Friday, May 16, 2025
Homeప్రపంచం దృష్టికి పాక్‌ ‘ఉగ్ర’ కుట్రలు

ప్రపంచం దృష్టికి పాక్‌ ‘ఉగ్ర’ కుట్రలు

అఖిలపక్ష ఎంపీలతో విదేశాలకు ప్రతినిధి బృందాలు
కేంద్రం సంప్రదింపులు

న్యూదిల్లీ: పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్‌… పాకిస్థాన్‌పై కఠినంగా వ్యవహరిస్తోంది. ఓవైపు దౌత్య చర్యలు తీసుకుంటూనే మరోవైపు ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేసేందుకు కృషి చేస్తోంది. అలాగే ఆపరేషన్‌ సిందూర్‌, ఉగ్రవాదులకు పాక్‌ ప్రత్యక్షంగా చేస్తున్న సాయం గురించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వివిధ దేశాల రాయబారులు, విదేశాంగ మంత్రులకు ప్రత్యేకంగా వివరణ ఇచ్చింది. తాజాగా ప్రపంచ దేశాలకు ఈ విషయాలను వివరించాలని ఏర్పాట్లు చేస్తోంది. అందుకోసం వివిధ రాజకీయ పార్టీల ఎంపీలతో బృందాలను ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రతి ప్రతినిధి బృందంలో 5-6 మంది ఎంపీలు, ఒక విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి, ప్రభుత్వ ప్రతినిధి ఉంటారు. మొత్తం ఎనిమిది బృందాలు 10 రోజుల వ్యవధిలో ఐదు దేశాలకు వెళ్తాయి. ఈ బృందాలకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ నేతృత్వం వహించే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. వీరు మే 22న భారతదేశం నుంచి వివిధ దేశాలకు బయలుదేరి జూన్‌ మొదటివారంలో తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్థాన్‌ ఏవిధంగా మద్దతు పలుకుతోందనే విషయాన్ని… ఆపరేషన్‌ సిందూర్‌ ద్వారా ఉగ్రవాదంపై భారత్‌ జరిపిన పోరాటాన్ని తగిన ఆధారాలతో విదేశాలకు వివరించనున్నట్లు తెలిసింది. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలతో చర్చలు జరుపుతోందని, త్వరలో ఈ బృందాలను ఏర్పాటుచేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిరచాయి. సరిహద్దు ఉగ్రవాదం అంశంపై దేశ ఐక్యతను ప్రదర్శించడానికి చేసే ఒక సమష్టి ప్రయత్నంగా దీనిని అభివర్ణించాయి. గతంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు.. అటల్‌ బిహారీ వాజ్‌పేయీని ఎన్‌హెచ్‌ఆర్‌సీకి పంపడం వంటి విషయాలను ఆదర్శంగా తీసుకొని ఈ చర్యలకు సమాయత్తమవుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈ బృందాలు విదేశీ ప్రభుత్వాలు, రక్షణ అధికారులు, మీడియా సంస్థలతో చర్చలు జరపనున్నట్లు తెలిపారు. ఇక ప్రతినిధి బృందాల్లో బీజేపీ, కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, టీఎంసీ, డీఎంకే, ఎన్‌సీపీ (ఎస్పీ), జేడీయూ, బీజేడీ తదితర పార్టీలకు చెందిన 30పైగా ఎంపీలు ఉండనున్నారు. ఎంపీలు శశిథరూర్‌, మనీశ్‌ తివారీ, సల్మాన్‌ ఖుర్షీద్‌, అమర్‌సింగ్‌ (కాంగ్రెస్‌), సుదీప్‌ బందోపాధ్యాయ్‌ (టీఎంసీ), సంజయ్‌ రaా (జేడీయూ), సస్మిత్‌ పాత్రా (బీజేడీ), సుప్రియా సూలే(ఎన్‌సీపీఎస్‌పీ), కె.కనిమొళి (డీఎంకే), జాన్‌ బ్రిట్టాస్‌ (సీపీఎం), అసదుద్దీన్‌ ఒవైసీ (ఏఐఎంఐఎం) ఈ బృందాల్లో భాగం కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై కేంద్రం అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయనప్పటికీ... ఈ విషయమై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గేతో కేంద్ర మంత్రి కిరెన్‌ రిజిజు మాట్లాడినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్‌ రమేశ్‌ వెల్లడిరచారు. 1994లో భారత్‌- పాకిస్థాన్‌ తీవ్ర ఉద్రిక్తతలను ఎదుర్కొన్న సమయంలో జమ్మూకశ్మీర్‌లో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించి పాకిస్థాన్‌… ఐరాస మానవ హక్కుల కమిషన్‌ లో ఒక తీర్మానం సమర్పించడానికి సిద్ధమవగా… అప్పటి భారత ప్రధాని పీవీ నరసింహారావు పాక్‌పై దౌత్య వ్యూహాన్ని అమలుచేశారు.
ఇరుదేశాల మధ్య పరిస్థితులను అక్కడి అధికారులకు వివరించడానికి ఐరాస వద్దకు భారత్‌ నుంచి బహుళ పార్టీల ప్రతినిధుల బృందాన్ని పంపారు. దీనికి దివంగత బీజేపీ నేత అటల్‌ బిహారీ వాజ్‌పేయి నాయకత్వం వహించగా… అప్పటి విదేశాంగ సహాయ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌, ఫరూక్‌ అబ్దుల్లా ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఆ సమయంలో అమెరికాలో భారత రాయబారిగా ఉన్న హమీద్‌ అన్సారీ కూడా కీలక పాత్ర పోషించారు. వీరంతా ఐరాసలో పాకిస్థాన్‌ చేసిన ఆరోపణల్ని సమర్థంగా తిప్పికొట్టారు. దీంతో పాక్‌ తన తీర్మానాన్ని వెనక్కు తీసుకుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు