. అన్ని ప్రాజెక్టులూ పూర్తి చేస్తాం… ప్రతి ఎకరాకు నీరిస్తాం
. సీఎం చంద్రబాబు వెల్లడి
. రూ.456 కోట్లతో ఫీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన
. రూ.50 కోట్లతో మార్కాపురం జిల్లా కలెక్టరేట్ భవనం
విశాలాంధ్ర – మార్కాపురం: ఈ ఏడాది జులై నాటికి వెలిగొండ తొలిదశ పూర్తిచేసి మార్కాపురం జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగు నీరందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గత పాలకుడిలా ప్రాజెక్టు పూర్తి కాకుండానే జాతికి అంకితమంటూ రిబ్బన్ కటింగ్ చేసి దొంగ నాటకాలు ఆడటం తమకు చేతకాదని సీఎం వ్యాఖ్యానించారు. వెనుకబాటుకు గురైన మార్కాపురం ప్రాంతాన్ని కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తామన్న హామీని నిలబెట్టుకున్నామని సీఎం అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రతిఎకరాకూ నీరివ్వాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని వెల్లడించారు. దీనికోసం విశ్రాంత ఇంజనీర్లతో ఓ బృందాన్ని వేసి అధ్యయనం చేయిస్తామని తెలిపారు. ప్రతి ఎకరాకూ సాగునీరు ఇచ్చే అంశంపై బ్లూ ప్రింట్ తయారు చేస్తామని అన్నారు. మార్కాపురం జిల్లా దోర్నాల మండలం గంటవాని పల్లెలో రూ.456 కోట్లతో వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులకు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. రైతులతో కలిసి పనులను పరిశీలించారు. అనంతరం మార్కాపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ సార్వత్రిక ఎన్నికల్లో మార్కాపురం, మదనపల్లి, పోలవరం ప్రాంతాలను జిల్లాలు చేస్తానని మాట ఇచ్చి ఇప్పుడు నిలబెట్టుకున్నాను. ఇక్కడి ప్రజలు 150 కిలోమీటర్లు ప్రయాణించి ఒంగోలు కు వెళ్లాల్సిన పని లేకుండా మార్కాపురాన్ని జిల్లా చేశాను. అన్యాయం జరిగిన మదనపల్లికి కూడా న్యాయం చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
శంకుస్థాపనతో పాటు ప్రారంభించే అవకాశం నాకే వచ్చింది…
1996,మార్చి 5న ఈ ప్రాంతంలో నేను పర్యటించినప్పుడు ప్రజల కష్టాలు కళ్లారా చూశాను. శ్రీశైలం నుంచి నీరివ్వమని ఇక్కడి ప్రజలు నన్ను కోరారు. ఆనాడు వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించాం. భగవంతుడు మళ్లీ నాకే అవకాశం ఇచ్చాడు. వెలిగొండను పూర్తి చేసి మీ జీవితాల్లో వెలుగులు తెస్తాను. రైతులను ఆదుకుంటాం. 2014-2019లో ప్రాజెక్టు పనులు పరుగులు పెట్టించాం. ఈ ప్రాజెక్టు ద్వారా 4.35 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించడమే లక్ష్యం. దీని వల్ల గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం, కనిగిరి నియోజకవర్గాలకే కాకుండా ఉదయగిరి, కడప జిల్లా బద్వేలుకు కూడా నీరు అందుతుంది. 2019లో మనమే అధికారంలోకి వచ్చి ఉంటే 2021లోనే ప్రాజెక్టు పూర్తి చేసి నీరిచ్చేవాళ్లం. 2019-2024 మధ్య చీకటి రోజులు వచ్చాయి. గత ముఖ్యమంత్రి వెలిగొండ పూర్తి కాకుండానే జాతికి అంకితమంటూ దొంగ నాటకాలు ఆడారు. గత పాలకులు ఐదేళ్లలో ఈ ప్రాజెక్టుకు కేవలం రూ.500 కోట్లు ఖర్చు చేసి పనులు అయిపోయాయని రైతులకు పంగ నామాలు పెట్టారు. మంచి చేసిన వారికి అండగా నిలుస్తేనే ప్రజల జీవితాలు మెరుగు అవుతాయని ముఖ్యమంత్రి అన్నారు.
రూ.1300 కోట్లతో ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు
నల్లమల సాగర్‌కు గోదావరి నీళ్లు ఇస్తాం. అది వచ్చేలోగా ఈ ఏడాది జూలై నాటికి నల్లమల సాగర్ పూర్తి చేసి వెలిగొండ ప్రాజెక్టు జాతికి అంకితం చేస్తాం. ఈ ప్రాజెక్టు కోసం ఇంకా రూ. 2 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. గతేడాది హంద్రినీవాపై శ్రద్ధ పెట్టాం. ఈ ఏడాది వెలిగొండ పై శ్రద్ధ పెట్టి ప్రజల జీవితాల్లో జలకళ తీసుకొస్తాం. హార్టికల్చర్ కు ఎక్కువ ప్రాధాన్య ఇస్తున్నాం. రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మారుస్తున్నాం. సీమతో పాటు మార్కాపురం, ప్రకాశం జిల్లాలను ఉద్యాన పంటలతో అభివృద్ధి చేస్తాం. మార్కాపురాన్ని ఉద్యాన పంటలకు కేంద్రంగా తయారు చేసేందుకు ప్రజలు సహకరించాలి. రూ.1300 కోట్లు వ్యయంతో నల్లమల సాగర్ నుంచి ప్రతి ఇంటికి సురక్షిత నీరు అందించే బాధ్యత తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు.
రూ.50 కోట్లతో జిల్లా కలెక్టరేట్ నిర్మిస్తాం
ప్రజలకు హామీ ఇచ్చినట్టుగానే మార్కాపురాన్ని జిల్లాగా చేసి ఇక్కడి ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చాం. మార్కాపురం జిల్లాలో భూ రికార్డుల సమస్యలున్నాయి. మేము అధికారంలోకి వస్తూనే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశాం. గత పాలనలో ల్యాండ్ రికార్డులన్నీ అస్తవ్యస్తం చేశారు. అడిగిన భూములు ఇవ్వకపోతే 22ఏలో పెట్టారు. సర్వే రాళ్లపై వారి ఫోటోలు వేసుకున్నారు. మేము రాజముద్రతో పట్టదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తున్నాం. క్యూఆర్ కోడ్ తో భూమి రికార్డులు భద్రంగా తయారు చేయిస్తున్నాం. ఎవరైనా తప్పు రికార్డులు చేస్తే తాట తీస్తామని హెచ్చరిస్తున్నాను. మార్కాపురం జిల్లా నూతన కలెక్టరేట్ భవనానికి రూ. 50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.
స్థానిక రైతులతో కలిసి ఫీడర్ కాలువ పనుల పరిశీలన
వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కాలువ పనుల శంకుస్థాపన అనంతరం రైతులు వెంకటేశ్వరరెడ్డి, సురవరం గండి వీరారెడ్డిలతో సంభాషిస్తూ ఫీడర్ కెనాల్ పనుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. వెలిగొండ పూర్తి అయితే ఈ ప్రాంత భూగర్భజలాలు కూడా పెరుగుతాయని, బోర్లకు, చెరువులకు నీరు వస్తాయని ముఖ్యమంత్రికి రైతులు వివరించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పనులు, ఫీడర్ కాలువ పనులు వేగంగా చేపడుతున్నందుకు ముఖ్యమంత్రికి స్థానిక రైతులు ధన్యవాదాలు తెలిపారు.
వెలిగొండ పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష
ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి, పనులు జరుగుతున్న తీరుపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. వెలిగొండ ప్రాజెక్టు సొరంగాలు, కాలువ పనులు తదితర అంశాలను నమూనా ద్వారా వివరించారు. కంబం చెరువును కూడా నింపేలా కాలువను అనుసంధానించినట్టు తెలిపారు. స్థానికంగా వివిధ చెరువులు, నీటి వనరుల్ని నింపేందుకు అవసరమైన స్ట్రక్చర్లను పూర్తి చేయాలని సీఎం అధికారులకు ఆదేశించారు. వెలిగొండ టన్నెళ్ల పనులు పూర్తి అయ్యాక, పోరుమామిళ్ల, రాచర్లకు కూడా నీరు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా పనులు పూర్తి చేయాలని, వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతి ఎప్పటికప్పుడు తనకు తెలియచేయాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
మార్కాపురంలో ముఖ్యమంత్రికి ఘన స్వాగతం
నూతన జిల్లాగా ఏర్పడిన తర్వాత తొలిసారి మార్కాపురంలో పర్యటించిన ముఖ్యమంత్రికి ఘన స్వాగతం లభించింది. మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి, నిమ్మల రామానాయుడు, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. జిల్లా ఏర్పాటు కలను నిజం చేసినందుకు ముఖ్యమంత్రికి నాయకులు ధన్యవాదాలు తెలిపారు. సభకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు, అభిమానులు తరలివచ్చారు.


