విశాలాంధ్ర ` హైదరాబాద్ : జిహెచ్‌ఎంసి ద్వారా నగరంలో అమలు చేస్తుతున్న వివిధ పథకాలు ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు దోహద పడుతున్నా యని ట్రైనీ ఐఏఎస్‌లు అభిప్రాయ పడ్డారు. 2023 సంవత్సరంలో ఐఏఎస్‌లుగా ఎంపికై తెలంగాణ రాష్ట్రానికి కేటాయింపు అయిన ట్రైనీ ఐఏఎస్‌లు పలు జిల్లాలో ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్‌గా పని చేసి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం ద్వారా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీరికి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించిన అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. సోమవారం జిహెచ్‌ఎంసి ప్రజలకు అందిస్తున్న సేవలు, సంస్థ ఆర్థిక వనరులు, మౌలిక సదుపాయాల గురించి జిహెచ్‌ఎంసికి వచ్చిన ట్రైనీ అధికారులకు కూకట్‌పల్లి జోనల్ అధికారి అపూర్వ చౌహాన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా జోనల్ కమీషనర్ శానిటేషన్, భవన నిర్మాణ వ్యర్థాలు (సి అండ్ డి), హెల్త్, వెటర్నరీ, ఎంటమాలజీ, ఇంజనీరింగ్ మెయింటెనెన్స్, ఎస్.ఎన్.డి.పి, ఎస్.ఆర్.డి.పి, సి.ఆర్.ఎం.పి పథకాలు, రెవెన్యూ, యుబిడీ, స్పోర్ట్స్, డబుల్ బెడ్ రూం ఇళ్లు, నాలా పూడికతీత, మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్, స్ట్రీట్ లైట్ వివరాలను వివరించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమీషనర్‌తో పాటుగా వికారాబాద్ జిల్లాలో ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్‌గా పని చేసిన మిస్ ఉమా హారతి, నారాయణ పేట్‌లో పని చేస్తున్న మిస్ గరిమ నారుల, ఈ.ఈ.యస్.ఎస్.డి మనోజ్ (సంగారెడ్డి), అజయ్ యాదవ్ (కరీంనగర్), సాకేత్ కుమార్ (నిజామాబాద్), అభిగ్యాన్ మాల్వియా (ఆదిలాబాద్), మృణాల్ శ్రేష్ట (ఖమ్మం జిల్లా) అసిస్టెంట్ కలెక్టర్లు, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థ కోర్స్ డైరెక్టర్ డా.కందుకూరి ఉషా రాణి, జీహెచ్‌ఎంసీ చీఫ్ వెటర్నరీ డాక్టర్ అబ్దుల్ వకీల్ తదితరులు పాల్గొన్నారు.