. పాడి, పౌల్ట్రీ పరిశ్రమల్ని లాభాల బాట పట్టిస్తాం
. రాష్ట్ర జీఎస్డీపీలో 11.23 శాతం వాటా పశుసంవర్ధక శాఖదే
. కోడిగుడ్ల ఉత్పత్తిలో ప్రథమస్థానం మనదే
. మాంసం ఉత్పత్తిలో 5, పాల ఉత్పత్తిలో 7వ స్థానం
. పశు సంవర్ధక శాఖ టెక్`2.0 కాన్‌క్లేవ్‌లో సీఎం చంద్రబాబు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : పేదల జీవితాల్లో పెనుమార్పులు తెచ్చే పాడి, పౌల్ట్రీ పరిశ్రమలను లాభాల బాట పట్టిస్తామని…ఇందులో భాగంగా గ్రామస్థాయిలో డెయిరీ షెడ్లకు ఆస్తి పన్ను, ఇంటి పన్ను రద్దు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఏపీ ప్రథమ స్థానంలో ఉందని, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడల్లా వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. విజయవాడలో బుధవారం హోటల్ మురళీ ఫార్చ్యూన్‌లో జరిగిన పశు సంవర్ధశాఖ – టెక్ ఏఐ 2.0 కాన్‌క్లేవ్‌లో సీఎం పాల్గొని వివిధ వృత్తుల వారితో ముచ్చటించారు. వారి ఆదాయ, వ్యయాలపై చర్చించారు. సుమారు మూడు గంటలకు పైగా సీఎం సమావేశంలో పాల్గొన్నారు. లైవ్ స్టాక్ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా పేదరికాన్ని తగ్గించాలనే లక్ష్యంతో ఈ వర్క్ షాపు ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని, ఈ రంగంలో ఆసక్తి ఉన్నవారు ఇటువంటి సమావేశాలకు హాజరవుతూ కొత్త విషయాలను అందరూ నేర్చుకోవాలని సూచించారు.
అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నాం…
భారతదేశం ప్రపంచంలోనే పాల ఉత్పత్తిలో అగ్రగామి కాగా మన రాష్ట్రం అందులో వేగంగా పురోగతి సాధిస్తుండటం శుభ పరిణామమని సీఎం పేర్కొన్నారు. గుడ్ల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉండగా, మాంసం ఉత్పత్తిలో 5వ స్థానం, పాల ఉత్పత్తిలో 7వ స్థానంలో మన రాష్ట్రం ఉంది. లైవ్ స్టాక్‌లో 2014-15లో జీఎస్‌డీపీ రూ.43,127 కోట్లు ఉండగా….2018-2019 నాటికి దానిని రూ.91,633 కోట్లకు పెంచాం. 2014-19 మధ్య సీఏజీఆర్ 21 శాతం ఉండగా, 2019-24 మధ్య ఈ వృద్ది 11 శాతానికి తగ్గింది. 2024-25లో రూ.1.69 లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. రాష్ట్ర జీఎస్డీపీలో ఇది 11.23 శాతం. 2025-26 సంవత్సరానికి ఈ రంగంలో జీఎస్డీపీ వృద్ది లక్ష్యం రూ.1,95,460 కోట్లుగా పెట్టుకున్నామని సీఎం వివరించారు. 18 లక్షల హెక్టార్లలో ఉద్యానవన పంటలు సాగైతే రూ.లక్షా 55 వేల కోట్ల ఆదాయం వస్తుందని, అదే 50 లక్షల హెక్టార్లలో పండే వ్యవసాయ పంటల కారణంగా రూ.55 వేల కోట్లు వస్తోందన్నారు. అందుకే అధిక ఆదాయాన్నిచ్చే ఉద్యానవన పంటలను ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. 18 లక్షల హెక్టార్లను 36 లక్షల హెక్టార్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చంద్రబాబు చెప్పారు.
వ్యవసాయ రంగంలో మనమే టాప్
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఉంది. కానీ సేవల రంగం కూడా మెరుగవ్వాలి. ఇండస్ట్రీలు కూడా పెరగాలి. తెలంగాణ ఆదాయంలో 67 శాతం సేవల రంగం నుండే వస్తోంది. అదే మన రాష్ట్రంలో 46 శాతం మాత్రమే ఉంది. రాష్ట్రంలో సేవల రంగంతోపాటు ఇండస్ట్రీని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రజల ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. మంచి అరోగ్యం కోసం ప్రోటీన్ ఫుడ్ వైపు ప్రజలు మళ్లుతున్నారు. మిల్లెట్స్ వంటి వాటిపై ఆసక్తి చూపతున్నారు. వీటితోపాటు పండ్లు, కూరగాయలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకోసమే మనం ఉద్యానవన పంటలను అధికంగా పండిరచాలి. ఉద్యావన పంటల సంరక్షణ కోసం మైక్రో ఇరిగేషన్ చాలా అవసరం. డెయిరీకి దీనిని వర్తింపచేస్తాం.
మైక్రో ఇరిగేషన్‌లో 2.50 లక్షల ఎకరాలకు ఈ ఏడాది ప్రాధాన్యత ఇచ్చాం. సోలార్ పవర్ వెయ్యి యూనిట్ల వరకు పర్మిషన్ ఇస్తాం. మహిళలు తేలిగ్గా గడ్డి కోసేలా కటింగ్ మిషన్స్ అందుబాటులోకి తెస్తాం. డెయిరీని ఎలా ముందుకు తీసుకుపోవాలి, ఖర్చు ఎలా తగ్గించాలి పశువుల ఎలా చూసుకోవాలనే అంశంపై అధ్యయనంతో అవగాహన కల్పిస్తామని సీఎం అన్నారు.
రాబోయే రోజులన్నీ టెక్నాలజీవే
టెక్నాలజీలో చాలా మార్పులు వస్తున్నాయి. దాన్ని అందిపుచ్చుకున్నవారు మాత్రమే ముందుకు సాగగలరు. హైదరాబాద్‌లో ఐటీని అభివృద్ధి చేసిన కారణంగా ప్రపంచంలోనే అత్యధిక తలసరి ఆదాయం పొందుతున్న వారు భారతీయులు కాగా అందులో 35 శాతం మంది తెలుగు వారు ఉన్నారు.
ప్రస్తుతం నాలెడ్జ్, టెక్నాలజీ అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగించుకొని ఇంటికో పారిశ్రామికవేత్త కావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు కె.అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్, సీఎస్ విజయానంద్, కుటుంబరావు, టెక్ ప్రతినిధులు, వివిధ వృత్తిదారుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.