. 20 మంది సైనికుల కాల్చివేత… బందీగా 200 మంది?
. సైన్యం వస్తే అందరినీ చంపేస్తాం : బలూచ్ లిబరేషన్ ఆర్మీ
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో వేర్పాటువాదులు రెచ్చిపోయారు. ఎక్స్‌ప్రెస్ రైలును హైజాక్ చేశారు. 20 మంది సైనికులను చంపేశారు. దాదాపు 200 మంది ప్రయాణికులను బందీలుగా చేసుకున్నారు. భద్రతా దళాలు వెంటనే అక్కడ నుంచి వెళ్లకపోతే బందీలందరినీ చంపేస్తామంటూ హెచ్చరించారు. బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని క్వెట్టా నుంచి ఖైబర్ ఫక్తుంఖ్వా ప్రావిన్స్‌లోని పెషావర్‌కు వెళుతున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ హైజాక్ కావడం సంచలనంగా మారింది. 500 మంది ప్రయాణికులతో వెళుతున్న రైలును సాయుధులు ఓ సొరంగం వద్ద ఆపేశారు. ఈ ఘటనలో డ్రైవర్ తీవ్రంగా గాయపడినట్లు స్థానిక అధికారులు, పోలీసులు, రైల్వే అధికారులు తెలిపారు. జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేసినట్లు బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) స్వయంగా ప్రకటించింది. ‘జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును హైజాక్ చేశాం. 20 మంది సైనికులను చంపేశాం. ఓ డ్రోన్‌ను కూల్చివేశాం. ఆర్మీ, ఇతర భద్రతా సిబ్బంది సహా మొత్తం 182 మంది మా వద్ద బందీలుగా ఉన్నారు. సైన్యం జోక్యం చేసుకుంటే బందీలందరినీ చంపేస్తాం’ అని బీఎల్ఏ హెచ్చరించింది. కాగా, సొరంగం వద్ద పేలుళ్లు, కాల్పుల శబ్దాలు వినిపించినట్లు భద్రతా సిబ్బంది తెలిపారు. మార్గమధ్యంలో పట్టాలు పేల్చివేసి సొరంగం వద్ద రైలును బీఎల్ఏ సభ్యులు హైజాక్ చేశారన్నారు. బీఎల్ఏ ప్రకటించినట్లు 20 మంది సైనికుల మరణాన్ని అధికారులు ధ్రువీకరించలేదు. తాజా పరిణామంతో బలూచిస్థాన్ ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది. ఘటనా స్థలానికి భద్రతా దళాలు, అంబులెన్సులు పంపింది. సిబీ ఆసుపత్రి వద్ద ఎమర్జెన్సీ విధించింది. చివరి ఉగ్రవాదిని మట్టుపెట్టేంత వరకు తమ ఆపరేషన్ కొనసాగుతుందని భద్రతా దళానికి చెందిన అధికారి ఒకరు చెప్పారు. ఈ రైలుకు తొమ్మిది బోగీలు ఉన్నాయని, వాటిలో 500 మంది ప్రయాణికులు ఉన్నట్టు రైల్వేస్ కంట్రోలర్ మహమ్మద్ ఖాషిఫ్ తెలిపారు. హైజాక్ జరిగిన మార్గంలో మొత్తం 17 సొరంగాలు ఉండగా, ఎనిమిదో సొరంగం వద్ద రైలుపై దాడి జరిగినట్లు వెల్లడిరచారు. వేర్పాటువాద సంస్థలన్నింటిలో బీఎల్ఏ పెద్దది. దశాబ్దాలుగా పాక్ ప్రభుత్వంతో పోరాడుతోంది. బలూచిస్థాన్ ఖనిజ సంపదను దోచేస్తున్నారంటూ ఆరోపిస్తోంది. ప్రత్యేక బలూచిస్థాన్ కోసం డిమాండ్ చేస్తోంది.
అమాయకులను చంపేవారిని వదలం: మంత్రి మోసిన్ నఖ్వీ
ఈ దాడిని పాకిస్థాన్ అంతర్గత మంత్రి మోసిన్ నఖ్వీ తీవ్రంగా ఖండిరచారు. అమాయక ప్రయాణికులపై కాల్పులకు తెగబడిన మృగాళ్లకు ప్రభుత్వం ఎలాంటి మినహాయింపు ఇవ్వబోదని ఆయనన్నారు. ఈ సమస్యను పరిష్కరించడం కోసం బలూచిస్థాన్ ప్రభుత్వం అత్యవసర చర్యలను చేపట్టినట్లు అధికార ప్రతినిధి షాహిద్ రిండ్ తెలిపారు. క్వెట్టాలోని సివిల్ హాస్పిటల్ వద్ద ఎమెర్జెన్సీ ప్రకటించినట్లు ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి డాక్టర్ వసీం బేగ్ అన్నారు.
కన్సలెంట్లు, వైద్యులు, స్టాఫ్ నర్సులు, పారామెడిక్‌లు, ఫార్మాసిస్టులు అందరినీ ఆసుపత్రిలో అందుబాటులో ఉంచినట్లు వెల్లడిరచారు. సింధ్ హోంమంత్రి జియావుల్ హసన్ కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. హేయమైన నేరాలను ఉపేక్షించరాదని, సంఘ విద్రహశక్తులు, దేశ ద్రోహులను కట్టడి చేయాలని అన్నారు. బలూచిస్థాన్‌కు సంఫీుభావం తెలిపారు. మాజీ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ‘ఎక్స్’లో స్పందిస్తూ ఇది పిరికిపంద చర్య అని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే సాయుధ దళాలు పూర్తిస్థాయిలో దృష్టిని కేంద్రీకరించాలి, ప్రజలు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.