Friday, May 16, 2025
Homeధనుంజయ్‌, కృష్ణమోహన్‌ అరెస్టు

ధనుంజయ్‌, కృష్ణమోహన్‌ అరెస్టు

. మద్యం కేసులో కీలక పరిణామం
. ముందస్తు బెయిల్‌ నిరాకరణ
. విచారణకు సహకంరించాలని సుప్రీం ఆదేశం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : మద్యం కుంభకోణం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో కీలక నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ధనుంజయ్‌ రెడ్డిని ఎట్టకేలకు సిట్‌ పోలీసుల బృందం అరెస్టు చేసింది. ఈ కేసుపై శుక్రవారం విచారించిన సుప్రీం ధర్మాసనం మద్యం కేసు దర్యాప్తు కొనసాగుతున్నందువల్ల ముందస్తు బెయిల్‌ ఇవ్వలేమని తేల్చిచెప్పింది. ఇప్పటికే కృష్ణమోహన్‌ రెడ్డి, ధనుంజయ్‌రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్‌ను హైకోర్టు నిరాకరించిన విషయం విదితమే. దీంతో వారిద్దరు హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. జస్టిస్‌ పార్థీవాలా నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ముందస్తు బెయిల్‌ ఇస్తే దర్యాప్తుకు ఆటంకాలు ఎదురవుతాయని ధర్మాసనం స్పష్టం చేసింది. గత ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయాల ద్వారా పెద్దఎత్తున వేల కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు సీఐడీ భావిస్తోంది. దీనిపై విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖర్‌బాబు నేతృత్వంలో సిట్‌ బృందం దర్యాప్తు చేపట్టింది. తాడేపల్లి ప్యాలెస్‌కు మద్యం సొమ్ములు చేర్చడంలో ధనుంజయ్‌ రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, భారతీ సిమెంట్స్‌ శాశ్వత డైరెక్టర్‌ గోవిందప్ప బాలాజీల పాత్ర ఉన్నట్లుగా సిట్‌ ప్రాథమికంగా గుర్తించింది. ఈ విచారణలో భాగంగా అరెస్టుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే రాజ్‌ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్‌రెడ్డి తదితరులను సిట్‌ బృందం అరెస్టు చేసి… కీలక అంశాలను రాబట్టింది. ఇదే కేసులో గోవిందప్పను కర్నాటకలో సిట్‌ అధికారులు అరెస్టు చేశారు. మూడు రోజుల విచారణ అనంతరం కృష్ణమోహన్‌రెడ్డి, ధనుంజయ్‌రెడ్డిని అరెస్టు చేసినట్లు సిట్‌ అధికారులు వెల్లడిరచారు. శనివారం ఉదయం ఏసీబీ కోర్టులో వారిద్దర్నీ సిట్‌ అధికారులు హాజరుపరచనున్నారు.
రెండో రోజు సజ్జల శ్రీధర్‌రెడ్డి విచారణ
మద్యం కుంభకోణం కేసులో సజ్జల శ్రీధర్‌రెడ్డి సిట్‌ అధికారులు రెండోరోజు శుక్రవారం విచారించారు. శ్రీధర్‌రెడ్డిని విజయవాడ జిల్లా జైలు నుంచి గవర్నమెంట్‌ హాస్పిటల్‌కు తరలించి…వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సిట్‌ కార్యాలయానికి తరలించి… విచారణ చేశారు. ఈనెల 15వ తేదీన ఏడు గంటలపాటు శ్రీధర్‌రెడ్డిని సిట్‌ అధికారులు విచారించి… కీలక ప్రశ్నలు వేసినట్లు తెలిసింది. మరోవైపు ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి సిట్‌ విచారణకు హాజరయ్యారు.
కాకాణికి లభించని ముందస్తు బెయిల్‌
క్వార్ట్జ్‌ అక్రమాల కేసులో మాజీమంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డికి ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. మైనింగ్‌ అక్రమ తవ్వకాలపై కాకాణిపై గతంలో పొదలకూరు స్టేషన్లో కేసు నమోదు చేశారు. గిరిజనులను బెదిరించారని ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. విచారణకు హాజరు కావాలని నెల్లూరు డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసులు నోటీసులు ఇవ్వగా… కాకాణి స్పందించలేదు. 2 నెలలుగా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్నారు. ఆయన కోసం పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.సుప్రీంలో కాకాణికి ముందస్తు బెయిల్‌ రాకపోవడంతో ఆయన అరెస్టు అనివార్యం కానుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు