Thursday, April 3, 2025
Homeవిశ్లేషణబెంగాల్‌లో వామపక్ష ఫ్రంట్‌

బెంగాల్‌లో వామపక్ష ఫ్రంట్‌

ఆర్వీ రామారావ్‌
కేరళలో మొట్ట మొదటి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని 1959లో అధికారం నుంచి తొలగించిన తరవాత పశ్చిమ బెంగాల్‌, త్రిపుర రాష్ట్రాలలో సుదీర్ఘ కాలం వామపక్ష ఫ్రంట్‌ ప్రభుత్వాలు కొనసాగాయి. పశ్చిమ బెంగాల్‌లో వామపక్ష ఫ్రంట్‌ 1977 నుంచి మొదలుకుని 2011 దాకా వరసగా ఏడు విడతలు అధికారంలో ఉంది. మొదటి అయిదు ప్రభుత్వాలలో జ్యోతిబసు ముఖ్యమంత్రిగా ఉంటే తరవాత రెండు విడతలు బుద్ధదేవ్‌ భట్టాచార్య ముఖ్యమంత్రిగా ఉన్నారు. వరసగా ఒకే వ్యక్తి అయిదు సార్లు జ్యోతిబసు ముఖ్యమంత్రిగా ఉండడం మన పార్లమెంటరీ చరిత్రలోనే రికార్డు. ఈ ప్రభుత్వాలలో సీపీఐ(ఎం) ఆధిపత్యం ఉండేది. మొదట 1977లో బెంగాల్‌లో వామపక్ష ఫ్రంట్‌ ఏర్పడినప్పుడు సీపీఐ(ఎం), అఖిల భారత ఫార్వర్డ్‌ బ్లాక్‌, రెవల్యూషనరీ సోషలిస్ట్‌ పార్టీ, మార్క్సిస్ట్‌ ఫార్వర్డ్‌ బ్లాక్‌, రెవల్యూషనరీ కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా, విప్లవి బాంగ్లా కాంగ్రెస్‌ వామపక్ష ఫ్రంట్‌లో భాగస్వామ్య పక్షాలుగా ఉండేవి. ఆ తరవాత భారత కమ్యూనిస్టు కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) చేరింది. 2011లో పశ్చిమ బెంగాల్‌ శాసనసభ ఎన్నికలలో వామపక్ష ఫ్రంట్‌ మెజారిటీ సాధించలేక పోయింది.
వామపక్ష ఫ్రంట్‌ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఏర్పడిరది. అంతకు ముందు కూడా యునైటెడ్‌ లెఫ్ట్‌ ఫ్రంట్‌, పీపుల్స్‌ యునైటెడ్‌ లెఫ్ట్‌ ఫ్రంట్‌ లాంటివి ఉండేవి. ఇవి 1967 నుంచి 1971 దాకా అస్తిత్వంలో ఉన్నాయి. 1977 లోక్‌సభ ఎన్నికలకు ముందు కేవలం వామపక్ష పార్టీలతోనే ఫ్రంట్‌ ఏర్పాటు చేసింది. అంతకు ముందు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మధ్యేమార్గ పార్టీలతో కలిపి ఏర్పాటు చేసిన ఫ్రంట్‌ల అనుభవం రీత్యా కేవలం వామపక్ష ఫ్రంట్‌ ఏర్పాటు చేయాలని అనుకున్నారు. ఎమర్జెన్సీ సమయంలో తీవ్ర అణచివేత ధోరణి కొనసాగింది. 1977 జనవరిలో ఎమర్జెన్సీ తొలగించారు. ఆ తరవాతే వామపక్ష ఫ్రంట్‌ ఏర్పడిరది. మొదట ఆరు పార్టీలతో ఏర్పడిన వామపక్ష ఫ్రంట్‌ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది. వర్కర్స్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా కూడా వామపక్ష ఫ్రంట్‌లో చేరాలనుకున్నా ఆ పార్టీని చేర్చుకోలేదు.
1977 లోక్‌సభ ఎన్నికలలో బెంగాల్‌లోని మొత్తం 42 స్థానాలలో వామపక్ష ఫ్రంట్‌ 26 స్థానాలకు పోటీ చేసింది. ఆ ఎన్నికలలో సీపీఐ(ఎం) 20 సీట్లు, ఫార్వర్డ్‌ బ్లాక్‌ మూడు, ఆర్‌.ఎస్‌.పి. మూడు స్థానాలకు పోటీ చేశాయి. సీపీఐ(ఎం) 17 స్థానాల్లో, ఫార్వర్డ్‌ బ్లాక్‌, ఆర్‌.ఎస్‌.పి. మూడేసి స్థానాల్లో గెలిచాయి. 1977 జూన్‌లో బెంగాల్‌ శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు జనతా పార్టీతో పొత్తు కుదరలేదు. జనతా పార్టీకి 52 శాతం సీట్లు కేటాయిస్తామని, జనతా పార్టీ నాయకుడు ప్రఫుల్ల చంద్రసేన్‌కు ముఖ్యమంత్రి పదవి ఇస్తామని సీపీఐ(ఎం) ప్రతిపాదించింది. కానీ జనతా పార్టీ 56 శాతం సీట్లు కావాలని ప్రతిపాదించింది. అందువల్ల వామపక్షఫ్రంట్‌ ఒంటరిగా పోటీ చేయాలనుకుంది. సీపీఐ(ఎం) 224 సీట్లకు, ఫార్వర్డ్‌ బ్లాక్‌, 36, ఆర్‌.ఎస్‌.పి. 23 స్థానాలకు, ఎం.ఎఫ్‌.బి. 3 సీట్లకు, ఆర్‌.సి.పి.ఐ. 4 స్థాలకు, బి.బి.సి. 2 స్థానాలకు పోటీ చేశాయి. బెంగాల్‌ శాసనసభలో మొత్త 294 సీట్లు ఉంటే వామపక్ష ఫ్రంట్‌ 231 స్థానాల్లో విజయం సాధించింది. ఇందులో సీపీఐ(ఎం)కు 178 సీట్లు, ఫార్వర్డ్‌ బ్లాక్‌కు 25, ఆర్‌.ఎస్‌.పి.కి 20, ఎం.ఎఫ్‌.బికి 3, ఆర్‌.సి.పి.ఐ.కి 3, ఇండిపెండెంట్‌కు ఒక స్థానం దక్కాయి. వామపక్ష ఫ్రంట్‌కు పోలైన ఓట్లలో 45.8శాతం ఓట్లు దక్కాయి. ఈ విజయం వామపక్ష ఫ్రంట్‌నే ఆశ్చర్యపరిచింది.
1977 జూన్‌ 21న జ్యోతిబసు ముఖ్యమంత్రిగా వామపక్ష ఫ్రంట్‌ ప్రభుత్వం ఏర్పడిరది. ఈ ప్రభుత్వం మొదటి మంత్రివర్గ సమావేశంలోనే రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని నిర్ణయించింది. 1977 ఎన్నికల తరవాత సోషలిస్టు పార్టీ వామపక్ష ఫ్రంట్‌ లో చేరింది. వామపక్ష ఫ్రంట్‌ ప్రభుత్వం ఏర్పడకముందు బెంగాల్‌లో అల్లకల్లోల పరిస్థితి ఉండేది. ఈ పరిస్థితి చక్కదిద్దడానికి వామపక్ష ఫ్రంట్‌ చాలా శ్రమించవలసి వచ్చింది. పెట్టుబడిదారీ వ్యవస్థలోనే కమ్యూనిస్టు ప్రభుత్వం నడపడం కూడా సవాలుగా తయారైంది. బెంగాల్‌లో పెట్టుబడులు పెట్టడం కోసం బహుళ జాతి గుత్త సంస్థలను ఆహ్వానించడం వామపక్ష ఫ్రంట్‌లోని చిన్న భాగస్వామ్య పక్షాలకు మింగుడు పడలేదు.
భూసంస్కరణలు, పరిపాలనను వికేంద్రీకృతం చేయడం మీద వామపక్ష ఫ్రంట్‌ ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. 1977 సెప్టెంబర్‌ 29న బెంగాల్‌ భూ (సవరణ) బిల్లు ఆమోదించారు. 1967లోనే హరే కృష్ణ కోనార్‌, వినయ్‌ చౌదరి నాయకత్వంలోని కౌలు రైతులకు వారు సాగు చేసే భూమిపై వారసత్వ హక్కు కల్పించారు. 1978 జూన్‌ 4న మూడు దొంతరుల పంచాయతీ వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఆ తరవాత జరిగిన ఎన్నికలలో వామపక్ష ఫ్రంట్‌ ఘన విజయం సాధించింది. 1978 నుంచి 1982 మధ్య 15 లక్షల మంది రైతులకు దాదాపు 8 లక్షల ఎకరాల భూమి పంపిణీ చేశారు. 1971లో బంగ్లా యుద్ధం తరవాత ఎదురైన శరణార్థుల సమస్యను కూడా వామపక్ష ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంది. ఆ సమయంలోనె విపరీతమైన వరదలూ వచ్చాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు