గత ఆదివారం ఉగాది. ఆ మర్నాడు సోమవారం రంజాన్. ఈ రెండు పండగల మధ్య లేని వైరుధ్యం చూపించి ముస్లింల మీద ఆంక్షలు విధించడం పరిపాటి అయిపోయింది. సోమవారం అనేక చోట్ల ముందెన్నడూ లేని బందోబస్తు కనిపించింది. ఆ బందోబస్తు ఉగాది రోజు ఎక్కడా మచ్చుకు కూడా లేదు. హైదరాబాద్ సంస్థానంలో ఒకే రోజు హిందువుల, ముస్లింల పండగ వస్తే హిందువుల పండగ రద్దు చేసే వారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకపోయినా ముస్లింల పండగ మీద ఆంక్షలు తప్పడం లేదు. ముస్లింలు స్వేచ్ఛగా రంజాన్ పండగ జరుపు కోకుండా బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఆంక్షలు విధించారు. యోగీ ఆదిత్యనాథ్ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లో ఈ ఆంక్షలు కొట్టొచ్చినట్టుగా కనిపిం చాయి. స్వాతంత్య్ర అమృతోత్సవం జరుపుకుంటున్న తరుణంలో ఇలాంటి ఆంక్షలు విధించడం చూస్తే ముస్లింల మీద కత్తిగట్టినట్టు వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇది సాంస్కృతిక, సామాజిక రంగాల నుంచి ముస్లింలను పరిహరించడానికి ప్రయత్నిస్తున్నట్టు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత సంవత్సరం ఉత్తరప్రదేశ్‌లో ముస్లింలు రోడ్ల మీద నమాజు చదవకూడదని చెప్పారు. ఈ సంవత్సరం ఆ పథకాన్ని అమలు చేయడానికి మినహాయిం పులు లేకుండా ప్రయత్నించారు. ముస్లింలు రోడ్ల మీద నమాజు చేస్తే రాకపోకలకు అవాంతరం కలుగుతుందట. హిందువులు కావడి యాత్రలు నిర్వహించినప్పుడు, శ్రీరామ నవమి సందర్భంగా ఊరేగింపులు నిర్వహించిన ప్పుడు రోడ్ల మీద అవాంతరాలు ఎందుకు గుర్తుకు రావడం లేదో తెలియదు. ఈసారి రంజాన్ సందర్భంగా రోడ్ల మీద నమాజు చేయడానికి వీలు లేదని యోగీ ప్రభుత్వం కచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆంక్షలను ఉల్లంఘిస్తే నేరానికి పాల్పడినట్టేనని పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఒక సీనియర్ పోలీసు అధికారి హెచ్చరించారు. ఒకవేళ ఉల్లంఘిస్తే వారి పాస్ పోర్టులు, లైసెన్సులు రద్దు చేస్తామని ఆ పోలీసు అధికారి తెగేసి చెప్పారు. గత నవంబర్‌లో అల్లర్లు జరిగిన సంభల్ లోనైతే ఇళ్ల పైకప్పుల మీద కూడా నమాజు చేయడానికి వీలు లేదని ఆంక్ష విధించారు. ఇలాంటి అస్తవ్యస్త ఆంక్షలను ప్రతిపక్షాలు తీవ్రంగా ప్రతిఘటించడంతో శిథిలావస్థలో ఉన్న ఎనిమిది, పది భవనాల పైకప్పు మీద నమాజు చేయకూడదన్న ఆంక్ష విధిం చామని జిల్లా కలెక్టర్ రాజేంద్ర పెన్సియా రంజాన్ నెలలో ఆఖరి శుక్రవారం రాత్రి ప్రార్థనలు ముగిసిన తరవాత చెప్పడం విడ్డూరంగా ఉంది. గత సంవత్సరం రోడ్ల మీద నమాజు చేయకూడదన్న ఆంక్షను ఉల్లంఘించినం దుకు 80 మంది మీద చర్య తీసుకున్నామని మీరట్ పోలీసు సూపరింటెం డెంట్ ఆయుష్ విక్రం సింగ్ చెప్పారు. ఎట్టి పరిస్థితిలోనూ రోడ్ల మీద నమాజు చేయడానికి వీల్లేదని ఆయన చెప్పారు. ముస్లింలు కొత్త పాస్ పోర్టు తీసుకోవాలంటే కోర్టు నుంచి అభ్యంతరం లేదన్న సర్టిఫికేట్ తీసుకోవాలని కూడా ఆ అధికారి చెప్పారు. ఇలాంటి ఆంక్షలను కేంద్ర మంత్రి జయంత్ సింగ్ కూడా ఖండిరచవలసి వచ్చింది. రోడ్ల మీద ఎవరూ నమాజు చేయ కుండా నిరోధించేందుకు సంభల్‌లో అధికారులు డ్రోన్ కెమెరాలు, సీసీ టీవీలు ఉపయోగించారు. నిర్ణీతమైన మసీదులు, ఈద్గాలలో మాత్రమే నమాజు చేయడానికి అనుమతిస్తామని సంభల్ అసిస్టెంట్ పోలీసు సూపరింటెండెంట్ శిరీశ్ చంద్ర సెలవిచ్చారు. ఒక వేళ ఏ మసీదులోనైనా 70 నుంచి 80 శాతం వరకు నమాజు చేసే వారు ఉంటే అంతకుమించి ఆ మసీదులోకి రాకుండా నిరోధిస్తామని, దీనికోసం బారికేడ్లు నిర్మిస్తామని, మిగిలిన వారు మరో మసీదులోకి వెళ్లి నమాజు చేసుకోవాలని అధికారులు ఖండితంగా చెప్పారు. ప్రైవేటు ఇళ్ల మీద నమాజు చేయకూడదనడం ఎక్కడి న్యాయమో తెలియదు. మసీదులో చోటు నిండిపోతే ఇళ్ల పైకప్పుల మీద కూడా నమాజు చేయకూడ దనడం ముస్లింల మత స్వేచ్ఛను హరించడమే. ముస్లింలకు వ్యతిరేకంగా చిరాకు కలిగించే ప్రకటనలు చేయడంలో పోలీసు అధికారులు పోటీ పడ్తున్నట్టు ఉంది. ఇది ప్రచారార్భాటమో యోగీ ఆదిత్యనాథ్‌ను మెప్పించడం కోసమో కావచ్చు. అంతిమంగా మాయమవుతున్నది ముస్లింల మత స్వేచ్ఛే.
పోలీసులు కోర్టు విధులను లాగేసుకోవడానికి వీల్లేదు. పాస్ పోర్టులు రద్దు చేసే అధికారం పోలీసులకు లేదు. ముస్లింలు ఊపిరి పీల్చుకోవాలన్నా ప్రభుత్వం అనుమతి తీసుకోవలసిన పాడు రోజులు దాపురించాయి. ఇది హిందూత్వను అమలు చేయడంలో ఆఖరి మెట్టుగా కనిపిస్తోంది. అందుకే ముస్లింలను నేరస్థులుగా చిత్రీకరించే ప్రయత్నం సాగుతోంది. పోలీసులు ముస్లింలను బెదిరించే అవకాశం ఎక్కడి నుంచి వచ్చింది. యోగీ ఆదిత్యనాథ్ లాంటి వారు అనుసరిస్తున్న ముస్లిం వ్యతిరేక ధోరణీ పోలీసులకు కూడా వంటపడితే తప్ప ఇలాంటి పనులు చేయడానికి పోలీసులు సాహసించరు. నేరం ఏమిటో ఏ నేరానికి ఎంత శిక్ష విధించాలో నిర్ణయించే అధికారం కోర్టులకు మాత్రమే ఉంటుంది. కోర్టుల అధికారాలు లాగేయడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీక్ష పూనినట్టు ఉంది. రోడ్ల మీద నమాజు చేస్తే కనీసం అంబులెన్స్ కూడా వెళ్లడానికి వీలుండదన్న అసత్యాలు ప్రచారంలో పెడ్తున్నారు. కానీ చాలా మంది హిందువులు ఈ వితండవాదాన్ని అంగీకరి స్తున్నారు. ప్రతిఘటించడానికి ఏ ప్రయత్నమూ చేయడం లేదు. రోడ్ల మీద అంతరాయం ఉండకూడదంటే ఏ మతం వారికి ఆ అవకాశం ఇవ్వకూడదు. శోభా యాత్రలు నిర్వహించినప్పుడు మసీదుల ఎదుట కావాలని బిగ్గరగా డీజేలు వినియోగించడం, ముస్లింలను అవమాన పరిచే నినాదాలు చేయడం, పాటలు పాడడం మత సామరస్యానికి భంగం కలిగించడంతో ఆగదు. అది ముస్లింల హక్కులను లాగేసే కుట్రలో భాగమే. హిందువుల పండగలప్పుడు, ముఖ్యంగా దుర్గా పూజ, శ్రీరామ నవమి, గణేష్ చతుర్థి, రథ యాత్ర, కావడి యాత్ర సందర్భంలో గుర్తుకు రాని ఆంక్షలు ముస్లిం పండగలప్పుడే ఎందుకు గుర్తొస్తాయో! దిల్లీలో ప్రతి మంగళవారం భక్తులు హనుమాన్ దేవాలయాలను సందర్శించడం పరిపాటి. హనుమాన్ దేవాలయాలన్ని రోడ్ల పక్కనే ఉన్నాయిగా! అక్కడ జనసందోహం ఉంటుందిగా! రోడ్ల పక్కనే అన్నదానాలు చేస్తున్నారుగా! ఇలాంటప్పుడు పోలీసులు నోరు మెదపరు. హిందువుల పండగలప్పుడు రోడ్ల మీద ఏదో ఒక సందడి ఉండనే ఉంటుంది. రోడ్ల మీద ముస్లింలకు ఏ హక్కూ ఉండదనుకోవాలేమో. బహిరంగ స్థలాలో ముస్లింల ఆనవాళ్లు కనిపించకూడదేమో! కొన్ని సంవత్సరాల కింద గుర్గాంలో నమాజు చేసుకుంటున్న ముస్లింల మీద హిందుత్వ ముఠాలు దాడి చేసినప్పుడు పోలీసులు దాడి చేస్తున్న వారివేపే నిలబడ్డారు. అక్కడి నుంచి ముస్లింలను తరిమేశారు. హర్యానా ముఖ్యమంత్రి కూడా ముస్లింలు రోడ్ల మీద నమాజు చేయడాన్ని వ్యతిరేకించారు. ఇస్లాం సామూహిక ఆరాధనా విధానాన్ని అనుసరిస్తుంది. నమాజు చేయడానికి నిర్దిష్ట సమయం ఉంటుంది. విశేషమైన రోజుల్లో మసీదులు కిక్కిరిసి ఉన్నప్పుడే ముస్లింలు విధి లేక రోడ్ల మీద నమాజు చేయవలసి వస్తుంది. రోడ్ల మీద నమాజు చేయడం ఆ ప్రాంతాన్ని ఆక్రమించడానికే అని కూడా హర్యానా ముఖ్యమంత్రి అన్నారంటే ఆయనలో గూడుకట్టుకున్న ముస్లిం వ్యతిరేకత ఎంత తీవ్రమైందో ఊహించుకోవచ్చు.