. ఐ-ప్యాక్ కార్యాలయంలో తనిఖీలు
. అడ్డుకున్న బెంగాల్ సర్కారు
. పోలీసులతో కలిసి ఫైళ్లు తీసుకెళ్లిన సీఎం
. హైకోర్టును ఆశ్రయించిన దర్యాప్తు సంస్థ
. ఇది రాజకీయ కక్షసాధింపు: మమత
కోల్‌కతా: బొగ్గు అక్రమ రవాణా కేసులో పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఐపాక్ సంస్థపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం దాడులు చేసింది. ఐపాక్ అధినేత ప్రతీక్ జైన్ నివాసంలో తనిఖీలను సీఎం మమతా బెనర్జీ అడ్డుకున్నారు. సోదాలు జరుగుతున్న సమయంలో పోలీసులతో కలిసి ఆమె అక్కడకు చేరుకొని, ఫైళ్లు, సెల్‌ఫోన్ తీసుకొని వెళ్లిపోయారు. ఇది చర్చనీయాంశంగా మారింది. సీఎం తీరుపై దర్యాప్తు సంస్థ అభ్యంతరం తెలిపింది. కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత నుంచి బెంగాల్ ప్రభుత్వం, తృణమూల్ కాంగ్రెస్‌తో కలిసి రాజకీయ సలహాదారు సంస్థ ఐపాక్ పనిచేస్తున్నది. టీఎంసీ ఐటీ సెల్ చీఫ్‌గా ప్రతీక్ జైన్ వ్యవహరిస్తున్నారు. ఐపాక్ కార్యాలయంపై ఈడీ దాడి చేసినప్పుడు సీఎం జోక్యం చేసుకోవడంతో దర్యాప్తు అధికారులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారాన్ని శుక్రవారం జస్టిస్ సూర్వ ఘోష్ విచారించనున్నారు. ‘ముఖ్యమంత్రి మమతా బెనర్జీ… ప్రతీక్ జైన్ ఇంటికి వచ్చి పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు సహా కొన్ని ఆధారాలను తీసుకెళ్లిపోయారు. అనంతరం మమతా బెనర్జీ కాన్వాయ్ ఐపాక్ కార్యాలయానికి చేరుకున్నది. అక్కడ నుంచి కూడా పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను సీఎం, ఆమె సహచరులు, పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారు’ అని ఈడీ పేర్కొంది. ఆధారాలు ఉండటంతోనే తనిఖీలు చేపట్టినట్టు వెల్లడిరచింది. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి తన అధికారాన్ని దుర్వినియోగించారని, బలవంతంగా ఫైళ్లు తీసుకెళ్లారని ఆరోపించింది. తమ తనిఖీలకు రాజకీయ పార్టీ లేక సంస్థకు సంబంధం లేదని తెలిపింది. ‘బొగ్గు కుంభకోణానికి సంబంధించి దిల్లీలో నాలుగు చోట్ల, బెంగాల్‌లో ఆరు చోట్ల సోదాలు చేశాం. హవాలా డబ్బు నేపథ్యంలో దాడులు చేశామే కానీ ఎన్నికలు లక్ష్యంగా కాదు’ అని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తన స్టేట్‌మెంట్‌లో వెల్లడిరచింది. హోంమంత్రి దుర్మార్గం: మమత కోల్‌కతాలో ఈడీ దాడులను మమతా బెనర్జీ తీవ్రంగా ఖండిరచారు. ఇది లా ఎన్‌ఫోర్స్‌మెంట్ కాదు రాజకీయ కక్షసాధింపు అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశ రక్షకుడిగా కాకుండా అత్యంత దుర్మార్గమైన హోంమంత్రిగా అమిత్‌షా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఈడీ తనిఖీలు రాజకీయ ప్రేరేపితమని, రాజ్యాంగ విరుద్ధమని, అత్యంత దురదృష్టకరమని విమర్శించారు. రాజకీయ పార్టీల ఐటీ చీఫ్‌ల ఇళ్లపై దాడులు చేయించడం కేంద్ర హోంమంత్రి పనా అని మమత ప్రశ్నించారు. ఇది రాజకీయ కక్షసాధింపు కాకపోతే మరేమిటని నిలదీశారు. టీఎంసీ హార్డ్ డిస్క్‌లు, అంతర్గత పత్రాలు, సున్నిత సంస్థాగత డేటాను స్వాధీనం చేసుకోవడానికి ఈడీ అధికారులు యత్నించారని ఆరోపించారు. ‘టీఎంసీ ఐటీ చీఫ్ ఇంటిని సోదా చేశారు. మా పార్టీ పత్రాలు, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకుంటున్నారు. అందులో అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలు, మా అభ్యర్థుల వివరాలు ఉన్నాయి. వాటన్నింటిని నేను తెచ్చుకున్నాను’ అని మమతా బెనర్జీ మీడియాకు వెల్లడిరచారు. తమను బెదిరించడం కోసం కేంద్రం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. తమ పార్టీ వ్యూహం, ప్రణాళికలకు సంబంధించిన హార్డ్ డిస్క్‌ను తీసుకునేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ పార్టీల అంతర్గత పత్రాలను సేకరించడం ఈడీ పనా అని మమత ప్రశ్నించారు. కాగా, అక్రమ లావాదేవీలు, బొగ్గు స్మగ్లింగ్ కేసుకు సంబంధించి అనేక చోట్ల తనిఖీలు నిర్వహించామేగానీ ఏ పార్టీ కార్యాలయాన్ని సోదా చేయలేదని దర్యాప్తు సంస్థ వెల్లడిరచింది. తాము చేపట్టిన తనిఖీలకు ఎన్నికలతో ఎలాంటి సంబంధం లేదని, కేవలం మనీలాండరింగ్ నేపథ్యంలోనే దాడులు జరిగాయని ఈడీ తెలిపింది. సీఎం ఎందుకు వెళ్లారు: విపక్షాలు బెంగాల్ ముఖ్యమంత్రి తీరును అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి తప్పుపట్టారు. సీఎంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఈడీని డిమాండ్ చేశారు. తనిఖీల వేళ స్వయంగా ముఖ్యమంత్రి వెళ్లాల్సిన పని ఏమిటని ప్రశ్నించారు. రాజ్యాంగానికి, చట్టానికి అతీతమని ఆమె అనుకుంటున్నారా అంటూ బీజేపీ సిద్ధాంతకర్త స్వపన్ దాస్ గుప్తా దుయ్యబట్టారు. కాంగ్రెస్ బెంగాల్ అధ్యక్షుడు సుభాంకర్ సర్కార్ కూడా మమతా బెనర్జీ చర్యను ప్రశ్నించారు. ‘ఈడీ దాడులు జరుగుతుండగా పోలీసు కమిషనర్‌తో కలిసి ఐపాక్ కార్యాలయానికి సీఎం ఎందుకు వెళ్లారు? అదొక ప్రైవేటు సంస్థ. తనిఖీలు జరుగుతుండగానే ఫైళ్లను ఎలా తెచ్చుకున్నారు? ఇందుకు ఏ చట్టం అనుమతిస్తుంది? ఈడీ అధికారులు ఆమెను అలా ఎలా వదిలేశారు? ఇది అవగాహన రాజకీయం కాదా?’ అంటూ వరుస ప్రశ్నలు సంధించారు. బెంగాల్ ద్వంద్వ రాజకీయానికి ఇది మరొక ఉదాహరణ… దీదీ (మమత), మోదీ (ప్రధాని) కలిసి ప్రజలను మోసం చేసేందుకు యత్నిస్తున్నారని కాంగ్రెస్ నేత వ్యాఖ్యానించారు.
తనిఖీల వేళ ఇంట్లో చోరీ
పోలీసులకు జైన్ కుటుంబం ఫిర్యాదు
కోల్‌కతా: ఈడీ సోదాల వేళ తమ ఇంట్లో చోరీ జరిగిందని ఐపాక్ అధినేత ప్రతీక్ జైన్ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనిఖీలు గురువారం ఉదయం 6 గంటలకు మొదలయ్యాయి. మొత్తం తొమ్మిది గంటల పాటు సోదాలు జరిగాయి. మధ్యాహ్నం 3 గంటలప్పుడు లౌడన్ వీధిలోని జైన్ ఇంటి నుంచి ఈడీ అధికారులు వెళ్లిపోయారు. ఇది జరిగిన కొద్ది సేపటికి షేక్స్పియర్ శరణి పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఈడీ తమ ఇంట్లో చేరీ చేసినట్లు ప్రతీక్ జైన్ భార్య ఫిర్యాదు చేశారు. కీలక పత్రాలను దొంగలించినట్లు ఆరోపించారు. ఈ ఫిర్యాదు క్రమంలో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. కాగా, పోలిటికల్ యాక్షన్ కమిటీ (ఐపాక్) తృణమూల్ కాంగ్రెస్‌కు రాజకీయపరంగా సలహాలు ఇవ్వడమే కాకుండా ఆ పార్టీ ఐటీ`మీడియా కార్యకలాపాలను చూసుకుంటుంది.లౌడన్ వీధిలోని ప్రతీక్ జైన్ ఇల్లు, సాల్ట్ లేక్‌లోని కార్యాలయం సహా ఆరు చోట్ల… దిల్లీలో మరో నాలుగు చోట్ల మొత్తం 10 ప్రాంతాల్లో కేంద్ర పారామిలటరీ సిబ్బంది సమక్షంలో ఈడీ సోదాలు జరిగాయి. అయితే, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న దృష్ట్యా ఈడీ దాడులు రాజకీయంగా దుమారం రేపాయి. మరోవైపు సీఎం మమత జోక్యం నాటకీయ పరిణామాలకు దారితీసింది.


