Saturday, March 29, 2025
Homeబిలియనీర్ల చేతుల్లోమూడోవంతు సంపద

బిలియనీర్ల చేతుల్లోమూడోవంతు సంపద

అదానీకి అధిక లాభాలు
హురున్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌ నివేదిక

న్యూదిల్లీ : దేశంలో మూడోవంతు సంపద బిలియనీర్ల చేతుల్లో కేంద్రీకృతమైంది. ప్రత్యేకించి ప్రధాని నరేంద్రమోదీ అనుంగు మిత్రుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతం అదానీ అతికొద్దికాలంలోనే సంపన్నుల జాబితాల్లో మొదటిస్థానంలోకి వచ్చారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో సంపన్నులు పెరిగారు. పేదలు మరింత పేదరికంలోకి నెట్టబడ్డారు. మధ్యతరగతికి అప్పులు తప్పడంలేదు. దిగిరాని ద్రవ్యోల్బణం, ఉపాధి లేమితో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. దేశంలో కార్పొరేట్‌ లూటీ పెరిగిందని, దేశ సంపద కొంతమంది చేతుల్లో బందీ అయినట్లు ఆరోపణలు వస్తున్న తరుణంలో హురున్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌ ఓ నివేదిక విడుదల చేసింది. అందులో దేశ బిలియనీర్ల సంపద భారత జీడీపీలో మూడో వంతుగా ఉన్నట్లు తెలిపింది. ఇందులో గౌతం అదానీ అధిక లాభాలు పొందుతున్నట్లు నివేదిక వెల్లడిరచింది. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) నివేదిక ఆధారంగా కార్మికుల వేతనాల దీనస్థితిపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే ఆందోళన వ్యక్తం చేసిన మరుసటి రోజు విడుదల కావడంతో ఈ నివేదికకు ప్రాధాన్యం ఏర్పడిరది.
దేశంలోని 284 మంది బిలియనీర్ల సంపద 10 శాతం మేర పెరిగి రూ.98 లక్షల కోట్లకు చేరినట్లు నివేదిక వెల్లడిరచింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు సాగించే అదానీ సంపద రూ.8.4 లక్షల కోట్లకు పెరిగినట్లు తెలిపింది. ప్రపంచ కుబేరుడిగా అదానీ నిలిచారని వెల్లడిరచింది. మరోవైపు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ సంపదలో 13 శాతం క్షీణత నమోదైందని, ఆయన ఆస్తి విలువ రూ.8.6 లక్షల కోట్లకు పడిపోయిందని తెలిపింది. అయితే తనకున్న 100 బిలియన్‌ డాలర్ల సంపద సాయంతో ఆయన తిరిగి ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలవగలిగారని పేర్కొంది. ఇటీవల విడుదలైన ‘హిండెన్‌బర్గ్‌’ నివేదిక… అదానీ అక్రమాల చిట్టా విప్పింది. ఇది సంచలనంగా మారింది. దీనిపై జేపీసీ విచారణకు విపక్షాలు డిమాండ్‌ చేస్తూనే ఉన్నాయి. ఆ సమయంలో అదానీ నష్టాలు చవిచూశారు కానీ… మోదీ ప్రభుత్వ అండదండలతో అతితక్కువ కాలంలోనే తిరిగి పుంజుకున్నారు. అదానీ సంపద గతేడాది 13 శాతం మేర పెరిగింది. ఇదిలావుంటే, దేశంలోని ప్రతి బిలియనీరు సగటు సంపద… చైనాతో పోల్చితే ఎక్కువగా ఉందని నివేదిక చెబుతోంది. చైనా బిలియనీర్ల సగటు సంపద రూ.29,027 కోట్లు కాగా భారత్‌ బిలియనీర్‌ సంపద విలువ రూ.34,514 కోట్లుగా పేర్కొంది. మొత్తం 175 మంది భారతీయ బిలియనీర్ల సంపద గతేడాది పెరిగిందని తెలిపింది. 109 మంది సంపద క్షీణించింది లేక హెచ్చుతగ్గులు నమోదు చేయలేదని పేర్కొంది.
దేశంలో సంపన్నురాలు, ప్రపంచంలోని ఐదవ సంపన్న మహిళ రోషిణి నాడార్‌ సంపద రూ.3.5 లక్షల కోట్లకు చేరుకుంది. హెచ్‌సీఎల్‌ సంస్థలో 47 శాతం వాటాను తన తండ్రి బదిలీ చేయడంతో రోహిణి అత్యంత సంపన్నురాలిగా నిలిచారు. రూ.8,643 కోట్ల సంపదతో దేశంలోని అతిపిన్న వయస్సు సంపన్నులుగా ‘రేజర్‌పే’ సహ వ్యవస్థాపకులు శశాంక్‌ కుమార్‌ (34), హర్షిల్‌ మాథుర్‌ నిలిచారు.
నగరాలను పరిగణనలోకి తీసుకుంటే ఆర్థిక రాజధాని ముంబై నుంచి 11 మంది బిలియనీర్ల జాబితాలో ఉన్నారు. దీంతో వారి సంఖ్య 90కి పెరిగింది. అయినా ఆసియాలోని సంపన్న రాజధానిగా ముంబైకు స్థానం దక్కలేదు. ఈ ఏడాది షాంఘై ఆ స్థానం దక్కించుకుంది. భారత్‌లోని ఆరోగ్య సంరక్షణ పరిశ్రమలో అత్యధికంగా 53 మంది సంపన్నులు ఉంటే… వినియోగదారు వస్తు సేవల రంగంలో 35 మంది, పారిశ్రామికోత్పత్తుల రంగంలో 32 మంది చొప్పున ఉన్నట్లు నివేదిక తెలిపింది. భారత్‌లోని బిలియనీర్ల సగటు వయస్సు 68 ఏళ్లు కాగా ఇది ప్రపంచ బిలియనీర్లతో పోల్చితే రెండేళ్లు అధికం. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) నివేదిక ఆధారంగా కార్మికుల వేతనాల దీన స్థితిపై మల్లికార్జున ఖడ్గే ఆందోళన వ్యక్తం చేస్తూ… ఆర్థిక అసమానతలను వలసవాద పాలన మునుపటి స్థాయికి మోదీ ప్రభుత్వం తీసుకెళ్లినట్లు దుయ్యబట్టారు. గత 78 ఏళ్లలో ఇంతలా ఏ ప్రభుత్వం సామాన్యులను ఆర్థికంగా బలహీనపర్చలేదన్నారు. డిగ్రీలు, ఉద్యోగ నైపుణ్యత ఉన్నప్పటికీ ప్రపంచంలో అత్యల్పంగా వేతనాలను భారత యువత పొందుతున్నారని ఖడ్గే వెల్లడిరచారు. దేశంలో సగటు గృహ సంపద 35,800 యూరోలు (రూ.9.83 లక్షలు) కాగా, చైనాలో సగటు గృహ సంపద 86,100 యూరోలుగా ఉన్నట్లు ప్రపంచ అసమానత నివేదిక`2022 నివేదించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు