ఈశ్వరయ్య
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: మోదీ ప్రభుత్వం పదే పదే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజలపై గుదిబండ మోపడం దుర్మార్గమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య సోమవారం ఓ ప్రకటనలో తీవ్రంగా మండిపడ్డారు. నరేంద్రమోదీ ప్రభుత్వం 10 రోజుల్లోనే పెట్రోల్, డీజిల్ ధరలను నాలుగుసార్లు… మొత్తం రూ.8లకుపైగా పెంచిందని, ప్రజలపై ధరల భారం మోపడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. నేడు నాలుగో దఫా పెట్రోల్‌పై రూ.2.84, డీజిల్‌పై రూ.2.86 పెంచటం దారుణమని పేర్కొన్నారు. విపరీతంగా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలతో రవాణా ఖర్చులు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి జనజీవనం అస్తవ్యస్తమవుతుందన్నారు. పెట్రో ధరలు పెంచాలనే కుట్రతోనే ఖర్చులు తగ్గించుకోవాలంటూ ప్రధాని మోదీ ప్రకటనలు గుప్పించారని, 2014లో ఇప్పటికంటే అంతర్జాతీయంగా ముడిచమురు ధర బ్యారెల్‌కు 109 డాలర్లు ఉండగా, పెట్రోల్ లీటర్ ధర రూ.57గా ఉండేదన్నారు. 2026లో బ్యారెల్ ముడిచమురు ధర 106 డాలర్లుగా ఉన్నప్పటికీ పెట్రోల్ ధర లీటర్‌కు 117 రూపాయలకు పైగా చేరిందన్నారు. 2020 కరోనా కాలంలో బ్యారెల్ ముడిచమురు ధర అమాంతం రూ.37.63కి పడిపోయిందని, నాడు మోదీ ప్రభుత్వం పెట్రో ధరలు ఏమాత్రం తగ్గించలేదన్నారు. డాలర్‌తో రూపాయి విలువ దిగజారిందని, 2014లో రూపాయి విలువ రూ.60గా ఉండగా… నేడు రూ.96.80 పైసలకు చేరిందని గుర్తుచేశారు. రూపాయి విలువ బలహీన పడటానికి మోదీ ప్రభుత్వ అనాలోచిత ఆర్థిక విధానాలే కారణమని విమర్శించారు. 2014 నుంచి పెట్రోధరలు పెంచి రూ.30 లక్షల కోట్లు ఆర్జించినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయని, ఆ రూ.30 లక్షల కోట్లు ఎటుపోయాయో మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా పెంచిన పెట్రో ఉత్పత్తుల ధరలు తక్షణమే ఉపసంహరించుకోవాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తున్న అదనపు సుంకాలు తగ్గించుకోవడం ద్వారా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
పెట్రో ధరల పెంపు దుర్మార్గం
- Advertisement -
RELATED ARTICLES


