విశాలాంధ్ర-హిందూపురం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రైవేటు రంగానికి పెద్దపీట వేస్తోందని, ప్రభుత్వ రంగాలకు చరమగీతం పాడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. సత్యసాయి జిల్లా లేపాక్షి మండల కేంద్రంలో రామకృష్ణ మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై రామకృష్ణ విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆశయానికి అనుగుణంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాలన సాగిస్తూ… ప్రైవేట్ రంగాలకు పెద్దపీట వేస్తున్నారని విమర్శించారు. విద్య, వైద్య, పారిశ్రామిక రంగాలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారన్నారు. కొన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేటుపరం కాగా… ప్రభుత్వ యూనివర్సిటీలో సిబ్బందిని కుదించడం, చివరికి వైస్‌చాన్సలర్లను నియమించకుండా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడానికి సిద్ధమవుతున్నార న్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు తెలుగు ప్రజల ఆత్మ గౌరవంగా పిలువబడే పరిశ్రమను కూడా ప్రైవేటీకరణకు కేంద్రం ప్రయత్నిస్తుంటే… చంద్రబాబు అడ్డుకోలేకపోతున్నారని విమర్శించారు. పోరాటాల ఫలితంగా ఏర్పాటైన విశాఖ ఉక్కు పరిశ్రమ వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నదన్నారు. అలాంటి పరిశ్రమను ప్రైవేట్‌పరం చేయడానికి 3000 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించారని, శాశ్వత ఉద్యోగులను కూడా తొలగించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారన్నారు. విశాఖ ఉక్కును కాపాడటానికి బదులుగా అనకాపల్లి వద్ద ప్రైవేట్ స్టీల్ పరిశ్రమ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని, ఇందుకు అవసరమైన భూ సేకరణకు కేంద్రం నుంచి అనుమతులు తీసుకోవడానికి నానాతంటాలు పడటం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో ఎంత అభివృద్ధి చేసినప్పటికీ విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటుపరమైతే చంద్రబాబు చరిత్ర హీనుడిగా నిలిచిపోతారని రామకృష్ణ అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు ఈ నెల 4న విశాఖపట్టణంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, కార్మిక సంఘాలతో కలిసి సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి… పోరాటాలకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. సుపరిపాలనపై గొప్పలు చెప్పుకోవడం మినహా ఆచరణలో కనిపించడం లేదన్నారు. చివరికి రైతులకు ఎరువులు కూడా సకాలంలో ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ తరహాలో ఏపీలోనూ బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ సత్యసాయి జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ మాట్లాడుతూ లేపాక్షి నాలెడ్జ్ భూములు రైతులకు తిరిగివ్వాలని డిమాండ్ చేశారు. కియా పరిశ్రమలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, బలవంతపు భూసేకరణ ఆపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీిఐ రాష్ట్ర సమితి సభ్యుడు కాటమయ్య, సీపీఐ నాయకులు కనిశెట్టిపల్లి వినోద్‌కుమార్, శివప్ప, మధు, మారుతీరెడ్డి, బాలస్వామి, దాదాపీర్, డి.బాబు, రవికుమార్, నరసింహమూర్తి, కమల్ భాషా, సమీవుల్లా, నౌషాద్, అన్సర్, జిలాన్, చలపతి, చాంద్‌భాషా, శ్రీనివాసులు, ముత్యాలప్ప, లింగప్ప, సురేష్, నాగేంద్ర పాల్గొన్నారు.
ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ సిగ్గుచేటు
- Advertisement -
RELATED ARTICLES


