. సీసీఐ కొనుగోళ్లతో మార్కెట్లో ఊపిరి
. రాష్ట్రంలో 71 వేల మందికి మద్దతు ధర
. సీఎం జోక్యంతో నిబంధనల సడలింపు
విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: మొంథా తుపాను రాకముందే మొదలైన వాతావరణ వైపరీత్యాలు ఈ ఏడాది రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని కుదిపేశాయి. ముఖ్యంగా పత్తి సాగు ప్రాంతాల్లో అకాల వర్షాలు, గాలులు, అధిక తేమతో పంట దిగుబడి`నాణ్యత దెబ్బతిన్నాయి. పంట చేతికి వచ్చిన వేళ మార్కెట్లో ధరలు కుప్పకూలుతాయన్న భయం రైతులను ఆందోళనకు గురిచేసింది. ఈ సంక్షోభ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పత్తి రైతుకు అండగా నిలిచింది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వారా మద్దతు ధర కల్పనకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. సీజన్ ఆరంభంలో సీసీఐ తేమ శాతం, నాణ్యత ప్రమాణాలు, సాంకేతిక నిబంధనల పేరుతో కొనుగోళ్ల విషయంలో వెనుకడుగు వేసింది. దీంతో రైతులు తమ పంటను ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిరది. కొన్ని ప్రాంతాల్లో క్వింటా పత్తి ధర రూ.4 వేల నుంచి రూ.5,500 వరకు ఉంది. ఈ పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా పరిగణించారు. జిల్లాల నివేదికలను పరిశీలించి, రైతుల సమస్యలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. అసాధారణ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో నిబంధనల్లో సడలింపులు ఇవ్వాలని, సీసీఐ కొనుగోళ్లు వేగవంతం చేయాలన్న సీఎం విజ్ఞప్తికి కేంద్రం స్పందించింది. దీంతో సీసీఐ కొనుగోళ్లను విస్తృతంగా ప్రారంభించింది. ఈనెల మొదటి వారం వరకూ గుంటూరు జిల్లాలో 3,314 మంది రైతుల నుంచి 22,793 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసింది. కర్నూలు జిల్లాలో 20,992 మంది నుంచి 6,54,933 క్వింటాళ్లు సేకరించింది. విజయనగరం జిల్లాలో 433 మంది రైతుల నుంచి 6,730 క్వింటాళ్లు, మన్యం జిల్లాలో 682 మంది నుంచి 10,306 క్వింటాళ్లు, ఎన్టీఆర్ జిల్లాలో 5,295 మంది నుంచి 3,67,661 క్వింటాళ్లు, పల్నాడు జిల్లాలో 3,979 మంది నుంచి 2,70,994 క్వింటాళ్లు, నంద్యాల జిల్లాలో 922 మంది నుంచి 70,084 క్వింటాళ్లు చొప్పున పత్తిని కొనుగోలు చేసింది. పత్తి సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉన్న అనంతపురం జిల్లాలో రికార్డు స్థాయి కొనుగోళ్లు జరిగాయి. 36,093 మంది రైతుల నుంచి 16,16,688 క్వింటాళ్ల పత్తిని సీసీఐ సేకరించింది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 71,710 మంది రైతులకు సీసీఐ ప్రకటించిన మద్దతు ధర లభించింది. సుమారు 3 కోట్ల 22 లక్షల క్వింటాళ్ల పత్తిని సీసీఐ కొనుగోలు చేసింది. కేంద్రాల్లో మొదటిశ్రేణి నాణ్యత పత్తికి క్వింటాల్‌కు రూ.8,110, దిగువశ్రేణి నాణ్యత పత్తికి రూ.7,710 వరకు ధర చెల్లించారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పత్తి కొనుగోళ్లు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా విపత్తుల సమయంలో నిబంధనల్లో సడలింపులు ఇచ్చి కొనుగోళ్లు చేయడం రైతులకు ఊరటనిచ్చింది. కేంద్రంతో సమన్వయం, రాష్ట్ర స్థాయిలో నిర్ణయాలే ఈ ఫలితాలకు కారణమని అధికారులు చెప్పారు. సీసీఐ మద్దతు ధరకు సమానంగా చెల్లించేందుకు ప్రైవేట్ వ్యాపారులు ముందుకు రావడంతో పత్తి కొనుగోళ్లు జోరందుకున్నాయి.


