Homeవిశ్లేషణభాగస్వామి హక్కుకు భంగమా?

భాగస్వామి హక్కుకు భంగమా?

- Advertisement -

మనిషికి అంతులేని ఆశలు సహజసిద్ధం. వయస్సు పెరిగే కొద్దీ కొన్ని ఆశలు చచ్చిపోతాయి, కొత్త ఆశలు పుట్టుకొస్తాయి. సంపాదన యావలో పడి యుక్తవయస్సులో అనుభవించలేని కోర్కెలను, వ్యవహారాలను వయస్సు మళ్లిన తర్వాత తీర్చుకోవాలని తపనపడతారు. ఇందుకోసం ఒక తరహా మానసిక యుద్ధమే చేస్తూ ఉంటారు.
ఈ విషయంలో ఎదుటవారి హక్కులకు భంగం వాటిల్లినా, ‘తగ్గేదేలే దంటూ దూసుకుపోతూ ఉంటారు. ఇటీవల అత్యంత ప్రమాదకరమైన, నీచమైన, నికృష్టమైన ధోరణి ఒకటి ప్రబలింది. పైగా దీనికి ‘న్యూ ట్రెండ్’ అని పిలుస్తూ సాంప్రదాయ, వైవాహిక వ్యవస్థలను ఊచకోత కోస్తున్నారు. వివరాల్లోకి వెళ్లాం! ‘షుగర్ డాడీ’ లేదా ‘షుగర్ మమ్మీ’ అనే పదాలు ఈ మధ్యకాలంలో తరచుగా వినిపిస్తున్నాయి. ఇది ఒక రకమైన ఆధునిక డేటింగ్ సంస్కృతి. షుగర్ డాడీ లేదా షుగర్ మమ్మీ అంటే ఏమిటి? సాధారణంగా, వయసులో పెద్దవారై, ఆర్థికంగా చాలా బలంగా ఉన్న వ్యక్తులు (ధనికులు) తమకంటే చాలా తక్కువ వయసు ఉన్న వారితో (వీరిని షుగర్ బేబీస్ అంటారు) సంబంధాన్ని కలిగి ఉండటాన్ని ఈ పేరుతో పిలుస్తారు. షుగర్ డాడీ లేదా మమ్మీ అనేవారు అవతలి వ్యక్తికి విలాసవంతమైన బహుమతులు, నగదు,
విదేశీ ప్రయాణాలు లేదా కెరీర్లో సహాయం వంటివి అందిస్తారు. షుగర్ బేబీ అనే వ్యక్తి అందుకు ప్రతిఫలంగా ఆ పెద్దవారికి తోడుగా ఉండటం, డేటింగ్కు వెళ్లడం లేదా శారీరక సాన్నిహిత్యాన్ని పంచుకోవడం వంటివి చేస్తారు. ఇది కేవలం ప్రేమ కోసం కాకుండా, ఒక ఒప్పందంలాగా సాగుతుంది. ఈ సంస్కృతి పెరగడానికి ముఖ్యంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. అందులో మొదటిది ఆర్థిక అవసరాలు. విద్యార్థులు తమ చదువుల కోసం, విలాసవంతమైన జీవనశైలి కోసం లేదా
అప్పులు తీర్చుకోవడం కోసం ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. 60 శాతం కేసులు ఇవే. ఇక రెండోది ఒంటరితనం. సంపన్న వర్గాల్లోని వయసు పైబడిన వారు తమ ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి యువతతో సమయం గడపాలని కోరుకుంటారు. ఇక మూడవది కెరీర్ గ్రోత్. కొందరు యువతీయువకులు పెద్దపెద్ద కంపెనీల సీఈవోలతో లేదా ప్రభావితమైన వ్యక్తులతో పరిచయాల ద్వారా తమ కెరీర్ను త్వరగా వృద్ధి చేసుకోవాలని భావిస్తారు. ఈ సంస్కృతి పాశ్చాత్య దేశాలలో మొదలైనప్పటికీ, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. షుగర్ డేటింగ్ సంస్కృతి అత్యధికంగా ఉన్న దేశం అమెరికా. కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాల్లో కూడా ఈ ధోరణి చాలా ఎక్కువ. మన ఆసియా ఖండానికి వస్తే, ఇటీవలి నివేదికల ప్రకారం మలేషియా, ఇండోనేషియా, థాయిలాండ్లో ఈ సంస్కృతి వేగంగా పెరుగుతోంది. భారత్ పైనా దీని ప్రభావం లేకపోలేదు. భారతదేశంలో కూడా ఈ ట్రెండ్ వేగంగా పుంజుకుంటోంది. ముఖ్యంగా మెట్రో నగరాలైన ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్లో ఈ సంస్కృతి కనిపిస్తోంది. ఒక నివేదిక ప్రకారం, హైదరాబాద్లో దాదాపు 10,000 కంటే ఎక్కువ మంది షుగర్ డాడీలు డేటింగ్ యాప్లలో రిజిస్టర్ అయి ఉన్నారని సమాచారం. ఈ షుగర్ డాడీ, మమ్మీల సంస్కృతి ప్రభావం వల్ల మానసిక సమస్యలు తలెత్తుతున్న మాట వాస్తవమే. ఈ సంబంధాలు కేవలం ఆర్థిక లావాదేవీలపై ఆధారపడి ఉండటం వల్ల, తర్వాత కాలంలో మానసిక వేదనకు లేదా సంబంధాల పట్ల అపనమ్మకానికి దారితీయవచ్చు.
కొందరు దీనిని ఆసరాగా చేసుకుని బ్లాక్మెయిల్ చేయడం లేదా నేరాలకు పాల్పడే ప్రమాదం ఉంది. ఈ ధోరణిలో చట్టపరమైన చిక్కులూ ఉన్నాయి. భారతదేశంలో ఇది వ్యభిచారం కిందికి వస్తుందా లేదా అనే దానిపై స్పష్టమైన చట్టాలు లేవు, కానీ అనైతిక కార్యకలాపాలకు దారితీస్తే చట్టపరమైన ఇబ్బందులు తప్పవు. ఇది చాలా ముఖ్యమైన, సున్నితమైన అంశం. అనునిత్యం కుటుంబంలో అగ్నిజ్వాలలను రగిలించే సమస్య. వివాహ బంధంలో ఉన్న వ్యక్తులు ఇలాంటి ‘షుగర్’ డేటింగ్ వంటి
సంబంధాలలోకి ప్రవేశించినప్పుడు, అది వారి సొంత కుటుంబంపై, భార్య లేదా భర్తపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. దీనిని మనం కొన్ని కోణాల్లో అర్థం చేసుకోవచ్చు. ప్రధాన భాగస్వామిపై ప్రభావం ఎక్కువ. వివాహ బంధానికి మూలాధారం నమ్మకం. ఇటువంటి రహస్య సంబంధాలు వెలుగులోకి వచ్చినప్పుడు, జీవిత భాగస్వామికి కలిగే మానసిక వేదన అపారమైనది. ఏళ్ల తరబడి గూడుకట్టుకున్న నమ్మకం ఒక్క క్షణంలో కూలిపోతుంది. ఇక ఆర్థికపరమైన నష్టాలూ అనివార్యం.
కుటుంబానికి, పిల్లల భవిష్యత్తుకు లేదా ఉమ్మడి లక్ష్యాల కోసం దాచుకున్న డబ్బును, ఇటువంటి బయటి సంబంధాల కోసం ఖర్చు చేయడం వల్ల కుటుంబం ఆర్థికంగా దెబ్బతింటుంది.
ఇది భార్యాభర్తల మధ్య కలహాలకు దారితీస్తుంది. భావోద్వేగ దూరం అనేది కనీకన్పించని అతిపెద్ద సమస్య. తన భాగస్వామికి బదులుగా మరొక వ్యక్తికి సమయం, ప్రేమ, శ్రద్ధ కేటాయించడం వల్ల, అసలైన భాగస్వామి ఒంటరితనాన్ని అనుభవిస్తారు. ఇది వారి మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అలాగే, కుటుంబ విచ్ఛిన్నం సహజం. ఇటువంటి సంబంధాలు తరచుగా విడాకులకు, విడిపోవడానికి లేదా సుదీర్ఘమైన చట్టపరమైన పోరాటాలకు దారితీస్తాయి. ఇది పిల్లల
మనస్తత్వంపై కూడా చాలా ప్రతికూల ప్రభావం చూపుతుంది. అసలు సిసలు చర్చనీయాంశం ఏమిటంటే, ఈ తరహా ‘అనుబంధాలు’ స్వంత జీవిత భాగస్వామి హక్కులను కాలరాస్తుందా? ఏతావాతా చెప్పేదేమిటంటే, ఇది కచ్చితంగా హక్కుల భంగమే. ఎందుకంటే, భారతీయ చట్టం, సామాజిక దృక్పథం ప్రకారం, వివాహం అనేది ఒక పవిత్రమైన ఒప్పందం. ఇందులో భాగస్వామికి కొన్ని హక్కులు ఉంటాయి. షుగర్ డేటింగ్ వంటివి ఈ హక్కులకు భంగం కలిగిస్తాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ప్రధానంగా వైవాహిక విధేయత కోల్పోవలసి ఉంటుంది. వివాహంలో ఇద్దరూ ఒకరికొకరు నమ్మకద్రోహం చేయకూడదనేది ఒక నైతిక, చట్టపరమైన అంగీకారం కుదురుతుంది. ఈ నియమాన్ని ఉల్లంఘించడం అంటే భాగస్వామి గౌరవానికి, హక్కుకు భంగం కలిగించడమే. లోతుగా పరిశీలిస్తే, చట్టపరమైన హక్కులూ ఉన్నాయి. భారతదేశంలో, వివాహేతర సంబంధం అనేది విడాకులు తీసుకోవడానికి ఒక బలమైన చట్టపరమైన కారణం. మీరు మీ భాగస్వామికి ద్రోహం చేస్తున్నప్పుడు, వారి హక్కును మీరు కాలరాస్తున్నట్లే లెక్క. ఆస్తి, భద్రతాంశాలూ ప్రమాదంలో పడతాయి. కుటుంబం ఉమ్మడిగా సంపాదించిన ఆస్తులు లేదా వనరులను బయటి వ్యక్తుల కోసం దుర్వినియోగం చేయడం, కుటుంబ ఆర్థిక భద్రతకు హక్కు కలిగిన భాగస్వామికి, పిల్లలకు తీరని అన్యాయం చేయడమే. అది షుగర్ డేటింగ్ కావచ్చు లేదా మరొకటి కావచ్చు. ఏ పేరుతో పిలిచినా తన జీవిత భాగస్వామికి తెలియకుండా మరొకరితో సంబంధాన్ని కొనసాగించడం అనేది నైతికపరంగా ద్రోహం, చట్టపరంగా తప్పు. ఇది కేవలం వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒకరి జీవితంతో ముడిపడి ఉన్న బాధ్యతలను విస్మరించడమే.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు