Tuesday, April 22, 2025
Homeపార్లమెంటే సుప్రీం

పార్లమెంటే సుప్రీం

. దీనికి అతీతంగా ఏదీ లేదు
. మరోసారి ధన్కర్‌ ప్రేలాపన

న్యూదిల్లీ : దేశ సర్వోన్నత న్యాయస్థానంపై కాషాయ మూకలు దాడులు చేస్తున్నాయంటూ ఇండియా కూటమి పక్షాలు ధ్వజమెత్తుతున్న వేళ ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్కర్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్‌ సవరణ చట్టంపై విచారణ… రాష్ట్ర కేబినెట్‌లు సిఫార్సు చేసిన బిల్లుల విషయంలో ఇటీవల సుప్రీం కోర్టు వెలువరించిన ఆదేశాల నేపథ్యంలో ఉపరాష్ట్రపతి ధన్కర్‌తో పాటు బీజేపీ ఎంపీలు న్యాయవ్యవస్థ అధికారాలను ప్రశ్నిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేయడం… దీనిని ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిరచిన సంగతి తెలిసిందే. తాజాగా ధన్కర్‌ మరోసారి న్యాయవ్యవస్థ తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేయడం…మళ్లీ దేశ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మంగళవారం ఆయన దిల్లీ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఇటీవల సుప్రీంకోర్టుపై తాను చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నిస్తూ విమర్శలు చేసిన వారిపై ఆయన మండిపడ్డారు. రాజ్యాంగ అధికారిగా తాను మాట్లాడే ప్రతి మాట అత్యున్నత జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటుందన్నారు. దేశంలో పార్లమెంటు ప్రజాస్వామ్యం అత్యున్నతమైనదని, దానిని మించిన అధికార వ్యవస్థ మరోటి లేదని అన్నారు.పార్లమెంటు అత్యున్నత స్థానం కలిగిన సంస్థ అని. ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులే రాజ్యాంగ రూపురేఖలను నిర్ణయించే హక్కును కలిగి ఉంటారని తెలిపారు. రాజ్యాంగంపై వారికే తుది హక్కు ఉంటుందన్నారు. ఎవ్వరూ దానికంటే పై స్థాయిలో ఉండలేరని ధన్కర్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజ్యాంగం ఎలా ఉండాలో, అందులో ఎలాంటి సవరణలు చేయాలో నిర్ణయించుకునే పూర్తి హక్కు ఎంపీలకు ఉందన్నారు. దీని కంటే పైన ఎవరూ లేరన్నారు. ‘ఎన్నికైన ప్రజాప్రతినిధులు జవాబుదారీతనంగా ఉండాలి. ఎమర్జెన్సీ విధించిన ప్రధాని అయినా సరే. ప్రజలకు రక్షణ కల్పించేం దుకే ప్రజాస్వామ్యం. రాజ్యాంగపరమైన అంశాల్లో ప్రజాప్రతినిధులే అల్టిమేట్‌ మాస్టర్స్‌. పార్లమెంట్‌ కంటే అత్యుత్తమమైనది ఉందని రాజ్యంగంలో ఎక్కడా లేదు. పార్లమెంటే సుప్రీం’ అని ధన్కర్‌ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ సమయం గురించి కూడా ప్రస్తావించారు. ‘‘ఎన్నికైన ప్రజా ప్రతినిధులు అన్నింటికీ జవాబుదారీగా ఉంటారు. అత్యవసర పరిస్థితిని విధించిన ప్రధానమంత్రి(ఇందిరా గాంధీ)ని కూడా జవాబుదారీగా ఉంచారు. ప్రజాస్వామ్యం అనేది ప్రజల కోసం మాత్రమే. అది ఎన్నికైన ప్రతినిధులకు రక్షణ కల్పించే ఓ భాండాగారం.’’ అన్నారు.
రాష్ట్ర గవర్నర్‌ పంపిన బిల్లులకు రాష్ట్రపతి నిర్ణీత గడువులోపు సమ్మతి తెలపాలని సుప్రీంకోర్టు గడువు నిర్ణయిస్తూ ఇటీవల తీర్పునిచ్చింది. దీనిపై ధన్కర్‌ మాట్లాడుతూ… ‘‘రాష్ట్రపతికి గడువు నిర్దేశించేలా న్యాయవ్యవస్థ వ్యవహరించడం తగదు. ప్రజాస్వామ్యశక్తులపై అణుక్షిపణిని సుప్రీంకోర్టు ప్రయోగించరాదు. ఇప్పుడు.. శాసనాలు చేయగలిగే జడ్జీలు మనకు ఉన్నారు! కార్యనిర్వాహక విధులూ వారే నిర్వర్తించేస్తారు. సూపర్‌ పార్లమెంటులా వ్యవహరిస్తారు. వారికి మాత్రం ఎలాంటి జవాబుదారీతనం ఉండదు. ఎందుకంటే దేశ చట్టాలు వారికి వర్తించవు’’ అన్నారు. ఇదే అంశంపై బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబే చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ‘‘ఒకవేళ సుప్రీంకోర్టు చట్టాలు చేస్తే గనుక.. పార్లమెంట్‌ భవనాన్ని మూసివేయాలి’’ అని ఎంపీ వ్యాఖ్యానించారు. అయితే బీజేపీ నేతల వ్యాఖ్యలను ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి.
పూర్తి న్యాయం చేయాల్సిన బాధ్యత సుప్రీంకోర్టుదే: సిబల్‌
ధన్కర్‌ వ్యాఖ్యలపై రాజ్యసభ ఎంపీ, సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. ‘‘చట్టాలను ఆమోదించడానికి పార్లమెంటుకు ప్లీనరీ అధికారం ఉంది. రాజ్యాంగాన్ని అర్థం చేసుకుని పూర్తి న్యాయం చేయాల్సిన బాధ్యత సుప్రీంకోర్టుకు ఉంది (ఆర్టికల్‌ 142)’’ అని స్పష్టం చేశారు. ‘‘కోర్టు చెప్పినదంతా మన రాజ్యాంగ విలువలకు అనుగుణంగా ఉంటుంది. జాతీయ ప్రయోజనాల ద్వారా మార్గనిర్దేశం చేయబడుతుంది’’ అని సిబల్‌ అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు