Homeనదుల అనుసంధానంతో నీటి సమస్యకు పరిష్కారం

నదుల అనుసంధానంతో నీటి సమస్యకు పరిష్కారం

- Advertisement -
  • విదేశాలకు పాప్కార్న ఎగుమతి
  • ఫుడ్ ప్రాసెసింగ్‌తో రైతుకు లబ్ధి
  • సీఎం చంద్రబాబు

విశాలాంధ్ర బ్యూరో` ఏలూరు/ ముసునూరు: నదుల అనుసంధానం ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సముద్రంలోకి వృథాగా పోతున్న వరద జలాలను తరలించడం ద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో సాగు, తాగునీటి కొరతను పూర్తిగా నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఏలూరు జిల్లా ముసునూరులో గోర్మే పాప్కార్నికా సంస్థ అధ్వర్యంలో జన్యుపరంగా మార్పు చేయని (నాన్-జీఎంఓ) మొక్కజొన్న వంగడాన్ని ఉపరాష్ట్రపతి, గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, చంద్రబాబు నాయుడు సోమవారం ఆవిష్కరించారు. చంద్రబాబు మాట్లాడుతూ నీటి భద్రత సాధిస్తే దేశ అభివృద్ధి అన్ స్టాపబుల్ అన్నారు. రాష్ట్రంలోని వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేసి విలువ జోడించే ప్రక్రియను చేపడతామని చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ ప్రక్రియ ద్వారా ఉత్పత్తులకు విలువ పెరిగి రైతులకు ప్రయోజనం కలిగి సంపద సృష్టికి ఆస్కారం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. మన వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్‌లకు ఎగుమతి చేయాలన్నదే కూటమి ప్రభుత్వ ఆలోచన అన్నారు. ‘రైతులపై ఉన్న ప్రేమ, అభిమానంతో ఏలూరు జిల్లాకు వచ్చి రైతులు పండిస్తున్న జన్యుమార్పిడి జరగని మొక్క జొన్న విత్తనాలను ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారన్నారు. గార్మె పాప్ కార్న సంస్థ భారత నేలపైనే దేశీయంగా జన్యుమార్పిడి జరగని విత్తనాలను రైతులతో కలిసి ఉత్పత్తి చేస్తోంది. నూజివీడు గడ్డ నుంచే పండే పాప్ కార్న మొక్క జొన్న దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలతో పాటు ఇతర దేశాలకూ ఎగుమతి అవుతుందన్నారు. గార్మె పాప్ కార్న దేశంలోనే అతిపెద్ద పాప్ కార్న ఉత్పత్తి సంస్థగా అవతరించిందన్నారు. నూజివీడు సమీపంలోని ముసునూరు వద్ద దేశంలోనే అతిపెద్ద పాప్ కార్న ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయటం సంతోషదాయకమన్నారు. దేశవ్యాప్తంగా పాప్ కార్న ఉత్పత్తిలో 70 శాతం వాటా గల గార్మె సంస్థకు అభినందనలు తెలిపారు. .ఆంధ్రా పాప్ కార్న, అరకు కాఫీ తాగేలా రైల్వే స్టేషన్‌లలోనూ కౌంటర్లు ఏర్పాటు చేసేలా చర్యలు చేపడతామన్నారు. వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులను ప్రాసెస్ చేసి విలువ జోడించి ఓ మంచి బ్రాండ్‌తో అంతర్జాతీయ మార్కెట్‌లకు తరలిద్దామని తెలిపారు. ప్రతి కుటుంబంలో ఓ పారిశ్రామిక వేత్త రావాలన్నారు. నూజివీడు వద్ద పామాయిల్, కోకో, ఆక్వా లాంటి వాణిజ్య పంటలు పెరిగాయన్నారు. రాయలసీమను ఉద్యాన పంటల హబ్‌గా మార్చేలా కార్యాచరణ చేపట్టానన్నారు. రూ.లక్ష కోట్ల వ్యయంతో ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులతో రాయలసీమను అభివృద్ధి చేస్తున్నామన్నారు. రూ.35 వేల కోట్లతో 36 సాగు ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తిచేస్తామన్నారు. చింతలపూడి ప్రాజెక్టును రాబోయే రెండేళ్లలో పూర్తి చేసి మెట్ట ప్రాంత ప్రజల చిరకాల స్వప్నాన్ని నెరవేరుస్తామని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టును ఈ నెలాఖరులోనే ప్రారంభించి మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాకు నీరు ఇస్తామన్నారు.
ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ మాట్లాడుతూ దిగుమతులపై ఆధారపడ కుండా స్వదేశీ పరిజ్ఞానంతో ఆహార భద్రత, స్వయం సమృద్ధి సాధించాలని పేర్కొన్నారు. భవిష్యత్తులో పాప్కార్న దిగుమతి చేసుకోకుండా ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదుగుతోందని ప్రశంసలు అందుతున్నాయన్నారు. దేశ జీడీపీ, స్థూల విలువ జోడింపులో వ్యవసాయ రంగం సుమారు 1/5వ వంతు వాటా కలిగి ఉండటమే కాకుండా, 46.1 శాతం మందికి ఉపాధిని, 55 శాతం జనాభాకు జీవనాధారాన్ని అందిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తోందన్నారు. రైతు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం-కిసాన్, పీఎం ఫసల్ బీమా యోజన, కిసాన్ క్రెడిట్ కార్డులతో పాటు మహిళా సంఘాలకు ఆధునిక సాంకేతికతను జోడించే ‘నమో డ్రోన్ దీదీ’ వంటి పథకాలు వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయన్నారు. మంత్రులు నారా లోకేశ్, కొలుసు పార్థసారథి, అచ్చెన్నాయుడు, గోర్మే పాప్కార్నికా సంస్థ ప్రతినిధులు వెంకటేశ్వరబాబు, మహీధర్ రెడ్డి, యుగంధర్, ప్రిఫర్డ్ పాప్ కార్న సీఈఓ నార్ˆ కూర్గ ప్రభృతులు పాల్గొన్నారు. అనంతరం పాప్కార్న ఉత్పత్తిలో విశేష సేవలందించిన రైతులను ఉప రాష్ట్రపతి సన్మానించారు. అంతకుముందు ఉపరాష్ట్రపతికి ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు ఘనస్వాగతం పలికారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు