Friday, May 9, 2025
Homeబీసీల రిజర్వేషన్‌ సాధనకు నాయకత్వం వహిస్తా

బీసీల రిజర్వేషన్‌ సాధనకు నాయకత్వం వహిస్తా

. 42 శాతం కల్పించాలనే బిల్లు తీసుకొచ్చాం
. అఖిలపక్షంగా ఏర్పడి ప్రధానిని కలుద్దాం
. వర్సిటీల పేర్ల మార్పిడిపై రాజకీయాలు తగవు
. శాసనసభలో సీఎం రేవంత్‌ రెడ్డి

విశాలాంధ్ర – హైదరాబాద్‌: రాష్ట్రంలో మేధావులు, వివిధ రాజకీయ పక్షాలు, బీసీ సంఘాలందరినీ సంప్రదించిన తరువాతే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే బిల్లును తీసుకొచ్చామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. సభా నాయకుడిగా బీసీ రిజర్వేషన్ల సాధనకు తాను నాయకత్వం వహిస్తానని చెప్పారు. ఈ విషయంలో అఖిలపక్షంగా అందరం కలిసికట్టుగా వెళ్లి ప్రధానిని కలుద్దామన్నారు. బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంచేందుకు అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకుందామని పేర్కొన్నారు. ప్రధాని మోదీ కలిసేందుకు అనుమతి ఇప్పించాలని కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌, బీజేపీ సభాపక్షనాయకుడిని కోరారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ శాసనసభలో సోమవారం బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ బిల్లు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతామని రాహుల్‌ గాంధీ ఆనాడు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. మేం బాధ్యతలు చేపట్టగానే ఫిబ్రవరి నాల్గోతేదీ, 2024 లో బీసీ కులగణన ప్రక్రియను మొదలు పెట్టామని తెలిపారు. బీసీ రిజర్వేషన్లు 37 శాతానికి పెంచాలని గత ప్రభుత్వం గవర్నర్‌ కు ప్రతిపాదన పంపించిందని వివరించారు. బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంచేందుకు గత ప్రభుత్వం గవర్నర్‌ కు పంపిన ప్రతిపాదనను ఉపసంహరించుకుని కొత్త ప్రతిపాదన పంపిస్తున్నామని వెల్లడిరచారు. ‘సామాజిక న్యాయం రోజు’గా సభ ద్వారా తీర్మానం చేశామన్నారు.
రాహుల్‌ గాంధీని కూడా కలిసి పార్లమెంట్‌ లో ఈ అంశాన్ని ప్రస్తావించాలని కోరదామని అన్నారు. కులసర్వేలో పొందుపరిచిన బీసీల లెక్క వందశాతం సరైందని తెలిపారు. బీసీ బిల్లును పార్లమెంటులో ఆమోదించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రమించేది లేదని స్పష్టం చేశారు. పొట్టి శ్రీరాములు చేసిన కృషిని ఎవరూ తక్కువగా చూడటంలేదని, వారి ప్రాణత్యాగాన్ని గుర్తించి అందరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీకి కాళోజీ పేరు పెట్టుకున్నాం అంటే ఇది ఎన్టీఆర్‌ ను అగౌరవపరిచినట్టు కాదన్నారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీకి ప్రొఫెసర్‌ జయశంకర్‌ పేరు పెట్టుకున్నాం, వైఎస్‌ పేరుతో ఉన్న హార్టికల్చర్‌ వర్సిటీకి కొండా లక్ష్మణ్‌ బాపూజీ పేరు పెట్టుకున్నాం, వెంకటేశ్వర వెటర్నరీ వర్సిటీకి పీవీ పేరు పెట్టుకున్నాం, ఇందులో భాగంగానే పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాప్‌ రెడ్డి పేరు పెట్టుకున్నామని వివరించారు. ఉమ్మడి ఏపీలో పాత పేర్లతో కొనసాగుతున్న యూనివర్సిటీలకు తెలంగాణలో పేర్లు మార్చుకున్నామని చెప్పారు. విశాల ప్రయోజనాల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు, బాధ్యతాయుత పదవుల్లో ఉన్నవారు కులాన్ని ఆపాదిస్తున్నారని మండిపడ్డారు. కుల, మత ప్రాతిపదికన విభజించి రాజకీయ ప్రయోజనాలు పొందాలనుకుంటే అది తప్పన్నారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టుకుందామని అన్నారు. చిత్తశుద్ధి ఉంటే కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌ కేంద్రం నుంచి అనుమతులు తీసుకురావాలన్నారు. బల్కంపేట నేచర్‌ క్యూర్‌ ఆసుపత్రికి రోశయ్య పేరు పెట్టుకుందాం, రోశయ్య సేవలను కీర్తించుకునేలా అక్కడ వారి విగ్రహాన్ని ఆవిష్కరించుకుందామన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు