హైకోర్టు సంచలన తీర్పు
విశాలాంధ్ర-హైదరాబాద్: ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించి బీఆర్‌ఎస్ హయాంలో తెచ్చిన జీవో 16 చెల్లదని తెలంగాణ ఉన్నత న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ జీవో 16ను హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. ఈ జీవో ప్రకారం విద్యా, వైద్య శాఖల్లో పనిచేసే ఉద్యోగుల క్రమబద్ధీకరణ జరిగింది. హైకోర్టు తాజా తీర్పుతో ఉద్యోగుల్లో అందోళన మొదలైంది. క్రమబద్ధీకరించిన వారిని తిరిగి ఒప్పంద ఉద్యోగులుగా కొనసాగించవచ్చని హైకోర్టు పేర్కొన్నట్లు పిటిషనర్లు తెలిపారు. అయితే తీర్పు ప్రతి అందితే దీనిపై స్పష్టత వస్తుందని అధికారులు అన్నారు. ఇదిలావుంటే జీవో 16 నిరుద్యోగుల పాలిట శాపంగా మారిందని, ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించడం ద్వారా తమకు అన్యాయం జరిగిందని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన ఉన్నత న్యాయస్థానం జీవో 16 రాజ్యాంగ విరుద్ధమంటూ తీర్పు వెలువరించింది.