ఎకరా 99 పైసలకే అమ్మడం ఆక్షేపణీయం: సీపీఐ నేత రామకృష్ణ
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : డొల్ల కంపెనీ ‘ఉర్సా’కు రాష్ట్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయల విలువచేసే భూమిని కేటాయించడం తగదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ సోమవారం ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండిరచారు. కేవలం రెండు నెలల క్రితం హైదరాబాద్‌లో ఉత్తుత్తి కంపెనీగా రిజిస్టరయిన ఊరూ పేరు లేని ఉర్సా క్లస్టర్స్ అనే ఐటీ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో దాదాపు రూ.మూడు వేల కోట్ల విలువైన 60 ఎకరాల భూమిని కేవలం ఎకరా.0.99 పైసలకే అమ్మబోవడం తీవ్ర ఆక్షేపణీయ మని పేర్కొన్నారు. లీజు కాకుండా ఇలా అమ్మడం చాలా దుర్మార్గమన్నారు. కనీసం కార్యాలయంగానీ, ఫోన్ నంబరుగానీ, ఒక ఉద్యోగిగానీ లేని ఉర్సా కంపెనీకి విశాఖలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో వేల కోట్ల విలువైన భూమిని కేటాయించడాన్ని సీపీఐ తీవ్రంగా ఖండిస్తోందని, కంపెనీలకు ఉచితంగా భూములివ్వడం సరికాదన్నారు. ప్రభుత్వ ఆధీనంలో వేలాది ఎకరాల భూములున్నాయని, ఆయా భూములను రాష్ట్ర ప్రయోజనాలు… సమగ్రాభివృద్ధి కోసం వినియోగించుకోకుండా ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేయడాన్ని తప్పుపట్టారు. సీఎం చంద్రబాబు స్పందించి… అనాలోచిత భూ కేటాయింపులకు అడ్డుకట్ట వేయాలని కోరారు. ఉర్సా కంపెనీకి చేసిన భూ కేటాయింపులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
మల్లాం దళితుల సామాజిక బహిష్కరణ గర్హనీయం
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం మల్లాం గ్రామంలో దళితులను సామాజిక బహిష్కరణ చేయడాన్ని రామకృష్ణ తీవ్రంగా ఖండిరచారు. పెత్తందార్లు దళితులను సామాజిక బహిష్కరణకు గురిచేయడం దుర్మార్గమని తెలిపారు. విద్యుదాఘాతంతో మరణించిన దళిత యువకుడి కుటుంబానికి పెద్దలు రాజీ కుదిర్చిన మేరకు పరిహారం ఇవ్వకపోగా, పెత్తందార్లు దళిత కుటుంబాలను సామాజిక బహిష్కరణ చేయడాన్ని తప్పుపట్టారు. నాగరిక సమాజంలో ఇలాంటి సామాజిక రుగ్మతలు, సాంఘిక బహిష్కరణలు గర్హనీయమన్నారు. సీపీఐ తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాల కార్యదర్శులు టి.మధు, బోడ కొండ తదితర సీపీఐ ప్రతినిధి బృందం మల్లాం గ్రామం వెళ్లి దళితులను పరామర్శించారని పేర్కొన్నారు. తక్షణమే స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాన్ స్పందించి ఈ ఘటనపై తగు చర్యలు చేపట్టాలని, గ్రామంలో దళితులకు రక్షణ కల్పించాలన్నారు. పెత్తందార్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.