డా. కె.నారాయణ
రాజకీయ వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే ప్రధాని మోదీ అంతిమ లక్ష్యంగా కనిపిస్తోంది. జీవ రాశులన్నింటిలో మానవ జన్మ ఎంత విశిష్టమో, ప్రజా స్వామ్యంలో రాజకీయ వ్యవస్థ కూడా అంతే కీలక మైనది, పవిత్రమైనది. రాజకీయ వ్యవస్థ లేకుండా ప్రజాస్వామ్యానికి మనుగడే లేదు. ఐతే ప్రస్తుత పరిణామాలను గమనిస్తే స్థిరంగా ఉన్న రాజకీయ వ్యవస్థను అస్థిరపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయనే భావన కలుగుతోంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎన్నికల వ్యవస్థ పునాది కాగా, దానికి న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థలు అండగా నిలవాల్సిన అవసరం ఉంది. అయితే ఆ వ్యవస్థలు ప్రస్తుత పరిస్థితుల్లో తమ బాధ్యతలను స్వతంత్రంగా, సమరœ వంతంగా నిర్వర్తిస్తున్నాయా అనే ప్రశ్న తలెత్తుతోంది. అలాంటి అనుమానాలకు ఆధారంగా నిలిచే సంఘటనలు అనేకం ఉన్నాయి. తాజాగా కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ రాజ్యసభకు వెళ్లకుండా జరిగిన పరిణామాలు ఒక ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఎన్నికైన ప్రజాప్రతినిధులను వారి పార్టీల నుంచి ఫిరాయింపులకు ప్రోత్సహించడం నేటి రాజకీయాల్లో సాధారణంగా మారింది. ఎన్నికైన ప్రతినిధులను పార్టీలు మారేలా చేసి, ఆ తర్వాత వాటికి చట్టబద్ధత కల్పించి రాజకీయ పార్టీల ఉనికినే దెబ్బతీసే ప్రక్రియ కొనసాగుతోంది. ఇది “మోదీ-షా” రాజకీయాలకు ఒక సాధనంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ధోరణి కొనసాగితే, ప్రజాస్వామ్య పద్ధతిలో అధికారాన్ని ప్రశ్నించే వ్యక్తులు, రాజకీయ పార్టీలు, సామాజిక శక్తులు ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందో స్పష్టమవుతోంది. ఇదే క్రమం కొనసాగితే భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇది ఒక అగ్నిపరీక్షగా మారుతుంది. చివరికి ఇది పురాణాల్లోని భస్మాసురుడి కథలా, తనను తాను నాశనం చేసుకునే పరిస్థితికి దారితీయవచ్చు. ఇలాంటి ప్రక్రియలో బీజేపీ కూడా శాశ్వతంగా మినహాయింపు పొందలేదు. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల మనోభావాలకు, ప్రజాస్వామ్య ఆకాంక్షలకు అతీతంగా ఉండదు, ఉండలేదు. బీజేపీ నాయకత్వం ఈ వాస్తవాన్ని గుర్తించినా, మోదీ-షా ద్వయం అలాంటి ఆత్మపరిశీలనకు సిద్ధపడతారా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. “పార్టీ రహిత ప్రజాస్వామ్యం” అనే బూటకపు నినాదంతో వ్యక్తులను వ్యవస్థల కంటే పై స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నాలు జరిగితే, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే రాజకీయ వ్యవస్థనే బలహీనపరిచే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితి ఏర్పడితే, చివరికి బీజేపీ కూడా అదే ప్రక్రియకు బలికాక తప్పదు. అంతిమంగా, ఇది రాజకీయ భస్మాసుర హస్తంగా మారి ప్రజాస్వామ్యాన్నే కాదు, దానిని బలహీనపరిచే శక్తులనూ మింగేయదా అనే ప్రశ్న ప్రతి ప్రజాస్వామ్యవాదిని ఆలోచింపజేస్తోంది. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు


