. జిల్లాకు ఒకే పేపర్
. వయోపరిమితి పెంపు
. ప్రభుత్వానికి అభ్యర్థుల వినతులు
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: డీఎస్సీ గడువు, వయోపరిమితి పెంపు, జిల్లాకు ఒకే పేపర్ విధానం కోసం నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం వరకు డీఎస్సీకి రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. దరఖాస్తు గడువు గురువారం రాత్రి 11.59 గంటలకు ముగియనుంది. సాయంత్రం వరకు గడువు పెంపుపై పాఠశాల విద్యాశాఖ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు చివరి వరకు వేచిచూడకుండా గడువు సమయం ముగిసేలోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో అభ్యర్థులు నిరసనకు దిగుతున్నారు. నిరుద్యోగులు పోరాట ఫలితంగా ఏడేళ్ల తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చిందని, పరీక్షకు 90రోజులపాటు సమయం ఇవ్వాలని పట్టుపడుతున్నారు. వయోపరిమితి 44 నుంచి 47 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఏళ్ల తరబడి డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తూ ఉండిపోయిన అభ్యర్థుల వయస్సు పెరిగిందన్నారు. ప్రస్తుతం తెలంగాణలోనూ ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి 47ఏళ్లకు పెంచారనీ, రాష్ట్రంలో 47 ఏళ్ల వరకు నిరుద్యోగులకు అవకాశం ఇవ్వాలని పట్టుపడుతున్నారు. డీఎస్సీలో నార్మలైజేషన్ రద్దుచేసి జిల్లాకు ఒకే పేపర్ నిర్వహించాలని కోరుతున్నారు. డీఎస్సీ ఆన్‌లైన్ రాత పరీక్షలు జూన్ 6 నుంచి జులై 6 వరకు మొత్తం నెల రోజులపాటు నిర్వహిస్తామని..ఇప్పటికే రాష్ట్ర విద్యా శాఖ స్పష్టం చేసిన విషయం విదితమే. సరిగ్గా ఇదే తేదీలో కేంద్ర రైల్వేశాఖకు చెందిన ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ గ్రాడ్యుయేట్ పోస్టుల పరీక్షలు జరగనున్నాయి. ఈ పోస్టులకు దేశవ్యాప్తంగా ఏకంగా కోటి 20లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నో నెలలుగా ప్రిపేరవుతున్న వారు డీఎస్సీ రాయాలా?, లేదంటే ఆర్‌ఆర్‌బీ రైల్వే ఎగ్జామ్ రాయాలా? అని సందిగ్ధంలో ఉన్నారు. ఒకటి రాస్తే..మరో పరీక్ష కోల్పోవాల్సి ఉంటుంది.
వాటితోపాటు అనేక బ్యాంకు పరీక్షలు, యూజీసీనెట్`2025 పరీక్షలు జూన్‌లోనే జరగున్నాయి. ఏ పరీక్ష రాయాలో ఏది వదులుకోవాలో తెలియక నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి డీఎస్సీ పరీక్ష తేదీలను వాయిదా వేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఏప్రిల్ 20న డీఎస్సీ విడుదల చేసిన విషయం విదితమే.మొత్తం 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీకి నోటిఫికేషన్ రావడంతో..ఉపాధ్యాయ నిరుద్యోగులు ఆశలన్నీ వాటిపైనే పెట్టుకున్నారు. ఈ పోస్టుల్లో జిల్లా స్థాయిలో 14,088, రాష్ట్ర, జోనల్ స్థాయిలో 2,259 పోస్టులున్నాయి.