. ఐఐటీ, ఐఐఎస్ఈఆర్ సహకారంతో అతిపెద్ద రీసెర్చ్ సెంటర్
. ఏరో స్పేస్-డిఫెన్స్, ఐటీ-డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ సలహదారులతో భేటీ
. యువత భవిష్యత్తుకు బాటలు వేసేలా పరిశోధనలు: చంద్రబాబు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ఏపీ ఫస్ట్ పేరుతో తిరుపతిలో అతిపెద్ద రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు కానుంది. సీఎం క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఏరో స్పేస్-డిఫెన్స్, ఐటీ-డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ సలహదారులతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ భేటీలో డ్రోన్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి కేంద్రంగా అతిపెద్ద రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలను అంగీకరించారు. ఏపీ ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ‘ఏపీ ఫస్ట్’ పేరుతో తిరుపతిలో పరిశోధన కేంద్రం ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏపీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని, వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు ముందుకు వస్తున్నాయని చంద్రబాబు తెలిపారు. ‘ఏరో స్పేస్, డిఫెన్స్, స్పేస్ టెక్నాలజీ, ఏఐ-సైబర్ సెక్యూర్టీ, సెమీ కండక్టర్ల డివైసెస్-సెన్సార్లు, క్వాంటం టెక్నాలజీ, హెల్త్ కేర్, బయో టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, రూరల్ ఏరియా టెక్నాలజీ వంటి రంగాలు భవిష్యత్తులో కీలకం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి అనుగుణంగా విధానాలు రూపొందిస్తోంది. ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టే కంపెనీలను ప్రొత్సహిస్తోంది. దేశంలో తొలిసారిగా గ్రీన్ ఎనర్జీ రంగంలో గ్రీన్ అమోనియా ప్లాంట్ కాకినాడలో ఏర్పాటు చేయబోతున్నాం. ఈ తరహాలో కొత్త ఆవిష్కరణలకు…వివిధ స్టార్టప్ కంపెనీలకు రాష్ట్రం వేదికగా నిలవాలి. వచ్చే కంపెనీలకు, పరిశ్రమలకు నైపుణ్యమున్న యవతను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ మేరకు భవిష్యత్తులో డిమాండ్ ఉన్న రంగాలకు పెద్దపీట వేయడమే కాకుండా స్టార్టప్‌లను ప్రొత్సహించడం అవసరం, అందుకే అతి పెద్ద పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయబోతున్నాం. తిరుపతిలో ఏపీ-ఫస్ట్ వ్యవస్థ ద్వారా ఆ అవసరాలు తీరేలా… యువతకు సహకరించేలా పనిచేయాలి. తిరుపతిలోని ఐఐటీ-ఐఐఎస్ఈఆర్ సంయుక్త అధ్వర్యంలో ఏపీఫస్ట్ ఏర్పాటు కాబోతోంది. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దాలి. సమర్థంగా నిర్వహించాలి. అందుకోసం కేంద్ర ప్రభుత్వంతోనూ సంప్రదింపులు జరుపుతాం’ అని సీఎం అన్నారు.
వర్సిటీలు, కంపెనీలు, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌తో అనుసంధానం
‘రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన నిరంతరం ఏపీని అభివృద్ధి చేయడంతోపాటు యువతకు చక్కటి ఉపాధి కల్పించడంపైనే ఉంటుంది. సంక్షేమానికి-అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఏ స్థాయిలో ఆలోచన చేస్తుందో… యువతకు మెరుగైన అవకాశాలు అందించే విషయంలోనూ అదే స్థాయి ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఇందులో భాగంగానే ఏపీ ఫస్ట్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. యూనివర్సిటీలు, వివిధ రంగాల్లో ప్రముఖ స్థానంలో ఉన్న కంపెనీలతో ఏపీ ఫస్ట్ సమన్వయం చేసుకోవాలి. ఇప్పటికే వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ యూనివర్సిటీల్లో విద్యార్థులు కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. వాటిని అందిపుచ్చుకోవాలి. దీంతో యువతలో వివిధ రంగాల్లో నైపుణ్యం పెంచేందుకు పరిశ్రమలు, కంపెనీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఉండాలి. కొత్త టెక్నాలజీలు ఏంటీ? ఏయే రంగాల్లో అభివృద్ధి జరుగుతోందో గుర్తించి వాటిని కరిక్యులమ్‌లో చేర్చేలా విద్యా సంస్థలతో సంప్రదింపులు జరపాలి. ఆయా విద్యా సంస్థలకు కరిక్యులమ్ రూపొందించేలా ఏపీ ఫస్ట్ పని చేయాలి. ఐటీని ప్రోత్సహించడం వల్ల తెలుగువాళ్లు ఐటీలో మేటిగా ఉన్నారు. ఫార్మా రంగంలో భవిష్యత్ ఉంటుందని గుర్తించడం వల్లే తెలుగు రాష్ట్రాలు ఆ రంగాన్ని రాణిస్తున్నాయి. భవిష్యత్ రంగాలను నేటి యువత అందిపుచ్చుకోవాలి. దానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. యువత భవిత కోసం స్టార్టప్ కంపెనీలకు మరింత చేయూతనివ్వడం కోసం ఏపీ ఫస్ట్ వ్యవస్థ కృషి చేయాలి. వచ్చే మూడేళ్లల్లో కీలక పురోగతి కనబరిచేలా ఏపీ ఫస్ట్ పని చేయాల’ని సీఎం మార్గనిర్దేశనం చేశారు.
డ్రోన్లతో సేవలు సాధ్యమని నిరూపిద్దాం
డ్రోన్ కార్పొరేషన్‌ను మరింత బలోపేతం చేయాలని చంద్రబాబు సూచించారు. ప్రకృతి వైపరీత్యాల సందర్భాల్లో డ్రోన్ల ద్వారా బాధితులకు సేవలు అందించినట్లు గుర్తుచేశారు. వ్యవసాయం, మెడికల్ ఎమర్జెన్సీ వంటి వాటిల్లో డ్రోన్ల వినియోగం పెరగాలన్నారు. ఫ్యూచర్ టెక్నాలజీల కోసం ఇప్పటి నుంచే సంసిద్ధం కావాలని సూచించారు. వివిధ దేశాల్లో డ్రోన్ల ద్వారా ఎలాంటి సేవలు అందుతున్నాయో అధ్యయనం చేయాలని, ఎప్పటికప్పుడు సాంకేతికతను అప్డేట్ చేసుకోవాలన్నారు. డ్రోన్ కార్పొరేషన్ నిపుణులతో కూడిన సలహా బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని సీఎం సూచించారు. వచ్చే ఇంటర్నేషనల్ డ్రోన్ డే నాటికి డ్రోన్ల ద్వారా సేవలు ఏ విధంగా అందించవచ్చోననే అంశంపై రాష్ట్ర ప్రభుత్వ కృషిని ప్రజల కళ్లకు కట్టాలన్నారు. డ్రోన్ ట్యాక్సీ, డ్రోన్ అంబులెన్స్‌పై లోతుగా అధ్యయనం చేయాలని సీఎం సూచనలు చేశారు. కేంద్రంతో సంప్రదింపులు జరిపి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మేనేజ్మెంట్ వ్యవస్థ తరహాలో డ్రోన్ ట్రాఫిక్ కంట్రోల్ మేనేజ్మెంట్ వ్యవస్థను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని ఆదేశించారు. సమావేశంలో ఏరో స్పేస్ డిఫెన్స్ సలహదారు సతీశ్ రెడ్డి, ఐటీ-డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ సలహదారు అమిత్ దుగర్, తిరుపతి ఐఐటీ డైరెక్టర్ కెఎన్ సత్యనారాయణ, ప్రొఫెసర్ సెంథిల్ కుమార్, డీఎంటీఐ డైరెక్టర్ కల్నల్ పీఎస్ రెడ్డి సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


