Homeతిరంగా నిరసన హోరు

తిరంగా నిరసన హోరు

- Advertisement -

జాతీయ జెండాలతో కదంతొక్కిన యువత, విద్యార్థులు

  • మండీ హౌస్ వద్ద వామపక్షాల ఆందోళన
  • నేహాబోరా సహా 150 మంది నిరసనకారుల నిర్బంధం
  • ఉద్యమం మరింత ఉద్ధృతం చేస్తాం: సంతోశ్కుమార్

న్యూఢిల్లీ: దేశ రాజధాని దిల్లీలో తిరంగా ర్యాలీని ఎలాగైనా జరగకుండా చేయాలన్న పోలీసుల కుట్రల్ని భగ్నం చేస్తూ… దేశ రాజధాని దిల్లీలో శుక్రవారం సాయంత్రం భారీ పోలీసు బందోబస్తు మధ్య తిరంగా నిరసనలు హోరెత్తాయి. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పిలుపునిచ్చిన ‘లెహ్రా దో తిరంగా’ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ… కన్నాట్ ప్లేస్, మండీ హౌస్ ప్రాంతాల్లో వందలాది మంది పార్టీ మద్దతుదారులు, విద్యార్థి సంఘాల కార్యకర్తలు జాతీయ జెండాలతో ఆందోళనలు చేపట్టారు. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, నేహా బోరా సహా 150 మందికి పైగా నిరసనకారులను దిల్లీ పోలీసులు నిర్బంధించారు. కన్నాట్ ప్లేస్ అంతర్గత వలయంలో నిరసనకారులు జాతీయ జెండాలతో కవాతు నిర్వహిస్తూ మధ్యమధ్యలో ‘జై హింద్’ నినాదాలు చేశారు. కొందరు జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం వేర్వేరు ప్రాంతాల్లో గుమిగూడి నిరసనలు కొనసాగించారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించడంతో అక్కడక్కడ స్వల్ప వాగ్వాదాలు, ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలు, కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీజేపీ నాయకుడు అభిజిత్ దీప్కేను దిల్లీ పోలీసులు నిర్బంధించిన కొద్దిసేపటికే ఈ ర్యాలీ జరగడం గమనార్హం.
మండీ హౌస్ వద్ద వామపక్షాల నిరసన
మరోవైపు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మండీ హౌస్ సమీపంలో ఏఐఎస్‌ఏ, ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ, ఏఐ‌ఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, కార్యకర్తలు, వామపక్ష పార్టీలు నేతలు, కార్యకర్తలు తిరంగా మార్చ్ నిర్వహించారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్), ఎన్నికల సంఘం పనితీరుపై నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేస్తూ… సీఈసీ రాజీనామా చేయాలని, ఎస్‌ఐఆర్ ప్రక్రియ ను వెనక్కి తీసుకోవాలని, 2023 ఎన్నికల కమిషనర్‌ల నియామక చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జాతీయ అధ్యక్షుడు రోషన్కుమార్ సిన్హా, ప్రధాన కార్యదర్శి సుఖ్జిందర్ మహేసరి, జాతీయ కార్యదర్శి హరీష్ బాలా, ఏఐ‌ఎస్‌ఎఫ్ జాతీయాధ్యక్షుడు విరాజ్ దేవాంగ్, సీపీఐ జాతీయ కార్యదర్శి, ఎంపీ పి.సంతోశ్ కుమార్, సీపీఎం ఎంపీలు జాన్ బ్రిట్టాస్, ఎ.ఎ. రహీం తదితరులు పాల్గొన్నారు. రానున్న రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని సీపీఐ ఎంపీ పి. సంతోశ్కుమార్ పేర్కొన్నారు. ఎలాంటి చర్యలు తీసుకున్నా ఉద్యమాన్ని ఆపలేరని, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అభిజిత్ దీప్కేను దిల్లీ పోలీసులు అపహరించారని, కన్నాట్ ప్లేస్‌లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారని ఎన్‌సీపీ అధికార ప్రతినిధి అనీష్ గవాండే ‘ఎక్స్’ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు