. కరువు నివారణకు పోలవరం`బనకచర్ల కీలకం
. ఆక్వా రైతులు నష్టపోకుండా తక్షణచర్యలు అవశ్యం
. కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఏపీ ప్రభుత్వం చేపట్టే నూతన ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేసి చేయూతనివ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేశారు. కుటుంబ సభ్యులతో విదేశీ పర్యటన పూర్తి చేసుకుని సోమవారం రాత్రికి దిల్లీ చేరుకున్న చంద్రబాబు, మంగళవారం నలుగురు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహించారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులు, కేంద్ర పథకాలపై కేంద్ర మంత్రులతో చర్చించారు. ముందుగా కేంద్ర జల్ శక్తి మంత్రి సి.ఆర్.పాటిల్ తో భేటీ అయిన చంద్రబాబు జల్ జీవన్ మిషన్ పథకానికి కేంద్ర నిధుల మంజూరుపై చర్చించారు. కేంద్ర పథకమైన జల్ జీవన్ మిషన్ ను రాష్ట్రంలో విస్తృత స్థాయిలో ఉపయోగించుకోవాలని భావిస్తున్న సీఎం… ఈ పథకం కింద తాము చేపడుతున్న కార్యక్రమాలను కేంద్ర మంత్రికి దృష్టికి తెచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ను కరువు రహితంగా మార్చేందుకు తమ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు ప్రాధాన్యతను వివరించారు. ఈ ప్రాజెక్టుకు అవసర మైన ఆర్థిక సహాయం చేయాలని కోరారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే కలిగే ప్రయోజనాలు, వ్యవసాయాభివృద్ధి వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అదనపు రాబడి కలుగుతుందని తెలిపారు. అదే విధంగా కేంద్ర అటల్ భూజల్ యోజన్ కార్యక్రమంపై భేటీలో చర్చించారు. భూగర్భ జలాల వృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించి… నిధులు మంజూరు చేయాలని కోరారు. అనంతరం న్యాయ శాఖా మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్‌ను కలిసి కర్నూలులో హై కోర్టు బెంచ్ అంశంపై చర్చించారు. బెంచ్ ఏర్పాటుకు అవసరమైన కార్యాచరణ అమలు చేసి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అమెరికా సుంకాల కారణంగా రాష్ట్రంలో ఆక్వా రంగంలో నెలకొన్న సమస్యలపై వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి పీయూష్ గోయల్ తో చర్చించారు. భారతదేశ సీ ఫుడ్స్ పై విధించిన 26 శాతం సుంకాలు ఏపీలోని ఆక్వా రంగానికి తీవ్ర నష్టం చేస్తున్నాయని సీిఎం వివరించారు. ఈ విషయంలో అమెరికాతో చర్చించి ఆక్వా రైతులు నష్టపోకుండా చూడాలని కోరారు. దీని కోసం తీసుకోవాల్సిన స్వల్ప కాలిక, మధ్యస్థ, దీర్ఘకాలిక చర్యలపై కొన్ని సూచనలు చేశారు. అనంతరం హోం మంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను వివరించి… మద్దతుగా నిలవాలని కోరారు. అలాగే ఈ భేటీలో రాష్ట్రంలో తాజా పరిణామాలపై కూడా వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా మద్యం కుంభకోణం వ్యవహారంతోపాటు, విజయసాయిరెడ్డి రాజీనామా ద్వారా ఖాళీ అయిన రాజ్యసభ స్థానం తదితర అంశాలు చర్చకొచ్చినట్లు తెల్సింది. ఈ భేటీలో సీఎం చంద్రబాబు వెంట కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు పాల్గొన్నారు.