. ఎన్నికల సంస్కరణలతోనే దేశ భవిష్యత్
. ప్రమాదంలో పత్రికాస్వేచ్ఛ
. బిల్లులపై సుప్రీం తీర్పును స్వాగతించాల్సిందే
. ఏఐవైఎఫ్ జాతీయ మహాసభల్లో జస్టిస్ జాస్తి చలమేశ్వర్
ఎన్నికల నిర్వహణ ఖర్చులో మార్పు రావాలి. ఎన్నికల సంస్కరణలు జరగకపోతే… దేశానికి ప్రజాస్వామిక భవిష్యత్ ఉండదు. ఎన్నికలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి యువత ముందుకు రావాలి. దేశాభివృద్ధిలో కీలకపాత్ర యువత చేతిలోనే ఉంది.
` జాస్తి చలమేశ్వర్
సుప్రీం కోర్టు
మాజీ న్యాయమూర్తి
విశాలాంధ్ర బ్యూరో – తిరుపతి : తీవ్ర సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత నేటి యువతదేనని సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ పిలుపునిచ్చారు. ఏఐవైఎఫ్ 17వ జాతీయ మహాసభల సందర్భంగా తిరుపతిలోని కనం రాజేంద్రన్ హాలు(కచ్చపి ఆడిటోరియం)లో ప్రతినిధుల సభను ఆయన శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. సభకు ఏఐవైఎఫ్ నేతలు సుఖ్‌జిందర్ మహేసరి, వలీ ఉల్లాఖాద్రి, అరుణ్, లెనిన్, ఆర్తి అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. ముందుగా ఇటీవల కాలంలో మృతి చెందిన ఏఐవైఎఫ్ నాయకులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు సంతాపసూచకంగా మహాసభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. మహాసభల ఆహ్వానసంఘం అధ్యక్షుడు, సీపీఐ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ అధ్యక్ష ఉపన్యాసం చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ చలమేశ్వర్ ఎన్నికల సంస్కరణలు, రాజ్యాంగం, పార్లమెంటరీ వ్యవస్థ, ప్రజాస్వామ్యం తదితర అంశాలపై సుదీర్ఘ ప్రసంగం చేశారు. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ… నేటికీ దేశంలో పేదరికం, ఆకలి, వివక్ష కనిపిస్తున్నదని జస్టిస్ చలమేశ్వర్ ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నికల్లో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న పాలకులకు దేశాభివృద్ధిలో ఇసుమంత పాత్ర కూడా ఉండటం లేదన్నారు. ఒక్కొక్క పార్లమెంట్ సభ్యుడు సగటున ఎన్నికల్లో రూ.50 నుండి రూ.100 కోట్లు ఖర్చు పెడుతున్నారని, గెలిచిన తర్వాత వారు ప్రజలకు ఏ మేరకు సేవ చేస్తారో ఆలోచించుకోవాలని సూచించారు. ఎన్నికల నిర్వహణ ఖర్చులో కూడా మార్పు రావాలని ఆయన అన్నారు. ఎన్నికల సంస్కరణలు జరగకపోతే… దేశానికి ప్రజాస్వామిక భవిష్యత్ ఉండబోదని హెచ్చరించారు. ఎన్నికలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి యువత ముందుకు రావాలని జస్టిస్ చలమేశ్వర్ పిలుపునిచ్చారు. దేశాభివృద్ధిలో కీలకపాత్ర యువత చేతిలోనే ఉందని, ఆ వైపుగా యువత ముందడుగు వేయాలని విజ్ఞప్తి చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో ఇప్పటికీ 132 సవరణలు చేశారని గుర్తు చేశారు. నిజంగా అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అంత గొప్పదని చెబుతున్న పాలకులే… అన్ని సవరణలు చేయవలసిన అగత్యం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. పత్రికా స్వేచ్ఛకు సంబంధించి రాజ్యాంగంలో ప్రత్యేకంగా చట్టం లేనప్పటికీ 19-(1ఏ)లో భావ ప్రకటనా స్వేచ్ఛను పొందుపరిచారని, దానినే పత్రికా స్వేచ్ఛగా భావించాలని సూచించారు. కానీ మీడియాకు ఈ దేశంలో ఏ మేరకు స్వేచ్ఛ లభిస్తున్నదో గుర్తించాలన్నారు. సమాఖ్యస్ఫూర్తిని కాపాడేలా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కాదని… రాష్ట్రపతి న్యాయవ్యవస్థపై ప్రశ్నలు సంధించడంపై చర్చ జరుగుతోందన్నారు. వాస్తవానికి తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన 10 బిల్లులకు సమ్మతి తెలపకుండా ఆ రాష్ట్ర గవర్నర్ వ్యవహరించిన రాజ్యాంగ వ్యతిరేక వైఖరికి అడ్డుకట్ట వేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు స్వాగతించదగిందన్నారు. భారత రాజ్యాంగాన్ని, సమాఖ్య స్వభావాన్ని, రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను కాపాడే విషయంలో సుప్రీం తీర్పు ఆదర్శవంతమైందేనన్నారు. ఇలాంటి తీర్పుల పట్ల సానుకూలంగా వ్యవహరించి రాజ్యాంగబద్ధంగా అమలు చేయడానికి బదులు… రాష్ట్రపతి ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వివాదాలు సృష్టించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరమన్నారు. దేశంలో ప్రజాస్వామ్యమనే పదమే అదృశ్యమయ్యే పరిస్థితులు నెలకొంటున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. ఈ పరిస్థితుల్లో సంపూర్ణ అవగాహనతో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యతను యువత తమ భుజస్కందాలపైకి ఎత్తుకోవాల్సిన అవసరం ఉందని జస్టిస్ చలమేశ్వర్ పిలుపునిచ్చారు.