. చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీలో సుదీర్ఘ చర్చ
. సిట్ ఏర్పాటుతో సమగ్ర విచారణకు నిర్ణయం
. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక, వివిధ అంశాల పైనా చర్చ
విశాలాంధ్ర బ్యూరో -అమరావతి : కాకినాడ పోర్టు కేంద్రంగా జరుగుతున్న బియ్యం అక్రమ రవాణాను ప్రభుత్వం తీవ్రమైన అంశంగా పరిగణిస్తోంది. దీనిపై సిట్ ఏర్పాటు చేసి సమగ్ర విచారణ చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉండవల్లి నివాసంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య రెండు గంటల పాటు కొనసాగిన భేటీలో అనేక అంశాలు చర్చకొచ్చినప్పటికీ, ముఖ్యంగా కాకినాడ పోర్టు కేంద్రంగా జరుగుతున్న బియ్యం అక్రమ రవాణాపై సుదీర్ఘ చర్చ జరిగినట్లు తెలిసింది. ఇటీవల కాకినాడ పోర్టు నుంచి ప్రజా పంపిణీ బియ్యం స్మగ్లింగ్ అవుతున్న నౌకను పవన్ కల్యాణ్ స్వయంగా సీజ్ చేయించిన విషయం తెలిసిందే. దీనిపై తన దృష్టికి తీసుకొచ్చిన విషయాలను సీఎం దృష్టికి తీసుకొచ్చిన పవన్ కల్యాణ్ సమగ్ర విచారణకు ఆదేశించాలని కోరినట్లు సమాచారం. రాష్ట్రంలో గత ఐదేళ్లలో బియ్యం మాఫియా చెలరేగిపోయిందని, దేశ భద్రతకు సైతం ముప్పు వాటిల్లేలా ఈ స్మగ్లింగ్ సాగిందని ఆయనకు పవన్ వివరించారు. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఒక పెద్ద నెట్ వర్క్ ఏర్పాటు చేసి రూ.కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారని తెలిపారు. గత మూడేళ్లలో ఒక్క కాకినాడ పోర్టు నుంచే రూ.48,537 కోట్ల విలువ చేసే బియ్యం ఎగుమతి కావడం మాఫియా విపరీత ధోరణికి నిదర్శనంగా పేర్కొన్నారు. రేషన్ మాఫియాకు కళ్లెం వేసే దిశగా కఠిన నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత ఐదేళ్లలో కాకినాడ పోర్టులోకి ఎవరినీ అనుమతించలేదని, తన పర్యటన సమయం లోనూ ఇబ్బందులు ఎదురయ్యాయని గుర్తు చేశారు. ఆఫ్రికా దేశాలకు బియ్యం ఎగుమతులు చేసి రూ.కోట్లు కూడబెడు తున్నారని, రాష్ట్రంలో ఏ పోర్టులో జరగని విధంగా కాకినాడ పోర్టులోనే గత ప్రభుత్వ హయాంలో బియ్యం ఎగుమతులు పెద్దఎ త్తున జరిగాయని, వీటన్నింటిపై సమగ్ర విచారణ ద్వారా వాస్తవాలు బయటకు తీసుకురావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. మంగళవారం జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీనిపై అధికారికంగా ఒక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. తాజా రాజకీయ పరిణామాలతో పాటు దిల్లీ పరిణామాల పైనా, నామినేటెడ్ పదవుల నాలుగో జాబితా విడుదల పైనా ఇద్దరు నేతలూ చర్చించినట్లు సమాచారం. అలాగే ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక, రాజధాని అమరావతిలో చేపట్టబోయే అభివృద్ధి పనులపైనా చర్చించారు. డిసెంబరు 15వ తేదీ నుంచి అమరావతి పనులను వేగవంతం చేయాలని ఈ సందర్భంగా వారు నిర్ణయించారు.
ఇక నామినేటెడ్ పోస్టుల విషయంలో త్వరలో నాలుగో జాబితా విడుదలపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. అందులోభాగంగా కొందరి పేర్లు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. మూడు జాబితాల విషయంలో ఎటువంటి వివాదాలకు తావు లేకపోవడంతో నాలుగు జాబితా సైతం కష్టపడి పని చేసిన వారికి పదవులు కేటాయించాలని నేతలిద్దరూ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.