Homeఆంధ్రప్రదేశ్తొలిరోజే రణరంగం

తొలిరోజే రణరంగం

- Advertisement -

అన్నమయ్య గడ్డపై తీవ్ర ఉద్రిక్తతలు
పుంగనూరు, రాయచోటిలో యుద్ధకాండ

  • ఎంపీ మిథున్రెడ్డి కాన్వాయ్పై రాళ్లవర్షం
  • గాల్లోకి పోలీసుల కాల్పులు
  • 15 కార్ల ధ్వంసం, 4 వాహనాలు దహనం
  • పల్నాడు, ధర్మవరం, తిరుపతిలోనూ ఘర్షణలు
  • విజయవాడలో పోలీస్ కంట్రోల్ రూమ్
  • రాష్ట్రంలో వేడెక్కిన ‘స్థానిక’ రాజకీయాలు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి/ అన్నమయ్య: స్థానిక ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనపడింది. అనేకచోట్ల అధికార, ప్రతిపక్ష పార్టీలు మోహరింపులు జరుపుకున్నా నిలువరించడంలో వైఫల్యం చెందారు. అన్నమయ్య జిల్లాలో రాజకీయ వైరం పరాకాష్టకు చేరింది. పుంగనూరు, రాయచోటి పట్టణాలు యుద్దభూమిలా మారాయి. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య చెలరేగిన ఘర్షణలు జిల్లాలో ఒక్కసారిగా భయానక పరిస్థితిని తెచ్చిపెట్టాయి. రాళ్ల దాడులు, వాహనాల దహనం, పోలీసులు గాల్లోకి కాల్పుల వరకు వెళ్లడంతో జిల్లావ్యాప్తంగా శాంతిభద్రతలు పూర్తిగా ప్రమాదంలో పడ్డాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటనలు స్థానిక ఎన్నికలు సజావుగా జరిగేనా? ఎలాంటి రక్తపాతం సృష్టిస్తాయన్న భయం ప్రజల్లో నెలకొంది. పుంగనూరు మున్సిపాలిటీకి సంబంధించి శుక్రవారం నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లిన వైసీపీ ఎంపీ పీవీ మిథున్రెడ్డి కాన్వాయ్పై టీడీపీ వర్గీయులు రాళ్లదాడికి పాల్పడటంతో పరిస్థితి విషమించింది. నామినేషన్ కేంద్రం వద్దకు దూసుకొచ్చిన ఆందోళనకారులను నిలువరించేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. ఎంపీని రక్షించే క్రమంలో ఆయనను దాదాపు గంటపాటు ఓ ప్రత్యేక గదిలో ఉంచాల్సిన దుస్థితి నెలకొంది. మరోవైపు రాయచోటిలోని ఎస్‌ఎన్ కాలనీలో రెండు పార్టీల కార్యకర్తలు రాళ్లు, కర్రలతో విరుచుకుపడి బీభత్సం సృష్టించారు. వైసీపీ కార్యాలయం పరిసరాల్లో పార్క్ చేసిన వాహనాలు లక్ష్యంగా దాడులు జరపడంతో 15 కార్లు ధ్వంసమయ్యాయి, నాలుగు కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. నియోజకవర్గాల్లో చెలరేగిన ఈ హింసాత్మక ఘటనలతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ వరుస ఘటనలతో రాష్ట్రవ్యాప్తంగా స్థానిక ఎన్నికల రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
ఎంపీ కారుపై రాళ్లవర్షం…
గాల్లోకి కాల్పులు
పుంగనూరులో ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నామినేషన్ దాఖలు చేయించేందుకు బయలుదేరిన ఎంపీని టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. గతంలో మీరు మమ్మల్ని నామినేషన్ వేయించారా అంటు అడ్డుతగిలారు. అయినా మిథున్రెడ్డి ముందుకు వెళ్లే ప్రయత్నంలో టీడీపీ శ్రేణులు ఆయన వాహనంపై ఒక్కసారిగా రాళ్లు, కర్రలతో దాడికి దిగాయి. ఆయన వాహనంతో పాటు వెంట వస్తున్న ఇతర వాహనాలపైనా పెద్దఎత్తున రాళ్లు రువ్వారు. ఈ దాడిలో టీడీపీ కార్యకర్తల ప్రమేయం ఉన్నట్లు సమాచారం రావడంతో స్థానికంగా ఉద్రిక్తత మరింత పెరిగింది. దాడులు, ప్రతిదాడుల్లో సుమారు 15 మంది గాయపడ్డారు. మిథున్రెడ్డి గన్మెన్కు తీవ్రగాయాలయ్యాయి. ఈ దాడుల మధ్యే మిథున్రెడ్డి, ఇతర నేతలు అతికష్టంగా నామినేషన్ కేంద్రంలోకి చేరుకున్నారు. అయితే, టీడీపీ కార్యకర్తలు బారికేడ్లను సైతం బద్దలు కొట్టుకుంటూ నామినేషన్ కేంద్రంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించడంతో పరిస్థితి పూర్తిగా అదుపుతప్పింది. పరిస్థితిని నియంత్రించేందుకు పోలీసులు రంగంలోకి దిగి లాఠీచార్జ్ చేయడంతో పాటు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో నామినేషన్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో తీవ్ర భయానక వాతావరణం అలుముకుంది.
ప్రత్యేక గదిలో మిథున్ రెడ్డి
నామినేషన్ కేంద్రం వద్ద ఘర్షణ వాతావరణం ముదరడంతో అప్రమత్తమైన పోలీసులు ఎంపీ మిథున్రెడ్డిని భద్రతా కారణాల దృష్ట్యా ఓ ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లారు. బయట ఆందోళనకారులు ఆ గదిలోకి చొరబడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దాదాపు గంటపాటు ఆయన ఆ గదిలోనే గడపాల్సి వచ్చింది. నామినేషన్ వేళ చోటుచేసుకున్న ఈ పరిణామాలు పోలీసు యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టించాయి. వెంటనే అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. విషయం తెలిసిన వెంటనే అన్నమయ్య జిల్లా ఎస్‌పీ ధీరజ్ కన్ఙుల్లి అక్కడికి చేరుకొని… టీడీపీ, వైసీపీ శ్రేణులను చెదరగొట్టారు. మిథున్ రెడ్డిని అంబులెన్స్‌ వాహనంలో బయటికి తరలించారు. ఘటనకు సంబంధించి రెండువర్గాలపైనా కేసులు నమోదు చేస్తామని ఎస్‌పీ తెలిపారు.
రాయచోటిలో దహనకాండ
పుంగనూరులో ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే రాయచోటిలో రాజకీయ రణరంగం మంటలు రేపింది. పట్టణంలోని ఎస్‌ఎన్ కాలనీలో టీడీపీ, వైసీపీ వర్గాలు రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులకు తెగబడ్డాయి. ఈ ఘర్షణల్లో ప్రత్యర్థుల వాహనాలే టార్గెట్‌గా మారాయి. వైసీపీ కార్యాలయం ముందు వరుసలో నిలిపి ఉంచిన వాహనాలకు కొందరు నిప్పంటించారు. ఈ ఘటనలో 15 కార్లు తీవ్రంగా ధ్వంసమవగా… నాలుగు కార్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. పెద్దఎత్తున మంటలు, దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డి ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఈ తరహా హింసాకాండ చోటుచేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి దాడులు మళ్లీ జరగకుండా పోలీసు యంత్రాంగం జిల్లావ్యాప్తంగా పటిష్ట నిఘా, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది.
ధర్మవరం మున్సిపల్ కార్యాలయం
వద్ద ఉద్రిక్తత
సత్యసాయి జిల్లాలోని ధర్మవరం మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నామినేషన్ ప్రక్రియకు సంబంధించిన పనుల నిమిత్తం టీడీపీ నేతలు, కార్యకర్తలు కార్యాలయం వద్దకు చేరుకున్న సమయంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సోదరుడు తన అనుచరులతో భారీ కాన్వాయ్గా నామినేషన్ కేంద్రం వద్దకు రావడంతో రెండు వర్గాలు నినాదాలు, సవాళ్లకు దిగాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రెండువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో అక్కడ ఏం జరుగుతుందోనని స్థానికులు ఆందోళనకు గురికాగా, పోలీసులు చెదరగొట్టారు. ఈలోగా కొందరు రాళ్లు విసురుకున్నారు. తిరుపతిలో కార్పొరేటర్‌గా వైసీపీకి చెందిన మహిళా అభ్యర్థిని అడ్డుకుని ఆమె వద్ద నామినేషన్ ఫారం లాక్కుని టీడీపీ వర్గీయులు చించివేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పల్నాడు జిల్లాలోనూ ఘర్షణ వాతావరణం నెలకొంది. దాచేపల్లి నగర పంచాయతీ వైసీపీ అభ్యర్థి ఇంట్లో తెలంగాణ అక్రమ మద్యం నిల్వ ఉన్నట్లు పోలీసులు అరెస్ట్ చేయడం వివాదానికి దారితీసింది. ఆ తర్వాత మాచవరం ఎస్‌సీ కాలనీలో వైసీపీ శ్రేణులు కొందరు దాడులకు పాల్పడినట్లు టీడీపీకి చెందినవారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్‌సీ కమిషన్ చైర్మన్ ఆ ప్రాంతంలో పర్యటించి బాధితులను పరామర్శించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు