. ఉద్యమమే శరణ్యం
. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల కోసం పోరాటం
. తక్షణం భగత్ సింగ్ ఉపాధి హామీచట్టం
. 20 కోట్ల ఉద్యోగాలపై మోదీ సమాధానం చెప్పాలి
. సేవ్ ఇండియా… చేంజ్ ఇండియా నినాదంతో దేశవ్యాప్త ఉద్యమం
. మోదీని సాగనంపేందుకు యువత నడుం బిగించాలి
. ఏఐవైఎఫ్ బహిరంగసభలో సీపీఐ నేతలు డి.రాజా, సంతోశ్‌కుమార్, నారాయణ, రామకృష్ణ
రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ… ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీని సాగనంపేందుకు యువకులు, విద్యార్థులు సిద్ధం కావాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా పిలుపునిచ్చారు.
తిరుపతి నుంచి డాక్టర్ ఎం.ప్రసాద్, ఎ.సురేశ్
రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ… ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీని సాగనంపేందుకు యువకులు, విద్యార్థులు సిద్ధం కావాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా పిలుపునిచ్చారు. అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) 17వ జాతీయ మహాసభల సందర్భంగా గురువారం సాయంత్రం తిరుపతి ఇందిరా మైదానంలో ఏఐవైఎఫ్ అధ్వర్యంలో భారీ బహిరంగ సభ గురువారం జరిగింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి 600 మందికి పైగా ప్రతినిధులతోపాటు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది యువకులు తరలివచ్చారు. ఏఐవైఎఫ్ పతాకాలతో మైదానం ఎర్రబారింది. ఏఐవైఎఫ్ జాతీయ అధ్యక్షుడు సుఖ్‌జిందర్ మహేసరి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన డి.రాజా మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు నరేంద్ర మోదీ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని, ఈ హామీని అమలు చేసి ఉంటే 20 కోట్ల ఉద్యోగాలు దేశంలో ఇచ్చి ఉండాలని, అధికారంలోకి రాగానే హామీని తుంగలో తొక్కి నిరుద్యోగ యువతను మోసం చేశారని ధ్వజమెత్తారు. ఈ స్థాయిలో యువతను దగా చేసిన ప్రధాని దేశచరిత్రలోనే లేరని దుయ్యబట్టారు. ఉపాధి హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టాలు తీసుకున్న విద్యార్థులు నిరుద్యోగులుగా రోడ్లపై తిరుగుతున్నారని పేర్కొన్నారు. విద్య, ఉపాధి కోసం లక్షలాదిమంది నిరుద్యోగ యువత దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నప్పటికీ మోదీకి చీమకుట్టినట్టు కూడా లేదన్నారు. భగత్‌సింగ్ ఉపాధి హామీ చట్టాన్ని (బనేగా) తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థి, నిరుద్యోగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న నరేంద్ర మోదీని సాగనంపేందుకు యువత నడుం బిగించాలని కోరారు. సేవ్ ఇండియా… చేంజ్ ఇండియా పేరుతో దేశవ్యాప్తంగా బలమైన ఉద్యమాన్ని నిర్మించాలని, అందులో అఖిలభారత యువజన సమాఖ్య అగ్ర భాగాన నిలవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని, ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్ రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర వ్యవస్థగా నడవాలని, రాజకీయాలతీతంగా ఉండాలని స్పష్టం చేశారు. నాడు ఇంద్రజిత్ గుప్తా అధ్యక్షతన నియమించిన కమిటీ ఎన్నికల సంస్కరణలను సిఫార్సు చేసింది. అయితే ఆ కమిటీ సిఫార్సులను పాలకులు తుంగలో తొక్కారని విమర్శించారు. ఇందులో ప్రధానంగా ఎన్నికల వ్యయం నియంత్రించడం, అక్రమాలను అరికట్టడానికి ఎన్నికల సంఘం ఖర్చులు పూర్తిగా ప్రభుత్వమే భరించాలని కమిటీ సిఫార్సు చేసిందని గుర్తుచేశారు. అయితే ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించలేని పరిస్థితి కల్పించి… ఆర్‌ఎస్‌ఎస్ శక్తులు దాన్ని పూర్తిగా తమకు అనుకూలంగా మార్చుకొని, సంస్థను నిర్వీర్యం చేస్తున్నాయన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటిదని అభివర్ణించారు. ప్రధానంగా రాజకీయ పార్టీలు విరాళాల పేరిట స్వీకరించిన ఎన్నికల బాండ్ల వల్ల బీజేపీ మాత్రమే ఎక్కువ లబ్ధి పొందిందని, కోట్లాది రూపాయలు సేకరించిందని, దీన్ని సుప్రీంకోర్టు సైతం తప్పుపట్టిందని గుర్తుచేశారు. ఈ విధానానికి పూర్తిగా స్వస్తి చెప్పాలని డి.రాజా డిమాండ్ చేశారు. భారత్, పాకిస్థాన్ మధ్య చెలరేగుతున్న వివాదం నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని నిరంతర సంక్షోభంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఉగ్రవాదాన్ని అడ్డుపెట్టుకొని, మతాల మధ్య విద్వేషం సృష్టించడానికి బీజేపీ కుట్రపన్నుతోందని, తద్వారా లబ్ధి పొందాలనేదే దాని లక్ష్యమన్నారు. మోదీ కుట్రలను విచ్ఛిన్నం చేయడం ద్వారా మతసామరస్యాన్ని కాపాడటంలో యువత కీలక భూమిక పోషించాలన్నారు. అందులో ఏఐవైఎఫ్ ముందుండాలన్నారు.
సంక్షోభంలో రాజ్యాంగం: నారాయణ
బీజేపీ రాజకీయ విధానాల వల్ల ఏకంగా భారత రాజ్యాంగమే ప్రమాదంలో పడిపోయిందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు, నక్సలైట్ల వల్ల రాజ్యాంగానికి నష్టం లేదని గుర్తుపెట్టుకోవాలని, బీజేపీ రాజకీయ విధానాలు వల్ల మాత్రమే ముప్పు ఉందన్నారు. గవర్నర్ల వ్యవస్థ అంశంపై రాష్ట్రపతి ముర్ము చేసిన వ్యాఖ్యలను నారాయణ తప్పుబట్టారు. న్యాయ వ్యవస్థను శాసించేస్థాయికి రాష్ట్రపతి వచ్చారంటే బీజేపీ విధానాలు ఏ స్థాయికి చేరాయో గుర్తించాలని అన్నారు. భారత రాజ్యాంగం పట్ల బీజేపీకి ఏ మాత్రం గౌరవం లేదన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో బీజేపీ ఎక్కడుందని ప్రశ్నించారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటమే లేదని, అందుకే భారత రాజ్యాంగం పట్ల బీజేపీకి గౌరవం లేదని, దాని స్థానంలో ఆర్‌ఎస్‌ఎస్ భావజాలాన్ని పెంచి పోషించే విధంగా వారి చర్యలు ఉన్నాయన్నారు. ఇప్పటికే రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ కులాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నదని ఆరోపించారు. బీజేపీ కుయుక్తుల పట్ల యువత అప్రమత్తం కావాలని, దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత యువతపై ఉందని తెలిపారు.
దేశ రక్షణ కోసం యువత ముందుకు రావాలి: రామకృష్ణ
భారత రాజ్యాంగాన్ని, లౌకికవాదాన్ని, మత సామరస్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత యువతపై ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. పేద, బడుగు, బలహీన వర్గాల తరపున యువత నిరంతర పోరాటాలు చేయాలని కోరారు. మైనార్టీలను దెబ్బ తీసేందుకు బీజేపీ హిందూ మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తూ కులాలు , మతాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నదని విమర్శించారు. 2014 ఎన్నికల ముందు బీజేపీ ప్రభుత్వం వస్తే చదువుకున్న యువతీ యువకులకు రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని, 10 సంవత్సరాలు గడిచినా రెండు లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు. మరోపక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిరుద్యోగ భృతి కింద నెలకు 3000 రూపాయలు ఇస్తామని ఎన్నికల ముందు చెప్పి… నేటికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని తెలిపారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయకపోగా కనీసం ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు కూడా భర్తీ చేయకపోవడం దుర్మార్గమన్నారు. ప్రధానమంత్రి ఒక దళారిగా మారి దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచి పెడుతున్నారన్నారు. దేశంలో నిరుద్యోగం విశృంఖలంగా పెరిగిపోతున్నదని, మరోపక్క పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్య చేసుకొనే పరిస్థితి దాపురించిందన్నారు. దీనికి తోడు నిత్యావసర ధరలు రోజురోజుకీ ఆకాశాన్ని తాకుతున్నాయని అన్నారు. 370 ఆర్టికల్ రద్దు చేస్తే ఉగ్రవాదం ఆగిపోతుందని, నోట్ల రద్దు వల్ల అన్నీ ఆగిపోతాయని చెప్పిన ప్రధానమంత్రి కశ్మీరులో ఉగ్రవాదుల చర్యలను ఆపగలిగారా అని ప్రశ్నించారు. భారత్, పాకిస్థాన్ కాల్పుల విరమణను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించటం వెనక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. దీనిపై బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలన్నారు. కనీసం ట్రంప్ భారత్, పాకిస్థాన్‌పై చేస్తున్న ప్రకటనలు కూడా ఖండిరచలేని స్థితిలో ప్రధానమంత్రి ఉన్నారన్నారు. దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచి పెడుతూ పేద, బడుగు, బలహీన, కార్మిక వర్గాలను మరింత పేదరికంలోకి నెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సింబల్‌తో గెలిచిన ప్రజాప్రతినిధులను తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటూ నీతిమాలిన రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. టీటీడీలో దర్శనం టికెట్లను అక్రమంగా అమ్ముకునే శాసనమండలి వైస్ చైర్మన్‌ను బీజేపీలో చేర్చుకోవటం సిగ్గుమాలిన పని అని అన్నారు. మహోన్నత చరిత్ర గల ఏఐవైఎఫ్ జాతీయ మహాసభలకు ఏపీ ఆతిథ్యం ఇవ్వడం తమకు ఎంతో ఆనందంగా ఉందని, ఈ మహాసభలు విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు.
మతం పేరుతో విభజన రాజకీయాలు: సంతోశ్ కుమార్
మతం పేరుతో బీజేపీ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నదని రాజ్యసభ సభ్యులు పి.సంతోశ్ కుమార్ విమర్శించారు. దేశంలో నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో యువత దేశ రక్షణ కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తు యువతపైనే ఆధారపడి ఉందన్నారు. ఇటీవల ఉగ్రవాదుల దాడులు, తదనంతరం భారత్ చేపట్టిన సైనిక చర్యలకు సైతం మతం రంగు పూశారని తెలిపారు. ఉగ్రవాదమంటే ఉగ్రవాదమేనని, దానిపై అందరూ పోరాడాల్సిందేనని, ఉగ్రవాదాన్ని ఒక మతానికి ఆపాదించడం సరికాదన్నారు. పాకిస్థాన్‌లో సైతం ఉగ్రవాద దుశ్చర్యలకు ఇటీవలకాలంలో వెయ్యి మందికి పైగా ప్రజలు బలయ్యారని తెలిపారు. బలైన వారు ఏ మతానికి చెందినవారో ప్రధానమంత్రి తెలియజేయాలని ప్రశ్నించారు. మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టటానికి జరుగుతున్న ప్రయత్నాలు అత్యంత ప్రమాదకరస్థాయికి చేరాయని, నిజాలను నేటి యువత తెలుసుకోవాలన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ ప్రేరేపిత బీజేపీ మత విచ్ఛిన్నకర కుయుక్తుల పట్ల యువత అప్రమత్తం కావాలని కోరారు.
నిరుద్యోగులు-కార్పొరేట్ శక్తుల మధ్యనే పోరాటం: మహేసరి
కేంద్ర ప్రభుత్వం గడిచిన పదేళ్లలో రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి… కనీసం రెండు లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదని ఏఐవైఎఫ్ జాతీయ అధ్యక్షుడు సుఖ్‌జిందర్ మహేసరి అన్నారు. కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగ పోస్టులు భర్తీ చేయటానికి ప్రయత్నం జరుగుతోందని, దీనికి వ్యతిరేకంగా యువత మరో ఉద్యమానికి సిద్ధం కావాలన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తే యువశక్తి పెరుగుతుందని, తద్వారా జీవన ప్రమాణాల్లో మార్పు వస్తుందని తెలిపారు. రాజకీయ నాయకులు ఎన్నికల ముందు ఒక విధంగా… అధికారంలోకి వచ్చిన తర్వాత మరో రకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిం చారు. అందుకే భగత్ సింగ్ స్ఫూర్తితో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఉద్యమించాలని పిలుపు నిచ్చారు. మహాసభల అనంతరం ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనపై ప్రభుత్వాలు చేస్తున్న మోసాలపై దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తా మని చెప్పారు. నిరుద్యోగులకు, కార్పొరేట్ శక్తుల మధ్య పోరాటం కొనసాగుతోందని తెలిపారు. దేశంలో శాంతి అవసరమని, ఈ దిశగా ఏఐవైఎఫ్ కృషి చేయాలన్నారు.
బీజేపీ కుట్రలపై యువత అప్రమత్తం: తిరుమలై రామన్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కులం, మతం, ప్రాంతాల వారీగా రెచ్చగొడుతూ లబ్ధి పొందుతోందని ఏఐవైఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి తిరుమలై రామన్ అన్నారు. దీనిపై యువ లోకం అప్రమత్తంగా వ్యవహరించాల్సిన సమయం ఇదేనని గుర్తు చేశారు. విద్య, ఉపాధిని ప్రాథమిక హక్కుగా మార్చడానికి పోరాట కార్యక్రమాలకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయించుకోవడానికి రాజీలేని పోరాటాలు సాగించేందుకు కదనరంగంలోకి దిగుదామని ఆయన యువతకు కర్తవ్యబోధ చేశారు.
మరో ఉద్యమానికి సిద్ధం: రాజేంద్ర బాబు
చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించ డంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పరుచూరి రాజేంద్ర బాబు పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధి కోసం యువకులు మరో ఉద్యమానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. నాలుగు రోజులు పాటు తిరుపతిలో జరుగుతున్న మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. ఏఐఎస్‌ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్ మాట్లాడుతూ విద్య, ఉపాధి హక్కుల కోసం జరిగే పోరాటంలో ఏఐవైఎఫ్ వెంట ఏఐఎస్‌ఎఫ్ నడుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యులు వలి ఉల్లా ఖాద్రి, ఖాదర్, లెనిన్ బాబు, ప్రతాప్‌శౌరి, ఏఐఎస్‌ఎఫ్ నేత ధీరజ్, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.యుగంధర్, సీనీ సంగీత దర్శకులు వందేమాతరం శ్రీనివాస్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.హరినాథ్ రెడ్డి, జి ఈశ్వరయ్య, సీపీఐ తిరుపతి జిల్లా కార్యదర్శి పి.మురళి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ప్రజానాట్యమండలి గాయకులు విప్లవ గీతాలాపన చేసి యువతను ఉత్తేజ పరిచారు.