న్యూదిల్లీ: స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టులకు వీడ్కోలు పలికాడు. సారథి రోహిత్ శర్మ బాటలోనే అతడు కూడా సుదీర్ఘ ఫార్మాట్ నుంచి వైదొలిగాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగభరిత పోస్ట్ పెట్టాడు. తాను కూడా టెస్టుల నుంచి రిటైరవ్వాలనుకుంటున్నట్లు బీసీసీఐకి చెప్పిన కోహ్లీ… తాజాగా దీనిపై అధికారిక ప్రకటన చేశాడు. ‘14 ఏళ్ల క్రితం తొలిసారిగా టెస్టు క్రికెట్ జెర్సీ ధరించా. ఈ ఫార్మాట్ నన్ను ఇంత దూరం తీసుకెళ్తుందని నేనెప్పుడూ ఊహించలేదు. ఇది నన్ను పరీక్షించింది. తీర్చిదిద్దింది. జీవితానికి సరిపడా పాఠాలు నేర్పించింది. తెల్ల జెర్సీలో ఆడటం వ్యక్తిగతంగా నా మనసుకు చాలా ప్రత్యేకమైనది. నిశ్శబ్దమైన ఆనందం. సుదీర్ఘమైన రోజులు. ఎవరికీ కనిపించని క్షణాలు నాతో ఎప్పటికీ ఉంటాయి. అలాంటి ఈ ఫార్మాట్ నుంచి దూరం కావడం అంత తేలిక కాదు. కానీ, నా నిర్ణయం సరైనదే అనిపిస్తోంది. ఈ ఫార్మాట్ కోసం నేను ఎంతో శ్రమించా. నేను ఆశించిన దానికంటే ఎక్కువే ఇది నాకు తిరిగిచ్చింది. మనసు నిండా సంతృప్తితో, కృతజ్ఞతాభావంతో దీని నుంచి వైదొలుగుతున్నా. వెనక్కి తిరిగి నా టెస్టు కెరీర్‌ను చూసుకుంటే నా ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది. ప్రేమతో…’ అని కోహ్లీ తన పోస్టులో రాసుకొచ్చాడు. కాగా, గతేడాది టీ 20 ప్రపంచకప్ గెలిచిన అనంతరం రోహిత్ శర్మ, కోహ్లీ ఒకేసారి పొట్టి క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం రోహిత్ టెస్టు క్రికెట్‌కు విశ్రాంతి ప్రకటించి అభిమానులకు తీరని లోటు మిగిల్చాడు. అతడు వైదొలగడంతో ఇంగ్లాండ్ పర్యటనకు కోహ్లీ అత్యంత కీలకమవుతాడని అంతా భావించారు. అంతలోనే తాను కూడా రిటైర్ అవ్వాలనుకుంటున్నానని విరాట్ బీసీసీఐకి సమాచారమిచ్చాడు. దీంతో అతడికి సర్దిచెప్పేందుకు బోర్డు ప్రయత్నించింది. కానీ, కోహ్లీ మాత్రం తన టెస్టు కెరీర్‌ను ముగించేందుకే సుముఖత చూపించాడు. 2011లో వెస్టిండీస్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేసిన కోహ్లీ… ఇప్పటివరకు 123 టెస్టులు ఆడి 9,230 పరుగులు సాధించాడు. ఇందులో 30 శతకాలు, 31 అర్ధ శతకాలు ఉన్నాయి. 46.85 బ్యాటింగ్ సగటు ఉంది. ఈ ఫార్మాట్లో విరాట్ వ్యక్తిగత అత్యధిక స్కోరు 254 పరుగులు. 2025 జనవరి 3న ఆస్ట్రేలియాతో చివరి టెస్టు ఆడాడు. టెస్టుల్లో ఎన్నో గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడిన విరాట్… పదివేల పరుగుల మైలురాయికి కొద్ది దూరంలోనే నిలిచి ఈ ఫార్మాట్ నుంచి వైదొలిగాడు. 14 ఏళ్ల పాటు భారత్ తరపున టెస్టులకు తాను ప్రాతినిధ్యం వహించడం గర్వకారణమన్నారు.