Monday, February 24, 2025
Homeబంగాళదుంపలతోబతకమంటారా?

బంగాళదుంపలతోబతకమంటారా?

. పరిహారం అందక నిర్వాసితుల ఆందోళన
. ముంపు జాబితాలో లేరంటున్న అధికారులు
. వరదలొస్తే జలమయం అంటున్న ప్రజలు
. కాళ్లరిగేలా తిరుగుతున్నా పట్టించుకోని పాలకులు

విశాలాంధ్ర- వీ.ఆర్‌.పురం (అల్లూరి జిల్లా): వరదల సమయంలో ప్రభుత్వం అందించే ఉల్లిపాయలు, బంగాళదుంపలు తిని బతకమంటారా లేక పరిహారం అందించి శాశ్వత పరిష్కారం చూపుతారో చెప్పండి అంటూ ప్రభుత్వాన్ని, పాలకులను నిలదీస్తున్నారు రేఖపల్లి ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ, మొద్దులగూడెం గ్రామాల నిర్వాసితులు. తమ గ్రామాలను 41 కాంటూరులో చేర్చాలని అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం మాత్రం శూన్యమన్నారు. ఒకే కాలనీకి చెందిన ప్రజలను రెండుగా చీల్చి 111 కుటుంబాలు లేడర్‌ సర్వేలో ఉన్నాయని, మిగిలిన 98 కుటుంబాలు లేడర్‌ సర్వేలో లేవని అనటం ఎంత వరకు న్యాయమో అధికారులు, పాలకులే తేల్చాలని డిమాండ్‌ చేశారు. వివరాల్లోకి వెళితే… పోలవరం ప్రాజెక్ట్‌ నిర్వాసితులు కొంతమందికి ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజి అందని ద్రాక్షలా మారింది. ఇళ్లు, వాకిళ్లు … సమస్తం త్యాగం చేస్తున్నా… వరదొస్తే అంతా జలమయమే అయినప్పటికీ పరిహారం విషయంలో ముంపు జాబితాలో లేరంటూ అధికారులు చెబుతున్న తీరుతో వారు ఆందోళన చెందుతున్నారు. పరిహారం కోసం అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నా ఫలితం దక్కక, తమ బాధలు ఎవరికి చెప్పాలో తెలియని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. అల్లూరి సీతారామరాజు జిల్లా వీఆర్‌ పురం మండలం రేఖపల్లి ఎస్సీ కాలనీ నిర్వాసిత కుటుంబాలకు నష్ట పరిహారం ఇప్పటికీ అందలేదు. కనీవినీ ఎరుగని రీతిన వరద వచ్చినా ఎవరూ పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. ప్రతిఏటా వరదలతో సతమతం అవుతున్నా తాము నిర్వాసితులం కాదా అని ప్రశ్నిస్తున్నారు. 2022 వరదల్లో రేఖపల్లి (ఎస్సీ కాలనీ), మొద్దులగూడెం, బీసీ కాలనీ తదితర గ్రామాలు నీటమునగగా అధికారులు పడవలపై తిరిగారని, ఇప్పటికీ నోరు మెదపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి ఆయా గ్రామాలను 41 కాంటూరు జాబితాలో చేర్చాలని అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం శూన్యం మన్నారు. ఇప్పటికే ఇళ్లన్నీ ధ్వంసమయ్యాయని, మరలా వరదలు వస్తే కూలిపోతాయన్నారు. సాక్షాత్తు నాటి ప్రతిపక్ష నాయకుడు, ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు మీకు అండగా ఉంటాను అని భరోసా ఇచ్చారని, అయినప్పటికీ ఫలితం లేదని, ప్రభుత్వం తక్షణం స్పందించి తమకు న్యాయం చేయాలని నిర్వాసితులు వేడుకున్నారు.
రెంటికీ చెడ్డ బీసీ కాలనీవాసులు
వీఆర్‌ పురం మండలం వడ్డిగూడెం పంచాయతీ పరిధిలోని బీసీ కాలనీ నిర్వాసితులకు సైతం నష్టపరిహారం అందలేదు. వడ్డిగూడెం పంచాయతీ అధికారులు పన్నులు కట్టించుకున్నా… తమ పంచాయతీకి చెందిన వారు కాదని, రేఖపల్లి పంచాయతీకి చెందినవారని చెబుతూ నష్టపరిహారం కోసం అటు ఇటు తిప్పుతున్నారు. ప్రతి సంవత్సరం వరదల్లో అనేక బాధలు పడుతూ ఉంటే … మీ కాలనీ 41.15 కాంటూరు కి చెందినది కాదని అధికారులు అంటున్నారని స్థానికులు వాపోయారు. ఒక కాలనీకి చెందిన ప్రజలను రెండుగా చీల్చి 111 కుటుంబాలు లేడర్‌ సర్వేలో ఉన్నాయని, మిగిలిన 98 కుటుంబాలు లేడర్‌ సర్వేలో లేవని అనటం ఎంత వరకు న్యాయమో అధికారులు, పాలకులే తేల్చాలని డిమాండ్‌ చేశారు.
వివిధ రకాలుగా సర్వేలు చేసి మోసగించటం ఎంత వరకు న్యాయం అంటూ ప్రశ్నిస్తున్నారు. తమ కంటే ఎత్తు ప్రాంతంలో ఉన్న వారిని 41.15 కాంటూరులో కలిపి లోతు ప్రాంతంలో ఉన్న తమను ఎందుకు కలపటం లేదో అర్థం కావడం లేదన్నారు. 60 సంవత్సరాల క్రితం వడ్డిగూడెం, రాజపేట గ్రామాలలో జీవించే తమను, ఊరు చివర పడేసి 41.15 కాంటూరులో మీ గ్రామాలు లేవనడం ఎంత వరకు సమంజసమో అధికారులే చెప్పాలన్నారు. నష్టపరిహారం కోసం సంబంధిత అధికారులను కలవడానికి ధవళేశ్వరం, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ, అమరావతి ప్రాంతాలకు సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని కాళ్లు అరిగేలా తిరిగినప్పటికీ ఫలితం లేదని ఆవేదన వ్యక్తపరిచారు. తమ బాధను అర్థం చేసుకొని పీిఎన్‌ నోటిఫికేషన్‌ ఇవ్వాలని, స్ట్రక్చర్‌ వ్యాల్యూ సర్వే చేయించాలని, గ్రామసభ పెట్టాలని, బ్యాంకు అకౌంట్లో పరిహారం జమచేయాలని, పునరావాసం కల్పించాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు