Thursday, April 3, 2025
Homeవిశ్లేషణజీడీపీపై సొంత డబ్బా

జీడీపీపై సొంత డబ్బా

ఎం కోటేశ్వరరావు
నరేంద్రమోదీ అధికారానికి వచ్చిన తరువాత దేశ జీడీపీి 2015లో 2.1లక్షల కోట్ల డాలర్ల నుంచి 2025లో 4.3లక్షల కోట్ల డాలర్లకు చేరినట్లు, ఇది 105శాతం పెరుగుదల అని ఐఎంఎఫ్‌ చెప్పింది. అయితే ప్రపంచంలో ఏ పెద్ద దేశమూ ఇంతటి అభివృద్ధి సాధించలేదని బీజేపీి ఐటి సెల్‌ అధినేత అమిత్‌ మాలవీయ ఎక్స్‌ పోస్టులో పేర్కొన్నారు. జాతీయ, ప్రాంతీయ పత్రికలు కూడా ఈ వార్తకు పెద్ద ఎత్తున ప్రాచుర్యమిచ్చాయి. భజనపరుల సంగతి చెప్పేదేముంది, కీర్తి గీతాలు పాడుతున్నారు. బుర్రకు పని చెప్పకుండా చెవులప్పగించేవారుంటే కాకమ్మ కతలు చెప్పేవారికి కొదవ ఏముంది. బీజేపీి పెద్దలు 2025 నాటికి ఐదు లక్షల కోట్ల డాలర్లకు పెంచుతామని గొప్పలు చెప్పుకున్న అంశం ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాలి. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇంతటి అభివృద్ధిని ఏ ప్రభుత్వమూ సాధించలేదని కూడా మాలవీయ చెప్పారు. అలా ప్రచారం చేయటమే కదా ఆ పెద్దమనిషి ఉద్యోగం. వాస్తవం ఏమిటి, 2004లో మన్‌మోహన్‌సింగ్‌ అధికారానికి వచ్చినపుడు జీడీపీ 709 బిలియన్‌ డాలర్లు కాగా 2014 నాటికి అది 2030 బిలియన్లకు పెరిగింది. ఏ ఎలిమెంటరీ స్కూలు విద్యార్ధిని అడిగినా యూపీఏ పాలనా కాలంలో పెరుగుదల రేటు 186 శాతమని, 105 కంటే ఎక్కువని చెబుతారు. లేదు మా వేదగణితం, మోదీ లెక్కల ప్రకారం 105శాతమే ఎక్కువ అంటే అంతేగా, అంతేగా మరి అని భజన చేస్తారు. ఎవరన్నా గట్టిగా కాదు అంటే మున్సిపల్‌ అధికారులు వచ్చి నిబంధనలన్నీ సక్రమంగానే పాటించినా వారి ఇళ్ల గోడల నిర్మాణంలో ఇసుక, సిమెంటు పాళ్లలో తేడా కనిపిస్తోందని, హానికారక రంగులు వేశారంటూ వెంటనే బుల్డోజర్లతో కూల్చివేసే రోజులివి. వ్యంగ్యాన్ని భరించలేక ముంబైలో కునాల్‌ కమ్రా ప్రదర్శన జరిగిన హాలును ఎలా కూల్చివేశారో చూశాంగా !
ఒక టీవీలో నిర్వహించిన సమావేశంలో ప్రధాని చెప్పిన కొన్ని అతిశయోక్తుల గురించి చూద్దాం. ‘నేడు ప్రపంచం కళ్లన్నీ భారత్‌ మీదే’. 2014 మే 26న ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మరుసటి రోజు నుంచి పదాలు మార్పు ఉండవచ్చు తప్ప ఇదే పాట. ఏ ఒక్క అంతర్జాతీయ సమస్యలో అయినా లేదా వివాద పరిష్కారంలోనైనా భారత పాత్రను కోరిన దేశాలు గానీ, మోదీ ప్రమేయంగానీ ఉన్న ఉదంతం ఒక్కటంటే ఒక్కటి ఉందా? కానీ మోదీ చెప్పిందాన్ని మరోవైపు నుంచి చూస్తే నూటికి నూరుపాళ్లూ వాస్తవం. ఏమిటంటే మన మార్కెట్‌లో తమ వస్తువులను అమ్ముకోవటానికి, తమకు అవసరం లేని వాటిని మనకు అంటగట్టటానికి (ప్రపంచంలో నిషేధించిన అనేక పురుగుమందులు, రసాయనాలు, ఔషధాలు మన దగ్గర పుష్కలంగా దొరుకుతున్నాయి), ఇక్కడి కార్పొరేట్లకు మోదీ సర్కార్‌ ఇస్తున్న రాయితీల కారణంగా స్టాక్‌మార్కెట్లో పెట్టుబడులు పెట్టి లాభాలు తరలించుకుపోవటానికి మనవైపు చూస్తున్న మాట వాస్తవం.
‘గత పదేళ్లలో జీడీపీని రెట్టింపు చేయటం అంకెలు కాదు, 25 కోట్ల మందిని దారిద్య్రరేఖ దాటించి నూతన మధ్యతరగతిని సృష్టించాం. వారు కొత్త జీవితాన్ని ప్రారంభించారు, సచేతనంగా ఆర్థికవృద్ధికి తోడ్పడుతు న్నారు’ అన్న ప్రధాని మాటలను చూసి నవ్వాలో ఏడవాలో తెలియటం లేదు. ఇరవై ఐదు కోట్ల మందిని దారిద్య్రరేఖ దిగువ నుంచి ఎగువకు లాగాం అంటూనే కనీసం ఆహార ధాన్యాలు కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్న 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార భద్రతా పథకం కింద గోధుమలు, బియ్యం ఇస్తున్నామని చెప్పటం విన్నాం. ప్రపంచ ఆకలి సూచికలో తాజాగా 127లో 105వ దేశంగా ఉన్నాం. ఆకలి లేని(9.9), స్వల్ప (10 నుంచి 19.9), తీవ్రం(20 నుంచి 34.9), ఆందోళనకరం (35నుంచి 49.9), అత్యంత ఆందోళనకరం(50పైన) అనే ఐదు తరగతులుగా దేశాలను విభజిస్తే మన దేశం తీవ్ర తరగతిలో అంతకు ముందు గత పదేళ్లుగా కూడా ఉంది. అనూహ్య అద్భుతాలు లేదా నరేంద్రమోదీకి కొత్తగా దైవిక శక్తులు వస్తే తప్ప దాన్నుంచి సమీప భవిష్యత్‌లో బయటపడే దరిదాపుల్లో కూడా లేదు. పదేళ్లలో జీడీపీి రెట్టింపు అని గొప్పలు చెప్పుకుంటూ తమ భుజాలను తామే చరుచుకుంటూ శభాష్‌ అని చెప్పుకుంటున్నాం. అ పది సంవత్సరాల్లో 2014 నుంచి 2024వరకు మన ఆకలి సూచిక స్కోరు 28.2 నుంచి 27.3కు మాత్రమే తగ్గింది, దీనిలో అంత అభివృద్ధి ఎందుకు రాలేదు? దీనికే పొంగిపోతున్నాం. ఇదే కాలంలో పాకిస్థాన్‌ స్కోరు 29.6 నుంచి 27.9కి తగ్గింది, మనకంటే మెరుగైన అభివృద్ధి అంటే పాకిస్థాన్‌ ఏజంట్లని ఎదురు దాడి చేస్తారు. పాక్‌ ర్యాంకు మన తరువాత 109, ఆకలిని ఎవరు ఎక్కువగా తగ్గించినట్లు ? గత పదేళ్లలో చైనా స్కోరు ఐదు కంటే తక్కువే ఉందన్న వాస్తవాన్ని చెబితే నానా యాగీ చేస్తారు. అన్నం ఉడికిందా లేదా అని చూడటానికి ఒక మెతుకు పట్టుకు చూస్తే చాలు అన్నట్లుగా నరేంద్రమోదీ అతిశయోక్తుల గురించి చెప్పుకోవటానికి ఈ ఒక్కటి చాలు.
ఆర్థిక విస్తరణలో జీ7, జీ20, బ్రిక్స్‌ దేశాలన్నింటి కంటే అసాధారణ వృద్ధి సాధించినట్లు వాణిజ్యశాఖ మంత్రి పియూష్‌ గోయెల్‌ వర్ణించారు. త్వరలో జీడీపీిలో భారత్‌ మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారనుందని బీజేపీి పెద్దలు, వారి సమర్ధకులు నిత్యం ఊదరగొడుతుంటారు. ఇదొక మైండ్‌ గేమ్‌. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున ఉంటుందా? ప్రస్తుతం జపాన్‌ను అధిగమించేందుకు మోదీ చూస్తున్నారని, 2027 తొలి ఆరునెలల్లోనే 4.9లక్షల కోట్ల డాలర్లతో జర్మనీని కూడా దాటేశారని ఊదరగొడుతున్నారు. అవన్నీ గిడసబారిన దేశాలుగా మారుతున్నాయి, మనం పోల్చుకోవాల్సింది చైనాతో కదా ! మన వృద్ధి రేటు చైనా, అమెరికా, జర్మనీ కంటే ఎక్కువగా ఉందని, గడచిన పదేళ్లలో భారత్‌ 105శాతం పెరుగుదల సాధించగా చైనా 76, అమెరికా 66, జర్మనీ 44, ఫ్రాన్సు 38, బ్రిటన్‌ 28శాతం పెరుగుదల సాధించిందని ఐఎంఎఫ్‌ చెప్పింది. లక్ష కోట్ల డాలర్ల కిలోమీటర్‌(మైలు) రాయిని దేశం 2007లో దాటింది. తదుపరి 2014లో రెండు లక్షల కోట్లు దాటింది. 2032 నాటికి పదిలక్షల కోట్ల డాలర్ల జీడీపీ కలిగిన దేశంగా మారుతుందని కొందరు ఆర్థికవేత్తలు జోస్యం చెప్పారు. వారి తర్కం ఏమిటి ? 2021లో మూడు లక్షల కోట్లకు విస్తరించింది. కేవలం నాలుగు సంవత్సరాల్లోనే 4.3లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ప్రతి 1.5 సంవత్సరాలకు (18నెలలకు) ప్రస్తుత వేగంలో ఒక లక్ష కోట్ల డాలర్లు పెరుగుతున్నది. ఇదే కొనసాగితే 2032 నాటికి 10లక్షల కోట్ల డాలర్లకు చేరుతుంది.
కొంత మందికి అంకెలతో ఆడుకోవటం వెన్నతో పెట్టిన విద్య. అంతా అద్భుతంగా ఉందని చెబుతూనే 2025 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.5శాతం ఉంటుందని సన్నాయి నొక్కులు. రానున్న కొద్ది సంవత్సరాల్లో మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నందుకు ఇప్పటి నుంచి సంబ రాలు జరుపుకుంటున్నారు కొందరు. చెన్నయ్‌ కేంద్రంగా పని చేస్తున్న ఆర్థిక నిపుణుడు డి ముత్తుకృష్ణన్‌ ఉత్సవాలు జరుపుకోవాల్సినంత ఘనత ఏమి సాధించామని ప్రశ్నిం చారు. జీడీపీలో ఏ స్థానంలో ఉన్నామన్నది కాదు తలసరి రాబడిలో ప్రపంచంలో మనం 140వ స్థానంలో ఉన్నామని, మనకంటే 139 దేశాలు ముందున్నాయని గుర్తించాలని చెప్పారు. పర్చేజింగ్‌ పవర్‌ పారిటీ(పీపీపీి) పద్ధతి జీవన ప్రమాణాలను మెరుగ్గా వెల్లడిస్తుందని కొందరు చెబుతారు, దాని ప్రకారం చూసినా మన స్థానం 119 అని చెప్పారు. పదేళ్లలో మన జీడీపీి 105శాతం పెరిగిందని ఏ ఐఎంఎఫ్‌ చెప్పిందో అదే సంస్థ 2025 తలసరి జీడీపీిలో 141వ స్థానం అని కూడా చెప్పింది. మనకంటే పేద దేశమైన కంపూచియా పైన ఉంది, దివాళా తీసిందని చెప్పిన శ్రీలంక 133, బంగ్లాదేశ్‌ 143, పాకిస్థాన్‌ 159, జిన్‌పింగ్‌ ఏలుబడిలో కుప్పకూలిపోయిందని కొంత మంది చెప్పే చైనా 71వ స్థానంలో ఉందని కూడా ఐఎంఎఫ్‌ చెప్పింది. మన తలసరి రాబడి పదివేల డాలర్లకు చేరాలంటే కనీసం 30 సంవత్సరాలు కష్టపడి పని చేయాలని, దానికి అనుకూలమైన ఆర్థిక పరిస్థితులు ఉండాలని ముత్తు కృష్ణన్‌ చెప్పారు. చైనా తలసరి జీడీపీ 2025లో 13,873 డాలర్లు, ఇప్పుడున్న మన 2,937 డాలర్ల నుంచి ఎదిగి ప్రథమ స్థానంలో ఉన్న మొనాకో 2,56,581( 2023 ప్రపంచ బ్యాంకు సమాచా రం) లేదా డాలర్‌ దేవుడున్న అమెరికా 89,678 (2025 ఐఎంఎఫ్‌) స్థాయికి, చివరికి పడకకుర్చీ మేధావులు త్వరలో అధిగమించే దూరం ఎంతో దూరం లేదని నమ్మించేందుకు చూస్తున్న చైనాను అయినా కనీసం అధిగమించాలంటే ఎంత సమయం పడుతుందో ఆల్జిబ్రా లేదా వేద గణితం ఏదో ఒక అడ్డగోలు పద్దతిలో లెక్క వేసుకోవాల్సిందే.
పదకొండు సంవత్సరాల విశ్వగురువు మోడినోమిక్స్‌ సమర్ధ పాలన తరువాత పరిస్థితి గురించి కమ్యూనిస్టులో ఇతర పురోగామి వాదులో చెబుతున్న మాటలను కాసేపు పక్కన పెడదాం, ఎందుకంటే ఎండమావుల వెంట పరిగెడుతున్న జనం వారి మాటలను తలకు ఎక్కించుకొనే స్థితిలో లేరు. బిజినెస్‌ టుడే పత్రిక 2025 మార్చి 21వ తేదీ సంచికలో వైట్‌ కాలర్‌ భారత్‌లో 500 డాలర్ల ఉద్యోగాలింకే మాత్రం లేవు అంటూ ఒక వార్త వచ్చింది.విజ్‌డమ్‌ హాచ్‌ అనే సంస్థ స్థాపకుడు అక్షత్‌ శ్రీవాత్సవ చెప్పిన అంశాలను దానిలో చర్చించారు. శ్రీవాస్తవ చెప్పిన అంశాలు, వార్తలోని వ్యాఖ్యల సారం ఇలా ఉంది.సాంప్రదాయకంగా ఉపాధి కల్పించే రంగాలు, వృద్ధి పడిపోతున్నది, యువత ఎలా ముందుకు పోవాలో ఎంచుకోవటం కష్టంగా మారుతున్నది. దేశ అభివృద్ధి నమూనా గతం మీద ఇంకేమాత్రం ఆధారపడ లేదు. భారత ఐటి మార్కెట్‌ నిర్ణయాత్మక మార్పుకు లోనవు తున్నది, అది మంచిదారిలో కాదు. ఐటిలో మంచి ఉద్యో గాలు అంతరిస్తున్నాయి, అవి వెనక్కు తిరిగి రావు. ‘ఒక తెల్లవాడికి వెయ్యి డాలర్లు ఇచ్చే బదులు భారతీయులకు 500 డాలర్లు ఇచ్చారు. ఆ సొమ్ముతో మనం సంతోష పడ్డాం. ఎందుకంటే ఇప్పటికీ అది గొప్ప ఉద్యోగమే.అది మన జీవన ప్రమాణాలను పెంచింది. కానీ అది ఆ కాలం కనుమరుగుతున్నది.’ అని శ్రీవాత్సవ పేర్కొన్నారు. ‘ప్రభుత్వం ఒక పరిష్కారం చూపుతుందేమోనని ఆశించటం అర్ధలేనిది, ఆ మార్పు రావాలంటే దశాబ్దాలు పడుతుంది, అప్పటికి మీరు వృద్ధులు కావచ్చు’ అని కూడా చెప్పారు.
పదకొండు సంవత్సరాల క్రితం 2014లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్రమోడీ ఒక బిజెపి నేత, గుజరాత్‌ సిఎంగా చెప్పిందేమిటి ? మిగతా అంశాలను పక్కన పెడదాం. గుజరాత్‌ నమూనా అభివృద్ధిని దేశమం తటా విస్తరిస్తాం అన్నారు. అంటే పారిశ్రామికంగా వృద్ధి చేస్తామన్నారు. ప్రధాని పదవిలోకి రాగానే విదేశాలకు ఎందుకు పదే పదే వెళుతున్నారంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కోసం అన్నారు. కానీ జరిగిందేమిటి ? తరువాత ఎప్పుడైనా గుజరాత్‌ నమూనా గురించి ఎక్కడైనా మాట్లాడారా ? 1950లో మన దేశంలో 20 కోట్ల మంది జనం ఉపాధి కోసం వ్యవసాయంపై ఆధారపడ్డారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొత్తగా కొంత భూమి సాగులోకి వచ్చింది, కొంత వ్యవసాయేతర అవసరాలకు మళ్లింది. ఎంత పెరిగింది, ఎంత తగ్గింది అన్న లెక్కలను పక్కన పెడితే స్థిరంగా ఉందనుకున్నప్పటికీ అదే భూమి మీద నాడు 20 కోట్ల మంది బతికితే ఇప్పుడు 2023`24లో జనాభాలో 46.1శాతం మంది ఆధారపడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే తెలిపింది. ఆరు సంవత్సరాల క్రితంతో పోల్చితే రెండు శాతం పెరిగారు. అంటే ఇప్పుడు 67 కోట్ల మంది పని చేస్తున్నారు.చైనాలో 24.1 శాతం లేదా 17.66 కోట్ల మంది(2023) పని చేస్తున్నారు. ఇలాంటి స్థితిలో ఏటా రెండు కోట్ల మేరకు పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో ఉపాధి కల్పిస్తామని చెప్పిన మాటలేమైనట్లు ?

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు