారు. ఇది ప్రపంచ ప్రాముఖ్యతగల చారిత్రక ఘటన. నూతన ఫెడరేషన్‌లోని రిపబ్లిక్‌లన్నీ సమానమైన హోదా గలవే. ప్రపంచమంతా కత్తి కట్టినప్పటికీ సోవియట్‌ విజయవంతమైంది. దాని విజయ రహస్యం కార్మికుల, సమిష్టి క్షేత్ర కర్షకుల, ప్రజామేధావుల మైత్రిలోనూ, యూఎస్‌ఎస్‌ఆర్‌లోని జాతుల, ఉప జాతుల స్నేహంలోనూ ఉన్నది. అమెరికా మాత్రం సోవియట్‌ యూనియన్‌ను 1930 వరకు గుర్తించలేదు. ప్రజల అవసరాలు తీర్చడంలో సోవియట్‌ యూనియన్‌ గణనీయమైన, ఆశ్చర్యకరమైన విజయాలు సాధించింది. రష్యాలోని బీడు భూములన్నిటిని సాగులోకి తీసుకురావడానికి లక్ష ట్రాక్టర్లు అవసరం అవుతాయని అంచనా వేశారు. అయితే ఒక్క రష్యన్‌ ఫెడరేషన్‌లోనే లక్షలాది ట్రాక్టర్లు ఉత్పత్తి అయ్యాయి. దుర్భర దరిద్రాన్ని అనుభవిస్తూ, ఎలాంటి చదువు సంధ్యలు, ఆస్తులు లేక సంచార జీవులుగా ఉండే టర్క్‌మేనియాలో ఆధునిక యంత్రాలను నడిపే నైపుణ్య కార్మికులు, సమిష్టి క్షేత్ర కర్షకులు తయారయ్యారు. ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలు, రచయితలు తయారయ్యారు. నిరక్షరాస్యతను నిర్మూలించారు. ప్రతి ఒక్కరికి ఇల్లు, విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధి హామీ కల్పించారు. శాస్త్ర, సాంకేతిక రంగాలలో అపారమైన అభివృద్ధిని సాధించారు. సోవియట్‌ యూనియన్‌లో ప్రారంభించిన విద్యుదీకరణ కార్యక్రమాన్ని అనేక ప్రాంతాల్లో ‘‘లెనిన్‌ లాంతర్లు’’గా పిలిచేవారు. విద్యుత్‌ ఉత్పత్తికోసం భారీ టర్బైన్లు తయారయ్యాయి. భారీ ఇరిగేషన్‌ ప్రాజెక్టులు, రైల్వే లైన్లు, తెల్ల సముద్రం బాల్టిక్‌ కాలువ, ఉత్తర ధ్రువానికి చెల్యూషిన్‌ విమానయానం తదితర బ్రహ్మాండమైన విజయాలు సాధించారు. ‘‘ప్రతి వంట మనిషి ప్రభుత్వాన్ని నడపడం నేర్చుకోవా’’ లన్న లెనిన్‌కు ఇష్టమైన నినాదాన్ని వాస్తవం చేశారు. అక్టోబర్‌ విప్లవంతో చరిత్రలో ఒక నూతన శకం ప్రారంభమైంది. చైనా, వియత్నాం, క్యూబా ఇంకా అనేక దేశాలు తమతమ సొంత లక్ష ణాలతో సోషలిజం దిశగా విప్లవోద్యమ బాటపట్టాయి. శతాబ్దాలుగా సామ్రాజ్యవాద దేశాల పాలన కింద నలిగిపోతున్న వలస దేశాలకు ఒక ఆశాకిరణం కనపడిరది. తమ విముక్తి పోరాటాలకు సహాయపడే ఒక శక్తిగా సోవియట్‌ యూనియన్‌ను ఆ దేశాలు పరిగణించాయి.
రెండో ప్రపంచ యుద్ధంలో, 1941 నుంచి 45 వరకు హిట్లర్‌ ఫాసిజంపై జరిగిన యుద్ధంలో సోవియట్‌ యూనియన్‌ గడ్డురోజుల్ని ఎదుర్కొన్నది. ఫాసిజాన్ని ఓడిరచేందుకు సోవియట్‌ సాధించిన పారిశ్రామికీకరణ, ఆధునీకరణ రెడ్‌ఆర్మీకి ఎంతగానో తోడ్పడ్డాయి. నాజీలను నిలువరించి బెర్లిన్‌ వరకు ఎర్రసైన్యం విజయ యాత్ర సాగించింది. యూరప్‌ దేశాల విముక్తికి సహాయపడిరది. ఈ యుద్ధంలో దాదాపు 4 కోట్లమంది సోవియట్‌ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. యుద్ధానంతర పరిణామాలు ప్రపంచ రాజకీయ దృశ్యాన్ని పూర్తిగా మార్చివేశాయి. తూర్పు యూరప్‌లో సోషలిస్టు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. భారత్‌ తదితర వలస దేశాలలో జాతీయోద్యమాలు విజృంభించి స్వతంత్ర దేశాలుగా ఆవిర్భవించాయి. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో 1949లో ప్రజా చైనా ఏర్పడిరది. అది 20 వ శతాబ్దంలో జరిగిన మరొక గొప్ప పరిణామం. సామ్రాజ్యవాద దేశాలు1946 నుంచి సోవియట్‌ యూనియన్‌పై తమ ప్రచ్ఛన్న యుద్ధాన్ని కొనసాగించాయి. ఆధిపత్య ధోరణిలో ‘నాటో’ లాంటి సామ్రాజ్యవాద సైనిక కూటములు ఏర్పడ్డాయి. సైనిక, రక్షణ బడ్జెట్లు పోటాపోటీగా పెరుగుతూ వచ్చాయి. ఆర్థిక పరిస్థితి దిగజారుతూ వచ్చింది. దీనితో సోషలిజం అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడ్డాయి. ఈ గడ్డు సమస్య నుంచి సోవియట్‌ యూనియన్‌ బయట పడలేకపోయింది. ముందుగా 1989 లో తూర్పు యూరప్‌ దేశాలలో సోషలిస్ట్‌ వ్యవస్థ కుప్పకూలింది. ఆ తర్వాత 1991 లో సోవియట్‌ యూనియన్‌లోని సోషలిస్టు వ్యవస్థ కూడా విచ్ఛిన్నం అయింది. పెట్టుబడిదారీ, సామ్రాజ్యవాద మేధావులు తెగ సంబరపడిపోయారు. పెట్టుబడిదారీ విధానానికి ఇక తిరుగులేదని వాదిస్తున్నారు. చరిత్ర ముగిసిందనీ, పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రత్యామ్నాయం లేదని ఫుకయామా లాంటి ఆర్థికవేత్తలు ప్రగల్బాలు పలికారు. పెట్టుబడిదారీ విధానం, దాని అంతర్గత వైరుధ్యాలతో సంక్షోభాల సుడిగుండంలో చిక్కుకుపోతున్న వాస్తవాన్ని వారు దాచే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని వైఫల్యాలు ఎదురైనా కమ్యూనిస్టు ఉద్యమం ఆగిపోలేదు. చరిత్ర నుంచి కమ్యూనిస్టు ఉద్యమం గుణపాఠాలను తీసుకుంటూ, ముందుకు సాగుతూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా సోషలిజం ఒక ఆచరణాత్మక ఉద్యమంగా నిలదొక్కుకొని పుంజుకుంటున్నది. ప్రపంచ వ్యాప్తంగా 12 కోట్లమందికిపైగా సభ్యులతో దాదాపు 120 దేశాలలో వివిధ పేర్లతో కమ్యూనిస్టు పార్టీలు పనిచేస్తున్నాయి. ప్రపంచమంతటా ఫాసిస్టు, పెట్టుబడిదారీ ఆర్థిక విధానాలకు బలమైన ప్రజాప్రతిఘటన నానాటికీ పెరుగుతోంది. సోషలిజం మరిన్ని విజయాలను సాధించుకునే శతాబ్ది ఇది.
ఏఐటియుసి రాష్ట్ర గౌరవాధ్యక్షులు
ఫోన్‌ : 9490193263.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు