సీపీఐ ప్రధాన కార్యదర్శులు – 4
ఆర్వీ రామారావ్
బీటీ రణదివేగా ప్రసిద్ధుడైన బాలచంద్ర త్రయంబక్ రణదివే మధ్యతరగతి నుంచి ఎదిగిన కమ్యూనిస్టు నాయకుడు. ఆయన తండ్రి ఆదాయపు పన్ను శాఖ అధికారి. ఆయనకు కాంగ్రెస్ మీద అభిమానం ఉండేది. ఆ ప్రభావం బీటీ రణదివే మీద కూడా ఉండేది. మొదట్లో లోకమాన్య బాల గంగాధర తిలక్, మహాత్మా గాంధీ సిద్ధాంతాలు రణదివేను ఆకర్షించాయి. గాంధీ ప్రారంభించిన సహాయ నిరాకరణోద్యమాన్ని రణదివే గట్టిగా సమర్థించే వారు. కానీ 1922లో చౌరీ చౌరా సంఘటన ప్రభావంవల్ల గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఉపసంహరించడం రణదివేను అసంతృప్తికు గురి చేసింది. ప్రత్యామ్నాయం కోసం అన్వేషిస్తుండగా డా. జీఎం అధికారి జర్మనీ నుంచి రహస్యంగా పంపించే కమ్యూనిస్టు సాహిత్యం రణదివేను ఆకర్షించింది. సీపీఐకి రెండవ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన అధికారి రణదివేకు దగ్గరి బంధువు. మార్క్సిస్టు సాహిత్యంతో పరిచయం కారణంగా రణదివే 1928లో సీపీఐలో చేరారు. మరాఠీ వారపత్రిక ‘‘క్రాంతి’’ సంపాదకులుగా ఉండేవారు.
సీపీఐ ప్రధాన నాయకులందరూ మీరట్ కుట్ర కేసులో అరెస్టు అయినప్పుడు రణదివే సీపీఐ అనుబంధ కార్మిక సంఘమైన ఏఐటీయూసీకి పెద్ద దిక్కయ్యారు. జౌళి కార్మికుల గిర్నీ కాంగార్ యూనియన్ కార్యకలాపాల్లో రణదివే చురుకుగా పాల్గొనే వారు. రైల్వే కార్మికుల సంఘంలోనూ ఆయన క్రియాశీలంగా ఉండేవారు. జౌళి కార్మికులను సమీకరించినందుకు, ప్రపంచ వ్యాప్త ఆర్థిక మాంద్యం వల్ల కష్టాలుపడ్తున్న కార్మికులను ఏకీకృతం చేసినందువల్ల ఆయన రెండు సార్లు జైలు శిక్ష అనుభవించవలసి వచ్చింది. 1936లో జైలు నుంచి విడుదలైన తరవాత ఆయన మళ్లీ కార్మికోద్యమంలో రెట్టించిన ఉత్సాహంతో పాల్గొన్నారు. పారిశ్రామిక కార్మికులలో కమ్యూనిస్టుల ప్రాబల్యాన్ని కట్టడి చేయడం కోసం 1938లో బొంబాయి ప్రావిన్స్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పారిశ్రామిక వివాదాల బిల్లుకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో రణదివే కీలక పాత్ర పోషించారు. ఈ బిల్లు ప్రకారం కార్మికులు సమ్మె చేయడం చట్ట విరుద్ధం.
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో రణదివే యుద్ధ వ్యతిరేక ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు. అరెస్టు కాకుండా తప్పించుకోవడానికి రణదివే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయనను రాజస్థాన్‌లోని దియోలీ శిబిరంలో నిర్బంధించారు. జైలులో దుర్భర పరిస్థితులు ఉన్నప్పటికీ ఆయన ఖైదీలకు రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహించారు. ఆ రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించడం కోసం కాంగ్రెస్, ముస్లిం లీగ్ కూడా కలిసి రావాలని కమ్యూనిస్టు పార్టీ వాదించేది. రణదివే ఈ ప్రచారంలో చురుకైన పాత్ర నిర్వహించారు. బెంగాల్ కరవు, వర్లీ తిరుగుబాటు, తెలంగాణ సాయుధ పోరాటంలో రణదివే గణనీయమైన పాత్ర పోషించారు. మొదట సాయుధ పోరాటానికి పీసీ జోషి మద్దతు ఉండేది. కానీ పరిస్థితులు అననుకూలంగా తయారైన సందర్భంలో కూడా సాయుధ పోరాటం కొనసాగించాలన్న రణదివే వాదన అపార నష్టానికి దారి తీసింది. 1962లో భారత చైనా మధ్య సరిహద్దు ఘర్షణ జరిగినప్పుడు సంప్రదింపుల ద్వారా సరిహద్దు సమస్య పరిష్కరించుకోవాలి అన్నది రణదివే అభిప్రాయం. కానీ జాతి వ్యతిరేక విధానం అనుసరిస్తున్నారన్న ఆరోపణతో 1966లో రణదివేను అరెస్టు చేశారు. రణదివే 1927లో ఎంఎ పూర్తి చేశారు. అదే సంవత్సరం ఆయన కార్మికోద్యమంలో ప్రముఖ పాత్ర నిర్వర్తించారు.
1948లో కలకత్తాలో జరిగిన సీపీఐ రెండవ మహాసభలో పీసీ జోషి స్థానంలో సీపీఐ ప్రధాన కార్యదర్శిగా రణదివే ఎన్నికై 1950 దాకా ఆ బాధ్యతలు నిర్వర్తించారు. రణదివే దుస్సాహసిక విధానాలు అనుసరిస్తున్నారన్న అభిప్రాయం ఉండేది. ఆయనను నాయకత్వ స్థానాలకు దూరంగా ఉంచారు. 1956లో పాల్ఘాట్ లో జరిగిన పార్టీ మహాసభలో రణదివే మళ్లీ పార్టీకి చేరువయ్యారు. పార్టీ రెండవ మహాసభలో సీపీఐ అనుసరించిన విధానాన్ని రణదివే లైన్ లేదా కలకత్తా థీసిస్ అంటారు. ఈ రెండవ మహాసభలోనే 1947లో వచ్చిన స్వాతంత్య్రం కేవలం కపటం అని తీర్మానించారు. ఆ సమయంలో రణదివేనే నాయకత్వ స్థానంలో ఉన్నారు.