. అదానీ కంపెనీకి భూముల వివాదం
. రాష్ట్ర ప్రభుత్వానికి, కంపెనీలకు హైకోర్టు నోటీసులు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: నిన్న గీతం విశ్వవిద్యాలయం..నేడు..అదానీ కంపెనీ. కారు చౌకగా ప్రభుత్వ భూముల కట్టబెట్టే చర్యలపై వరుస వారీగా చంద్రబాబు ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కార్పొరేట్, ప్రైవేట్ సంస్థలకు కారుచౌకగా భూములు కేటాయిస్తూ జారీజేసిన ఉత్తర్వులు ఒక్కొక్కటీ వివాదంగా మారుతున్నాయి. వామపక్ష, లౌకిక పార్టీలు వ్యతిరేకిస్తున్నా భూ కేటాయింపుల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గడంలేదు. దీంతో కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈనెల 3న గీతం యూనివర్సిటీకి భూముల కేటాయింపుపై ఆ ప్రాంతానికి చెందిన న్యాయవాది హైకోర్టును ఆశ్రయించగా, యాజమాన్యానికి కోర్టు నోటీసులు జారీజేసింది. తాజాగా అదానీ డేటా సెంటర్‌కు కారు చౌకగా భూ కేటాయింపులపై హైకోర్టు అభ్యంతరం తెలిపింది. రూ.5వేల కోట్ల విలువైన విశాఖ జిల్లాలోని 480 ఎకరాల భూమిని అదానీ గ్రూప్‌కు చెందిన రైడ్ అండ్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అదానీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, అదానీ పవర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు ఉచితంగా కేటాయించడాన్ని సవాల్ చేస్తూ జై భీమ్ భారత్ పార్టీ (జేబీపీ) అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేయడం చర్చానీయాంశంమైంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీర సింగ్ ఠాకర్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వానికి అనేక ప్రశ్నలు వేసింది. జీవో ఎంఎస్ నంబరు 40 తేదీ (11.10.2025) ద్వారా భూమితోపాటు వెయ్యి కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది. అనంతరం జీవో ఎంఎస్ నంబరు 66 (తేదీ 2.12.2025) ద్వారా 480 ఎకరాల భూమిని తక్షణమే బదలాయించాలని ఉత్తర్వులు జారీ జేసినట్లు ఆ పిల్ పేర్కొంది. పిటిషనర్ తరపున న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్ వాదనలు వినిపించారు. పరిశ్రమ పూర్తయ్యాకే భూ బదలాయింపు జరగాలన్న నిబంధన ఉన్నప్పటికీ, ముందస్తుగానే సేల్‌డీడ్ రాయిస్తే భూమిపై తన పూర్తి హక్కులను ప్రభుత్వం కోల్పోతుందని తెలిపారు. సేల్ డీడ్ రాసి… ప్రాజెక్టు పూర్తికాక పోతే భూమిని తిరిగి స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉందని వాదించారు. ఏ పాలసీ ఆధారంగా భూమిని ఉచితంగా బదలాయిస్తున్నారు, ఆయా జీవోల ప్రకారం ఇప్పటికే సేల్ డీడ్లు రాశారంటూ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌ను కోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం తరపున పూర్తి వివరాలు సమర్పించేందుకు సమయం కోవాలని ఆయన కోరగా న్యాయస్థానం అంగీకరించింది. తదుపరి విచారణ నాటికి అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. భూ బదలాయింపుల విషయంలో ప్రభుత్వం రూపొందించి చట్టాలు, నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రభుత్వానికి, అదానీ కంపెనీలకు నోటీసులను కోర్టు జారీచేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.


