Homeజాతీయంప్రైవేట్ట్రావెల్స్ దందా

ప్రైవేట్ట్రావెల్స్ దందా

- Advertisement -

. భారీగా పెంచిన రవాణా చార్జీలు
. సామాన్య ప్రయాణికుల ఇక్కట్లు
. రవాణాశాఖ చోద్యం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : వరుస పండగలు, వారాంతపు సెలవుల నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే సామాన్య ప్రయాణికులపై ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీలు నిర్దాక్షిణ్యంగా భారాలు మోపుతోంది. తెలుగు రాష్ట్రాల నుంచి నగరాలు, పల్లెలకు వెళ్లే ప్రయాణికుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని, టికెట్ ధరలను అమాంతం పెంచేస్తూ పండగ ఆనందాన్ని ఆవిరి చేస్తున్నాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాల నుంచి రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు వెళ్లే బస్సు చార్జీలు ఇప్ప్పుడు ఆకాశాన్ని తాకుతున్నాయి. 19వ తేదీన ఉగాది, 21న రంజాన్ పండుగలు రావడం, మధ్యలో ఉన్న శుక్రవారం ఒక రోజు సెలవు తీసుకుంటే ఆదివారంతో కలిపి వరుసగా నాలుగు రోజుల పాటు కుటుంబంతో గడపవచ్చని ఉద్యోగులు, విద్యార్థులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.
ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ బస్సులు, రైళ్లలో రిజర్వేషన్లు వారం రోజుల ముందే పూర్తవడంతో, సామాన్యులకు ప్రైవేట్ ట్రావెల్స్ మినహా వేరే మార్గం లేకుండా పోయింది. ఈ అవకాశాన్ని ప్రైవేట్ సంస్థలు తమ లాభార్జనకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. సాధారణ రోజుల్లో బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు, విజయవాడకు ప్రైవేట్ బస్సు ఛార్జీ దాదాపు రూ.1,500 నుంచి రూ.2వేల మధ్య ఉంటుంది. ప్రస్తుతం వారం కొన్ని ట్రావెల్స్ ధరలను ఏకంగా మూడు నుంచి నాలుగు రెట్లు పెంచినట్లు ప్రయాణికులు వాపోతున్నారు. నాన్ ఏసీ స్లీపర్ సీట్లకు కొన్ని ప్రముఖ ట్రావెల్స్ సంస్థలు ఒక వ్యక్తికి రూ.3వేల నుంచి రూ.4 వేల వరకు వసూలు చేస్తున్నాయి. ఏసీ స్లీపర్ ధరలు అంతకు మించి పోతున్నాయి. విమాన సర్వీసులకు సమాంతరంగా ఈ ధరలు ఉండటంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. సామాజిక మాద్యమాల వేదికగా ప్రజలు ఈ దోపిడీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
ప్రైవేట్ ట్రావెల్స్ ఇష్టారాజ్యంగా పెంచుతున్న ఈ ధరలను నియంత్రించడంలో రవాణా శాఖ పూర్తిగా విఫలమైందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి పండుగ సీజన్‌లోనూ తనిఖీలు నిర్వహిస్తామని అధికారులు ప్రకటనలు చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం మారడం లేదని విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం గరిష్ట ధరలను నిర్ణయించకపోవడం, అక్రమ వసూళ్లకు పాల్పడే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ దోపిడీ నిరంతరాయంగా సాగుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని, ప్రధాన నగరాల నుంచి అదనపు ఆర్టీసీ సర్వీసులను నడపడంతో పాటు, రవాణా శాఖ అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అక్రమంగా అధిక ధరలు వసూలు చేసే బస్సులను సీజ్ చేయడంతో పాటు, ఆన్‌లైన్ బుకింగ్ పోర్టళ్లలో ధరల పెరుగుదలను పర్యవేక్షించాలని బాధితులు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు