ఉత్తరప్రదేశ్‌లోని సంభల్‌లోని ఓ పోలీసు అధికారి హోళీ సందర్భంగా ఎవరైన రంగులు చల్లితే, పూస్తే సహించలేనివాళ్లు హోళీ రోజు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని హితబోధ చేశారు. ఈ హితబోధను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి సమర్థించారు కూడా. మరో వేపు హిందూ అమ్మాయిలు మతం మారిస్తే వారికి మరణ శిక్ష విధిస్తామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అంటున్నారు. ఇంకో వేపు మహారాష్ట్రలోని మంత్రి నితేశ్ రాణే హిందువులు నడిపే మాంసం దుకాణాలకు ‘‘ప్రత్యేక సర్టిఫికేట్ ఇస్తారట. ఉత్తరప్రదేశ్‌లో పోలీసు అధికారి రంగులాడడం ఇష్టం లేనివారు ఆ రోజు ఇళ్ల నుంచి బయటకు రాకూడదన్నా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మతం మార్చే హిందూ అమ్మాయిలకు మరణ శిక్ష విధిస్తామన్నా ఈ మూడు సందర్భాలలోనూ ముస్లింలను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఏడాదికి 52 సార్లు వస్తుంది. కానీ ఏడాదికి ఒక సారే వస్తుందని కూడా సదరు పోలీసు అధికారి పేర్కొన్నారు. శుక్రవారం హోళీ పండగ ఉంది. ఇది రంజాన్ నెలకూడా. నిష్ఠా గరిష్టులైన ముస్లింలు రోజుకు అయిదు సార్లు నమాజ్ చేస్తారు. ముస్లింలది సామూహిక ప్రార్థనా విధానం. హిందువులది సామూహిక ఆరాధనా పద్ధతి కాదు. అలాంటి సామూహిక ఆరాధనలు అప్పుడప్పుడూ జరుగుతూ ఉండొచ్చు. ముస్లింలు వీలైనంత వరకు మసీదుకు వెళ్లి నమాజు చేయడం ఆనవాయితీ. కుదరనప్పుడు ముస్లింలు ఒంటరిగానే నమాజు చేసుకోవడం కూడా సర్వ సాధారణమే. ఈ సారి హోళీ శుక్రవారం వచ్చింది. రోజూ నమాజు చేయడం కుదరని వారు కనీసం శుక్రవారం అయినా చేస్తారు. వీలైతే ఆ రోజు మసీదుకు వెళ్లి నమాజ్ చేస్తారు. హోళీ కూడా ఈ సారి శుక్రవారమే వచ్చింది కనక, ఇది రంజాన్ నెల కనక ముస్లింలు అధిక సంఖ్యలో మసీదులకు వెళ్లి నమాజు చేస్తారు. అందువల్ల రోడ్ల మీద రంగుల పండుగ జరుపుకునే వారు ముస్లింల మీద రంగులు పోస్తే సహించలేని వారు ఇళ్లల్లోనే ఉండి నమాజు చేసుకోవడం మేలని ఉత్తరప్రదేశ్ పోలీసు అధికారి సెలవిచ్చారు. ఆ పోలీసు అధికారి పహెల్వాన్ అని కూడా గమనించండి అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఆ పోలీసు అధికారిని సమర్థించారు. ఇందులో మేం హోళీ జరుపుకుంటాం కనక మీరు వీధుల్లోకి రాకండి అని హెచ్చరిస్తున్నారన్నమాట. సంభల్ పోలీసు డిప్యూటీ సూపరింటెండెంట్ అనుజ్ కుమార్ హోలీ రోజు అంటే వచ్చే శుక్రవారం రోజు ముస్లింలు ఇంటి నుంచి బయటకు రాకూడదు అంటున్నారంటే మసీదుకు వెళ్లి ముస్లింలు నమాజు చేయకూడదని చెప్తున్నారన్నమాట. అంటే అధిక సంఖ్యాకులైన హిందువుల పండగలప్పుడు నమాజు చేయడానికైనా ముస్లింలు ఇంటి నుంచి బయటకు రాకూడదనే. ఇది ముస్లింల పట్ల బీజేపీ నాయకులు చూపే వివక్షకు, విద్వేషానికి సంకేతం. సంభల్ పోలీసు అధికారికి కూడా ఈ వివక్ష, విద్వేషం బాగా ఒంటబట్టాయనే అనుకోవాలి. అధికారంలో ఉన్న బీజేపీ పక్షం నాయకులు విద్వేష పూరిత రాజకీయాలు నడపడం మామూలు అయి పోయింది. దీన్ని బట్టి ప్రభుత్వాధికారులు, అందునా పోలీసు అధికారులు కూడా అధికార పక్ష రాజకీయాలను సమర్థించే స్థితికి దిగజారారనుకోవాలి.
మతం మార్చే హిందూ అమ్మాయిలకు మరణ శిక్ష విధిస్తామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహాన్ యాదవ్ యథాలాపంగా చెప్పలేదు. మహిళా దినోత్సవం రోజున ఒక ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన ఈ హెచ్చరిక చేశారు. తమ ప్రభుత్వం అమ్మాయిల గౌరవాదరాలను కాపాడడానికి కట్టుబడి ఉందట. ఆయనకు మత మార్పిడులు నచ్చకపోవచ్చు. కానీ మతం మారడానికి మన రాజ్యాంగం అనుమతిస్తుంది. పైగా మతం పూర్తిగా వ్యక్తిగత వ్యవహారం. నచ్చిన మతాన్ని ఎంపిక చేసుకునే అవకాశం మన రాజ్యాంగం ఇస్తోంది. అలాంటిది ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి మరణ శిక్ష విధించడం లాంటి కోర్టులు చేయాల్సిన పనిని తానే చేస్తానంటున్నారు. ఆయనకు ఈ అధికారం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. కోర్టులు చేయాల్సిన పని కార్యనిర్వాహక వర్గమే చేసేటట్టయితే ఇక న్యాయవ్యవస్థతో పని ఉండకూడదుగా! అమ్మాయిల గౌరవాదరాలను కాపాడే క్రమంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కోర్టుల బాధ్యత కూడా ఆయనే తీసుకుం టానంటున్నారు. ఇది రెండు రకాలుగా అభ్యంతరకరమైంది. ఒకటి: మరణ శిక్ష విధించే అవకాశం మన చట్టాల్లో ఉంది. కానీ అరుదాతి అరుదైన సందర్భాలలోనే మరణ శిక్ష విధిస్తున్నారు. అసలు మరణశిక్షే అమానవీయమైంది. వ్యక్తులకు మరణ శిక్ష విధించడమే మానవీయం కాదని ప్రపంచం అంతా భావిస్తున్నప్పుడు మరణ శిక్షను సమర్థించడం ఆమోదకరమైంది కాదు. రెండు: కోర్టుల పరిధిలోకి కార్యనిర్వాహక వర్గం దూరిపోవడం రాజ్యాంగం నిర్దేశించిన అధికార విభజనను ఉల్లంఘించడమే. ఇక మహారాష్ట్ర మంత్రి నితీశ్ రాణె హిందువులు నడిపే మాంసం దుకాణాలకు ప్రత్యేక సర్టిఫికేట్లు ఇస్తారట. ఈ దుకాణాలలో మాంసంలో కల్తీ ఉండదట. అలాంటి కల్తీ జరిగినప్పుడు దాన్ని నిరోధించడానికి సమర్థమైన చట్టాలు ఇప్పటికే ఉన్నాయి. మళ్లీ ప్రత్యేకంగా హిందువులు నడిపే మాంసం దుకాణాలకు ప్రత్యేక సర్టిఫికేట్ ఇస్తామనడం, ఈ సర్టిఫికేట్లు లేని దుకాణాల్లో మాంసం కొనగూడదని కూడా రాణె హితవు పలికారు. ఆయన అసలు ఉద్దేశం ఏంటంటే హిందువులు కేవలం హిందువులు నడిపే మాంసం దుకాణాల్లోనే మాంసం కొనాలని. అంటే ఈ వ్యాపారానికి ముస్లింలకు వాటా లేకుండా చేయడం. అంతిమంగా ఇది హిందూ-ముస్లిం మాంసం దుకాణాలు ఏర్పాటు చేయడానికే దారి తీస్తుంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర మంత్రి, ఉత్తరప్రదేశ్‌లోని సంభల్‌లోని పోలీసు ఉన్నతాధికారి కట్టగట్టుకుని ముస్లింల విషయంలో విద్వేషపూరిత ధోరణికి ఆజ్యం పోయడమే. విద్వేషం ఎన్ని రకాలుగా వెర్రి తలలు వేస్తుందో, దీని వెనక హిందుత్వ రాజకీయాలు ఆచరణలో ఎంత వివక్షాపూరితంగా తయారవుతున్నాయో ఆలోచిస్తే, మన రాజకీయాలు ఎంతగా దిగజారుతున్నాయో ఆలోచిస్తే దిగులు మాత్రమే మిగుల్తోంది. మత విద్వేషం ఎందుకు, ఎంత ప్రమాదకరమైందో జనం ఆలోచించగలగాలి. అన్ని రంగాల్లోనూ విద్వేషాన్ని అమలు చేయడానికి బీజేపీ కంకణం కట్టుకుంది. కేవలం ఎన్నికల సమయంలోనే బీజేపీ విద్వేష వమనం చేయడం లేదు. నిరంతరం విద్వేషం నింపడంలో మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం, బీజేపీ కూడా మునిగి తేలుతున్నాయి. కేవలం మోదీ ప్రభుత్వ దుర్నీతి, గుప్పెడు మంది పెట్టుబడిదార్లకు లాభాలు నొల్లుకోవడానికి అవకాశం ఇచ్చే విధానాలు, నిరుద్యోగాన్ని బొత్తిగా పట్టించుకోకపోవడం మాత్రమే సమస్యలు కావు. దేశ జనం మూలుగల్లోకి విద్వేషం ఎక్కించడం అంతకన్నా పెద్ద ప్రమాదం.