Friday, May 9, 2025
Homeనియోజకవర్గానికొకవిజన్‌ డాక్యుమెంట్‌

నియోజకవర్గానికొకవిజన్‌ డాక్యుమెంట్‌

. ఎమ్మెల్యే చైర్మన్‌గా అభివృద్ధి ప్రణాళికలు అమలు
. ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు
. ఉగాది నుంచి పీ4 అమలు
. త్రిభాషా విధానంపై రాద్ధాంతం తగదు
. స్వర్ణాంధ్ర2047పై చంద్రబాబు ప్రజెంటేషన్‌

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : స్వర్ణాంధ్ర విజన్‌-2047 సాధనలో భాగంగా నియోజకవర్గ స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, వాటి అమలుకు ఎమ్మెల్యేలు సంకల్పం తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. పైలెట్‌ ప్రాజెక్టుగా ముందు కుప్పం, పిఠాపురం, మంగళగిరి, ఉరవకొండ నియోజకవర్గాలకు విజన్‌ డాక్యుమెంట్‌ సిద్ధం చేసినట్టు చెప్పారు. సోమవారం శాసన సభ సమావేశంలో జరిగిన లఘ చర్చలో ‘స్వర్ణాంధ్ర విజన్‌-2047’ లో భాగంగా రూపొందించిన నియోజకవర్గాల-2047 విజన్‌ డాక్యమెంట్‌పై ముఖ్యమంత్రి ప్రజెంటేషన్‌ ఇచ్చారు. మండల, మునిసిపాలిటీ విజన్‌ యాక్షన్‌ ప్లాన్‌ను గ్రామ, వార్డు సచివాలయం యూనిట్‌గా తీసుకుని అమలయ్యేలా చూస్తామన్నారు. జిల్లా విజన్‌ డాక్యుమెంట్‌ రూపొందించి కలెక్టర్ల సదుస్సులో విడుదల చేస్తామని ప్రకటించారు. ప్రతి చివరి వ్యక్తిని కూడా విజన్‌లో భాగస్వామిని చేస్తామని చెప్పారు. నియోజకవర్గం ఎమ్మెల్యే చైర్మన్‌గా, జిల్లాస్థాయి అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించి విజన్‌ అమలుకు సంస్థాగత యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే ప్రస్తుతం నెలకొన్న సమస్యలు ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వంలాగా పరిశ్రమలు తరిమేయడం కాకుండా… తీసుకురావడం నేర్చుకోవాలని ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. పరిశ్రమలు తేవడంలో మీరు కూడా భాగస్వాములు కావాలని సూచించారు. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలని, ఉపాధి కలగాలంటే పరిశ్రమలు రావాలన్నారు. సేవల రంగం వృద్ధితో ఆదాయం పెరుగుతుందని చెప్పారు. వికసిత్‌ భారత్‌లో భాగంగా రూపొందించిన స్వర్ణాంధ్ర-2047 విజన్‌ డాక్యుమెంట్‌ ప్రకారం ప్రతి ఏటా 15 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన వివరించారు.
ప్రతి కుటుంబానికి సొంతిల్లు నిర్మిస్తాం
నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం ఉండాలని, గ్రామీణ ప్రాం తాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. గత ప్రభుత్వం సెంటు పట్టాను ఊరికి దూరంగా ఇవ్వడంతో అది ఎవరికీ పనికిరాకుండా, చాలీచాలనట్టుగా ఉండ టంతో నిరుపయోగం అయ్యాయని అన్నారు. సెంటు పట్టా ఉన్నచోటనే స్థలం కావాలంటే రెండు సెంట్లు స్థలం ఇస్తామన్నారు. 2029 నాటికి ప్రతి కుటుంబానికి సొంతిల్లు నిర్మిస్తామని సీఎం పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో 35 లక్షల మంది అట్టడుగు స్థాయిలో ఉన్నారని, వీరిలో మొదటి దశ కింద 20 లక్షల మందిని, రెండో దశలో 15 లక్షల మందిని పీ4లో భాగస్వామ్యులను చేస్తామని తెలిపారు. పేదలను దత్తత తీసుకునే వారికి ప్రభుత్వం తరపున అవార్డులు, గుర్తింపు ఇచ్చి గౌరవిస్తామన్నారు.
స్వర్ణాంధ్రకు పది సూత్రాలు
స్వర్ణాంధ్ర విజన్‌ 2047 సాకారానికి 10 సూత్రాలను పరిగణనలోకి తీసుకున్నామని తెలిపారు. 1.పేదరికం లేని సమాజం, 2.ఉద్యోగ, ఉపాధి కల్పన, 3.నైపుణ్యం-మానవ వనరుల అభివృద్ది, 4.నీటి భద్రత, 5.ఫార్మర్‌ అగ్రిటెక్‌, 6.ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, 7.ఇంధనవనరుల సమర్థ వినియోగం, 8.నాణ్యమైన ఉత్పత్తులు, 9.స్వచ్ఛాంధ్ర, 10.డీప్‌ టెక్‌ అని వెల్లడిరచారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అభివృద్ధికి మైక్రో లెవెల్‌ ప్లానింగ్‌ అనుసరిస్తున్నామన్నారు. ఫిజికల్‌ అండ్‌ సోషల్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ అవసరాలపై దృష్టి పెడతామని చెప్పారు. రాష్ట్ర లక్ష్యాలకు అనుగుణంగా నియోజకవర్గ స్థాయిలో ప్రాజెక్టులు చేపడతామని, కుటుంబ స్థాయిలో అభివృద్ధి-సాధికారత సాధించడం, సామాజిక భద్రత కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. పీ4 విధానం, జనాభా నిర్వహణ ప్రభుత్వ ప్రాధాన్యాలుగా పేర్కొన్నారు.
త్రిభాషా విధానంలో తప్పేముంది
ఇంగ్లీష్‌ మీడియంతో నాలెడ్జ్‌ వస్తుందని చెబుతున్నారని, కానీ భాష కేవలం కమ్యునికేషన్‌కు మాత్రమే చంద్రబాబు అన్నారు. మాతృభాషలో చదువుకున్న వారే ప్రపంచ వ్యాప్తంగా రాణించారు. భాషను ద్వేషించడంలో అర్థం లేదు. మాతృభాష తెలుగు, హిందీ జాతీయ భాష, అంతర్జాతీయ భాష ఇంగ్లీష్‌. మన వాళ్లు జపాన్‌, జర్మనీ, ఇతర దేశాలకు వెళుతున్నారు. అవసరమైన ఆ భాషలను మనం నేర్చుకుంటే ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. ఎన్ని భాషలు నేర్చుకుంటే అంత ఎక్కువ ఉపయోగం ఉంటుందని, అందువల్ల త్రిభాషా విధానాన్ని రాద్ధాంతం చేయడం తగదని చంద్రబాబు హితవు పలికారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు