. రాష్ట్రానికి వచ్చి చూశాకే నిర్ణయం తీసుకోండి
. రికార్డు సమయంలో అన్ని రకాల అనుమతులిస్తాం
. వచ్చే జనవరికి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ సిద్ధం
. సీఐఐ వార్షిక సదస్సులో సీఎం చంద్రబాబు
. సీఎం స్పందనపై పారిశ్రామికవేత్తల హర్షం
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతమని, రాష్ట్రానికి ఒక్కసారి వచ్చి ప్రత్యక్షంగా చూసిన తర్వాతే పెట్టుబడులు పెట్టాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పారిశ్రామికవేత్తలను కోరారు. దిల్లీ వేదికగా శుక్రవారం జరిగిన సీఐఐ వార్షిక సదస్సులో ‘ఆర్థికాభివృద్ధి – సుస్థిరత – ఆంధ్రప్రదేశ్ బ్లూప్రింట్’ అనే అంశంపై సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఇదే సందర్భంలో పారిశ్రామికవేత్తలు అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు. రాష్ట్రంలో ఉన్న పెట్టుబడులకున్న అవకాశాలు, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, రూపొందించిన విధానాలను సీఎం వివరించారు. స్వర్ణాంధ్ర విజన్ -2047లో పారిశ్రామిక భాగస్వామ్యాన్ని కోరుతున్నట్టు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ… ‘‘ప్రస్తుతం సీబీఎన్ అనే బ్రాండ్ ద్వారా ఏపీకి పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాం. క్రెడిబిలిటి అనేది రాత్రికి రాత్రి వచ్చేది కాదు. ఏపీకి రండి… పరీక్షించండి… ఆ తర్వాతే పెట్టుబడులు పెట్టండి. 2026 దేశంలోనే మొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ అమరావతిలో ఏర్పాటు అవుతుంది. దీన్ని పారిశ్రామికవేత్తలు వినియోగించుకోవాలి. క్యాంటం కంప్యూటింగ్ విస్తృతం అవుతోంది. డ్రోన్స్, ఐఓటీ, సెన్సార్లు ఇలా వివిధ రకాల సాంకేతికతతో రియల్ టైమ్ డేటా అందుబాటులోకి వస్తోంది. ప్రస్తుతం ఈ రంగాల్లో పెట్టుబడిదారులు అవసరం. భవిష్యత్తులో ఈ రంగానికి మంచి డిమాండ్ ఉంది. దీనికి అమరావతి కేంద్రం కానుంది. టీసీఎస్,ఐబీఎం,ఎల్ అండ్ టీ సంస్థలు సంయుక్తంగా అమరావతిలో క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేస్తున్నాయి. ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నదే మా నినాదం. బీపీసీఎల్ రిఫైనరీ రామాయపట్నం వద్ద వస్తోంది. డేటా సెంటర్, అనలటిక్స్ తో కూడిన క్యాంపస్ విశాఖలో ఏర్పాటు చేయాలని గూగుల్ ను ఆహ్వానించాం. పారిశ్రామిక వేత్తలు ఎవరు వచ్చినా వారికి ఎర్రతివాచీతో ఆహ్వానం పలుకుతాం. దరఖాస్తు పెట్టినప్పటి నుంచి భూ కేటాయింపు, ఇతర అనుమతులివ్వటం మా బాధ్యత. రికార్డు టైములోనే అన్ని క్లియరెన్సులు ఇస్తామని మీకు హామీ ఇస్తున్నాం. ఏపీలో ఇప్పుడు సౌర,పవన,పంప్డ్ ఎనర్జీ లాంటి గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి కేంద్రంగా మారుతోంది. పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రంగాల్లో వస్తున్నాయి. రాయలసీమలో కొత్తగా హైటెక్ ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నాం. ఐదు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చేలా లక్ష్యంగా పెట్టుకున్నాం. అమరావతిలో ఫ్యూచర్ లీడర్లను తయారు చేయడం కోసం గ్లోబల్ లీడర్ షిప్ సెంటర్ ను అమరావతిలో ఏర్పాటు చేస్తున్నామని చంద్రబాబు పారిశ్రామిక వేత్తలకు వివరించారు. నేను పరిశ్రమల్ని ప్రోత్సహించే వ్యక్తిని. సీఐఐ నుంచి ఒక పరిశ్రమ- పెట్టుబడి వచ్చినా మాకు మంచిదేనన్నారు.
గ్లోబల్ సిటీగా అమరావతి నిర్మాణం
‘‘హైదరాబాదును అభివృద్ధి చేసిన నాకు ఇప్పుడు అమరావతి రాజధాని నగరాన్ని నిర్మించే అవకాశం వచ్చింది. ఓ గ్లోబల్ గ్రీన్ సిటిగా అమరావతిని నిర్మిస్తున్నాం. ఇందులో పరిశ్రమలు భాగస్వామ్యం కావాలని కోరుతున్నాం. వచ్చే 22 ఏళ్లకు ఇప్పుడే ప్రణాళికలు చేస్తున్నాం. 15 శాతం వృద్ధి రేటు సాధించటమే మా లక్ష్యం. మిడిల్ ఇన్ కమ్ గ్రూప్ కు మాత్రమే పరిమితం కాకూడదు. తలసరి ఆదాయాన్ని రూ.55 లక్షలకు చేర్చాలన్నదే మా విజన్. ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్లు ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందించాం’’ అని చంద్రబాబు చెప్పారు.
వివిధ ప్రశ్నలకు సమాధానమిస్తూ…
సీఐఐ వార్షిక ప్లీనరీలో ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు.. జాతీయ స్థాయిలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఏపీలో ఏమేం చర్యలు తీసుకొంటున్నారన్న ప్రశ్నలకు సీఎం చంద్రబాబు సమాధానమిస్తూ.. మనకు నైపుణ్యం ఉన్న మానవ వనరులు చాలా అవసరం ఉంది. దీనికి అత్యుత్తమ విశ్వవిద్యాలయాలు అవసరం అవుతాయి. నైపుణ్యాభివృద్ధి కోసం ఏపీలోనూ కొన్ని ఉత్తమ విద్యా సంస్థలు వస్తున్నాయి. బిల్ గేట్స్ ఫౌండేషన్ తోనూ ఆరోగ్యం, వ్యవసాయం లాంటి అంశాలపై పనిచేస్తున్నాం. సాంకేతికత ఉంటేనే సరిపోదు దాన్ని క్షేత్రస్థాయిలో అమలు పరిస్తేనే ఫలితాలు వస్తాయన్నది నా విశ్వాసం. అందుకే ఏపీలో అత్యుత్తమ విధానాలను అనుసరిస్తున్నాం, టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ లాంటి వారి నుంచి ఆలోచనల్ని తీసుకుని నైపుణ్యాభివృద్ధి చేస్తున్నాం. సముద్రంలోకి వృధాగా పోయే 2 వేల టీఎంసీల నీటి నుంచి 200 టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకునేలా పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్నాం. ఇది పూర్తి అయితే రాష్ట్ర సస్యశ్యామలం కావడంతో పాటు, సంపద అందరికీ అందుతుంది. వంశధార నుంచి పెన్నా వరకూ నదుల్ని కూడా అనుసంధానించాలన్నది మా ప్రయత్నం. అలాగే సర్క్యులర్ ఎకానమీ దిశగానూ ఏపీలో ప్రణాళికలు చేపడుతున్నాం. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలతో పాటు పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. పర్యాటక రంగంలో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నాం, ఎక్కువ సంఖ్యలో హోటళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించాం. వచ్చే ఐదేళ్లల్లో 50 వేల హోటల్ రూంలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అమరావతిలో పెద్ద ఎత్తున వివిధ నిర్మాణాలు జరగాల్సి ఉందని సీఎం వివరించారు.
చంద్రబాబుకు సత్కారం
సీఐఐ వార్షిక సదస్సు సీఎం చంద్రబాబును ‘స్టాండిరగ్ ఒవేషన్’తో గౌరవించింది. సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, అధ్యక్షుడు సంజీవ్ పురి తదితరులు చంద్రబాబును ఘనంగా సత్కరించారు.


