Homeవిశ్లేషణఅమెరికాతో అంటకాగినందుకు పశ్చాత్తాపం!

అమెరికాతో అంటకాగినందుకు పశ్చాత్తాపం!

- Advertisement -

కన్వల్ సిబల్
యుఏఈ, ఖతార్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఒమన్ వంటి దేశాల్లోని సైనిక స్థావరాలు, ఇతర ప్రాంతాలపై ఇరాన్ దాడులు చేస్తోంది. అమెరికా తమను
కాపాడుతుందని భావించిన ఈ దేశాలకు, ఇప్పుడు తాము అమెరికా రక్షణలో లేమనే చేదు నిజం అర్థమవుతోంది. ఇరాన్ అత్యున్నత నాయకుడు అలీ ఖమేనీని
అమెరికా అత్యంత దారుణంగా చంపేసింది. ఈ రాజకీయ హత్య మధ్యప్రాచ్యంలో ఒక తీవ్రమైన పరిణామం. ఇరాన్ అమెరికాపై ఎటువంటి దాడి చేయలేదు, అయినప్పటికీ దాని అగ్రనేతను, జనరల్స్ను భౌతికంగా తొలగించారు. అలాగని, ఇరాన్ అమెరికాపై గానీ, ఇజ్రాయెల్పై గానీ ఎటువంటి సైనిక దాడులకు ముందస్తు వ్యూహరచన చేయలేదు, కాబట్టి ‘ముందస్తు’ దాడికి ఆ దేశాలకు ఎటువంటి సమర్థన లేదు. అంతేకాదు, ఓ వైపు ఒమన్ మధ్యవర్తిత్వంతో అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు చాలా ఫలప్రదంగా జరుగుతున్నాయి. అమెరికా దాడిని నివారించడానికి ఒమన్ విదేశాంగ మంత్రి ఒక అమెరికన్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఇరాన్ తన అణు కార్యక్రమం, నిల్వలు, ఐఏఈఏ తనిఖీలు, అణ్వాయుధాలను ఎప్పటికీ పొందబోమని అధికారికంగా వాగ్దానం చేయడం వంటి అమెరికా డిమాండ్లన్నింటినీ అంగీకరించిందని చెప్పారు. 2015లో ఒబామాతో జరిగిన అణు ఒప్పందం కంటే ఇరాన్ ఎక్కువ రాయితీలు ఇచ్చిందని కూడా చెప్పుకొచ్చారు. ఈ చర్చల్లో ఐఏఈఏ చీఫ్ కూడా పాల్గొన్నారు. జెనీవాలో సాంకేతిక స్థాయి చర్చల తదుపరి రౌండ్ జరగాల్సి ఉంది. కానీ ఈలోగానే చర్చలు జరగకముందే, అధ్యక్షుడు
ట్రంప్ దౌత్యపరమైన ప్రయత్నాలను పక్కనపెట్టి ఇరాన్పై దాడి చేయాలని నిర్ణయించుకున్నారు. చర్చలు జరుగుతున్న సమయంలో ట్రంప్ ఇరాన్పై దాడి చేయడం ఇది రెండోసారి. గతంలో 2025 జూన్లో చర్చలు జరుగుతుండగానే 12 రోజుల యుద్ధాన్ని ట్రంప్ ప్రారంభించారు. అమెరికా ద్వంద్వ ప్రమాణాలు : ఇరాన్ అణు సమస్యను సరైన దృక్కోణంలో చూడాలి. ఇరాన్ ‘అణు వ్యాప్తి నిరోధక ఒప్పందం’ (ఎన్పీటీ)పై సంతకం చేసిన దేశం. ఈ నిబంధనల ప్రకారం, శాంతియుత ప్రయోజనాల కోసం యురేనియంను సుసంపన్నం చేసే హక్కు ఇరాన్కు ఉంది. ఈ హక్కును వదులుకోవడానికి ఇరాన్
ఇష్టపడలేదు. అయితే అమెరికాతో జరిగిన తాజా చర్చల్లో అది ఎన్ఎచ్మెంట్ పరిమితులపై రాయితీలు ఇచ్చింది. ఇదివరకు ఎప్పుడూ చేయని పనిని ఇప్పుడు చేసింది. ఇదంతా పక్కన పెడితే, ఇజ్రాయెల్ అణుశక్తిగా ఉండటాన్ని అమెరికా భరించలేదనేది బహిరంగ రహస్యం. ఎన్పీటీని తిరస్కరించి అణ్వాయుధాలు పొందిన ఉత్తర కొరియాను కూడా అమెరికా అంగీకరించింది. పాకిస్తాన్ అణుశక్తిగా మారడంలో అమెరికా పాత్ర ఉంది. పాకిస్తాన్-చైనాల మధ్య కొనసాగుతున్న అణు సహకారంపై కూడా అమెరికా ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. రష్యాతో కుదుర్చుకున్న అన్ని నిరాయుధీకరణ ఒప్పందాల నుండి అమెరికా తప్పుకుంది. అణు పరీక్షలను పునఃప్రారంభిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో, ఐఏఈఏ పర్యవేక్షణలో ఉన్న ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా దృష్టి సారించడం,
ప్రధానంగా ఇజ్రాయెల్ భద్రత, ప్రాంతీయ ఆధిపత్యం కోసం చేస్తున్నట్లు కనిపిస్తోంది. 2025 జూన్లో 12 రోజుల యుద్ధ సమయంలో, అమెరికా ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిర్వీర్యం చేసిందని ట్రంప్ ప్రకటించారు. అలాంటప్పుడు, ఇప్పుడు ఇరాన్ అణు సమస్యను యుద్ధానికి కారణంగా ఎందుకు చూపుతున్నారు? ఇదొక సాకు మాత్రమే.
అణ్వాయుధాలు ఎక్కడ ఉన్నాయి? ఇరాన్ అణ్వాయుధాలను పొందడానికి కొన్ని నెలలు లేదా కొన్ని వారాల సమయం మాత్రమే పడుతుందని ఇజ్రాయెల్, అమెరికా చాలా కాలంగా ఒక కథనాన్ని ప్రచారం చేస్తున్నాయి. అయితే, ఇరాన్ అణ్వాయుధాలు పొందకుండానే సంవత్సరాలు గడిచిపోయాయి. రహస్య కేంద్రాల్లో ఇరాన్ అణు కార్యక్రమాన్ని చేపడుతోందన్న ఆరోపణలు ఎన్నడూ నిరూపితం కాలేదు. నిస్సందేహంగా, ఇరాన్ ఎన్రెప్ర్మెంట్ స్థాయిలను పెంచింది. బహుశా ఇది ఒక
చర్చల వ్యూహం కావచ్చు. ట్రంప్ తన మొదటి పదవీకాలంలో ‘జేసీపీఓఏ’ (జాయింట్ కాంప్రెహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్) నుంచి తప్పుకున్నందుకు ఇది ఒక దశలవారీ ప్రతిస్పందన కావొచ్చు. ఆంక్షల నుంచి ఉపశమనం పొందేందుకు చర్చల్లో బేరసారాల కోసం తన పెరుగుతున్న ఎమెంట్ సామర్థ్యాన్ని ఇరాన్ ఒక
సాధనంగా ఉపయోగించుకోవాలని అనుకొని ఉండవచ్చు.
ఏ దేశానికైనా స్వీయరక్షణ అనివార్యం : ఒబామా హయాంలో కూడా అమెరికా ఇరాన్ క్షిపణి సామర్థ్యాన్ని, దాని ప్రాంతీయ పాత్రను నియంత్రించాలని డిమాండ్
చేసింది. కాకపోతే ఆనాడు ఇరాన్ దాన్ని తిరస్కరించింది. కాబట్టి జేసీపీఓఏ కేవలం అణు సమస్యకే పరిమితమైంది. అయితే, ట్రంప్ ఇటీవల చర్చల్లో ఈ డిమాండ్లను మళ్లీ తెరపైకి తెచ్చారు. ప్రధానంగా ఇజ్రాయెల్పై వినాశకరమైన ప్రభావంతో దాడి చేయగల ఇరాన్ సామర్థ్యం (ఇది 12రోజుల యుద్ధంలో కనిపించింది), హమాస్, హిజ్బుల్లాకు అది ఇస్తున్న మద్దతును దృష్టిలో ఉంచుకుని ఈ డిమాండ్లు చేశారు. ఇక్కడ విషయం ఏమిటంటే, దేశాలు క్షిపణి సామర్థ్యాన్ని కలిగి ఉండటాన్ని నిషేధించే
ఎన్పీటీ వంటి అంతర్జాతీయ ఒప్పంద అమలు అనేది ఏదీ లేదు. ఇరాన్ తన రక్షణ సామర్థ్యాలను వదులుకుంటుందని ఆశించడం అవాస్తవం. ఇక్కడ మంచి, చెడులు లేవు : ఇరాన్ ప్రాంతీయ పాత్ర అమెరికాకు సమస్య అయితే, అమెరికా, ఇజ్రాయెల్ ప్రాంతీయ పాత్రను ఇరాన్ కూడా సమస్యగానే
చూడవచ్చు. ముఖ్యంగా ఇజ్రాయెల్ విస్తరణవాదాన్ని సహించాలని ఏమీ లేదు. వీటిలో మంచి, చెడుల గురించి స్పష్టమైన తీర్పు ఇవ్వలేం. అయితే, ఇజ్రాయెల్కు అతిపెద్ద ప్రత్యర్థిగా, పలస్థీనాకు ప్రధాన మద్దతుదారుగా తనను తాను ప్రదర్శించుకోవడం ద్వారా ఇరాన్ ఒక తీవ్రమైన వ్యూహాత్మక పొరపాటు చేసిందని చెప్పవచ్చు.
అరబ్ దేశాల నాయకులు పలస్తీనియన్లకు ఇచ్చిన మద్దతు కంటే ఇది చాలా ఎక్కువ. అరబ్ దేశాలు ఇజ్రాయెల్ పట్ల బహిరంగంగా లేదా రహస్యంగా ఎక్కువ సానుకూలతను కలిగి ఉన్నాయి. అందువల్ల ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్ను ‘అబ్రహం ఒప్పందాలు’ సూచించే ప్రాంతీయ ఆమోదానికి ప్రధాన అడ్డంకిగా
చూస్తున్నాయి. గల్ఫ్ దేశాల భ్రమలు తొలగాయా? నేలపై సైనిక దళాలను దింపకుండా, ఇరాన్లో పాలన మార్పు తీసుకురావాలని ట్రంప్ అనుకుంటున్న వ్యూహంపై తీవ్ర
అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఇరాక్, లిబియా, సిరియాలలో అమెరికా చేసిన పాలన మార్పులు విఫలమయ్యాయి. అక్కడ రాజకీయ అస్థిరత, విభజనలు, హింస, ఆర్థిక సంక్షోభం, శరణార్థుల సమస్యలు తలెత్తాయి. ఇరాన్ ను అస్థిరపరచడం వల్ల వచ్చే పరిణామాలను ఎదుర్కొనగలమని ట్రంప్, ఆయన సలహాదారులు ఎందుకు అనుకుంటున్నారో అర్థం కావడం లేదు. ఏది ఏమైనా, ఇరాన్ మొదట్నించీ తనపై దాడి జరిగితే, ఈ ప్రాంతంలోని అమెరికా స్థావరాలపై దాడులు చేస్తామని పదేపదే హెచ్చరిస్తూ వచ్చింది. ఈ స్థావరాల వల్ల అమెరికా ప్రాంతీయంగా తన శక్తిని ప్రదర్శిస్తూ వచ్చింది. ఇందులో భాగంగా గల్ఫ్ దేశాలకు ముప్పుగా భావించినందువల్లనే ఇరాన్ నుంచి రక్షణ పేరుతో స్థావరాలను పటిష్టం చేసింది. ఇరాన్ ఇప్పుడు యూఏఈ, ఖతార్, బహ్రెయిన్, సౌదీ అరేబియా,
ఒమన్లలోని స్థావరాలపై దాడులు చేయడం ఆశ్చర్యం కలిగించదు. అయితే, తమకు అమెరికా రక్షణ ఉంటుందని భావించిన ఈ దేశాలకు, ఇప్పుడు అమెరికా శక్తి చాలదని తెలియడం కలవరానికి గురిచేస్తోంది. వారు దీన్ని ఊహించలేదా? ఇరాన్ తమ భూభాగంపై దాడులు చేస్తుందని గల్ఫ్ దేశాలు బహుశా నమ్మకపోవచ్చు. ఇరాన్ కేవలం ఇజ్రాయెల్, ఈ ప్రాంతంలో మోహరించిన అమెరికా దళాలపైనే ప్రతీకారం తీర్చుకుంటుందని వారు భావించారు. యూఏఈ ఈ మధ్యకాలంలో ఇరాన్తో భారీగా వ్యాపారం చేస్తోంది. అక్కడ చాలా మంది ఇరానియన్లు ఉన్నారు. సౌదీ అరేబియా, ఇరాన్ మధ్య రాజకీయ సయోధ్యలో భాగంగా దౌత్య సంబంధాలు గాడిన పడ్డాయి. ఇరాన్ తన మనుగడ
కోసం పోరాడుతోంది కాబట్టి, ఆర్థిక ప్రవాహాలను దెబ్బతీసేందుకు ఆర్థిక కేంద్రాలపై దాడులు చేయడం, విమానాశ్రయాలను మూసివేసేలా డ్రోన్ దాడులు చేయడం వంటివి ఇరానియన్ వ్యూహంలో ఉంటాయని గల్ఫ్ దేశాలు ఊహించలేదు. దీని వల్ల పర్యాటకం, లాజిస్టిక్స్, వస్తువుల రవాణా వంటి ఆర్థిక కార్యకలాపాలకు భారీ నష్టం వాటిల్లుతోంది. ఈ ప్రాంత స్థిరత్వంపైన, పెట్టుబడిదారుల నమ్మకంపై ఇది పెద్ద దెబ్బ. భవిష్యత్ సంక్లిష్టం! తాజా ఇరాన్ దాడుల పరిణామాలు దీర్ఘకాలం ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే గల్ఫ్ దేశాలు భవిష్యత్తులో ఇరాన్ శక్తి నుంచి తమను తాము
మరింత రక్షించుకోవాలని కోరుకుంటాయి. ఎలాంటి భద్రతా ఏర్పాట్లు వస్తాయో స్పష్టంగా లేదు. హోర్ముజ్ జలసంధి మూతపడి, చమురు వాణిజ్యానికి అంతరాయం కలిగితే, చమురు ధరల పెరుగుదల భారత్ వంటి చమురు దిగుమతి చేసుకునే దేశాలకు పెద్ద దెబ్బ అవుతుంది. ఎగుమతులు, చమురు, గ్యాస్ దిగుమతుల విషయంలో భారత్కు అక్కడ భారీ వాటాలు ఉన్నాయి. అక్కడ ఏమి జరిగినా, దాని ప్రభావం మనపై చాలా తీవ్రంగా ఉంటుంది. మనకు ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు
తగ్గడం చాలా ముఖ్యం. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాల దాడి విషయంలో భారత్ నేటికీ మౌనంగా ఉండటం దురదృష్టకరం. ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్యను మనం ఖండించనందున, ఇరాన్పై దాడిని కూడా ఖండించకపోవడం అర్థం చేసుకోదగినదే. ఈ విషయం ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో చర్చకు వస్తుంది. అక్కడ మారుతున్న పరిస్థితుల్లో భారత దౌత్యానికి అగ్నిపరీక్షే!
(రచయిత : టర్కీ, ఈజిప్ట్, ఫ్రాన్స్, రష్యాలకు విదేశాంగ కార్యదర్శి, రాయబారిగా, వాషింగ్టన్లో డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్గా పని చేశారు)

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు