Homeవిశ్లేషణపల్లె గుండెల్లో యుద్ధ మేఘాలు

పల్లె గుండెల్లో యుద్ధ మేఘాలు

- Advertisement -

నగేష్ బూర్తి
అమెరికా-ఇరాన్ యుద్ధం ఉగ్రరూపం దాల్చింది. ఇజ్రాయెల్ జోక్యం చేసుకోవడంతో పరిస్థితి ఇంకా తీవ్రంగా మారింది. ఈ పరిణామాలకు కొన్ని అరబ్ దేశాలు వ్యూహాత్మక స్థావరాలు, సైనిక సౌకర్యాలు అందించడంతో చిచ్చు రాజుకుంది. ఈ దాడులు నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతం అప్రమత్తమయ్యింది. ఈ యుద్ధ శబ్దాలు వేల
కిలోమీటర్ల దూరంలో ఉన్న మన పల్లెల గుండెల్లోనూ మార్మోగుతున్నాయి. అరబ్ దేశాల్లో దాదాపు 90లక్షలకు పైగా భారతీయులు ఉన్నారు. వారిలో 20-25 లక్షల వరకు తెలుగు రాష్ట్రాలకు చెందినవారే అని అంచనా. సౌదీ అరేబియా, ఒమన్, కువైట్, ఖతర్, మెహ్రాన్ వంటి దేశాల్లో కూడా భారతీయులు ఉన్నారు. కువైట్, ఖతర్ వంటి దేశాలకు వెళ్లిన వారిలో గోదావరి జిల్లాలకు చెందిన పేద కుటుంబాల యువకులు, మధ్యవయస్కులు అధిక సంఖ్యలో ఉన్నారు. నాలుగు దశాబ్దాల క్రితం
గల్ఫ్ వలసల ప్రక్రియ మొదలయ్యింది. గత రెండు దశాబ్దాల్లో అది మరింత ఎక్కువయ్యింది. పూట గడవని దుస్థితి, అప్పుల బారిన పడ్డ కుటుంబాలు, చదువు అందని పిల్లలు ఇవన్నీ కలసి వేలాది మంది మహిళలను, యువకులను విదేశీ ఉపాధి బాట పట్టించాయి. ఇంటి పనులు, కట్టడాల నిర్మాణం, చమురు సంస్థల్లో చిన్నచిన్న పనులు చేసుకుంటూ చాలామంది అక్కడే స్థిరపడ్డారు. ఈ వలసల కారణంగా పల్లెల రూపురేఖలు మారిపోయాయి. గల్ఫ్ సంపాదించిన డబ్బులతో కట్టిన ఇళ్ళు ఎక్కువగా ఉభయగోదావరి, కోనసీమ, గుంటూరు-కృష్ణా డెల్టా ప్రాంతాలు, రాయలసీమలోని కడప, కర్నూలు జిల్లాల్లో కనిపిస్తాయి. దాంతో కొన్ని దళితవాడల్లో “కువైట్ ఇల్లు” అనే పదమే స్థిరపడిపోయింది. ఆ సంపాదనతోనే పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు, అమ్మాయిలకు పెళ్లిళ్లు, అప్పుల నుంచి విముక్తి ఇవన్నీ ఆ వలస కథనాల విజయగాథలే. అయితే ఇప్పుడు అదే వలస కుటుంబాలు భయంతో గడుపుతున్నాయి. రెండు రోజులుగా ప్రారంభమైన యుద్ధ పరిణామాలు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. రాత్రంతా మెలకువగా ఉండి ఫోన్ కాల్స్ కోసం ఎదురుచూడటం, వాట్సాప్ వీడియో కాల్స్ ద్వారా అక్కడ పరిస్థితిని అడిగి తెలుసుకోవడం ఇదే ఇప్పుడు వేల కుటుంబాల దైనందిన దృశ్యం. పిల్లలు స్కూల్కి వెళ్లినా, పెద్దలు పనికి వెళ్లినా మనసు మాత్రం గల్ఫ్ చుట్టూనే తిరుగుతోంది. విమానాశ్రయాలు, చమురుశుద్ధి కేంద్రాలు, పోర్టులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. ఈ ప్రాంతాల్లోనే మన వారు ఎక్కువగా పని చేస్తుండటం
ఇక్కడి వారిని ఆందోళనకు గురిచేస్తోంది. ఏం జరుగుతుందో తెలీని భయంలో బతుకుతున్నారు. వదంతులు, అసత్య ప్రచారం కలవరపెడుతున్న ఇలాంటి సమయంలో మీడియా స్పష్టమైన సమాచారం ఇవ్వాలంటూ ఈ కుటుంబాలు కోరుతున్నాయి. ఇక్కడ ప్రశ్న ఒకటే ప్రభుత్వం స్పందన ఎలా ఉండాలి? అని. గతంలో రష్యా, ఉక్రెయిన్ యుద్ధ సమయంలో అక్కడి భారతదేశానికి చెందిన విద్యార్థులను తరలించేందుకు కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టింది. 24 గంటల విరామం కోరుతూ చర్చలు జరిపి, ప్రత్యేక విమానాలు నడిపిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఇప్పుడు కూడా గల్ఫ్ ప్రాంతంలో పరిస్థితి విషమిస్తే ముందస్తు ప్రణాళిక అవసరం. అక్కడ ఉన్న భారతీయులను ఒకచోట చేర్చి, రక్షణ కల్పించి అవసరమైతే దశల వారీగా స్వదేశానికి తరలించే ఏర్పాట్లుచేసే దిశగా ఆలోచన చేయాలి. ఇది
విదేశాంగ సమస్యే కాదు. సామాజిక-ఆర్థిక సమస్య కూడా. గల్ఫ్ పనిచేస్తున్న వారు పేద, కార్మిక వర్గానికి చెందినవారే. వారి సంపాదన ఆగిపోతే కుటుంబాలపై కోలుకోలేని దెబ్బ పడుతుంది. ఉపాధి అవకాశాలు క్షీణిస్తే వెనక్కి తిరిగి రావాల్సి వస్తుంది. ఇరాన్, ఇజ్రాయిల్, అరబ్ దేశాలతో దౌత్యపరమైన చర్చలు కొనసాగిస్తూ అక్కడి వారికి రక్షణ కల్పించేలా ఇక్కడి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. అరబ్ ఎడారుల్లో పేలే ప్రతి బాంబు శబ్దం, పల్లెల్లోనూ ప్రతిధ్వనిస్తోంది. ఆ ప్రతిధ్వనిలో భయం ఉంది, ఆందోళన ఉంది, అనిశ్చితి ఉంది. యుద్ధాలు రాజకీయ నాయకుల నిర్ణయాలతో మొదలవుతాయి కానీ వాటి ప్రభావం సాధారణ ప్రజల జీవితాలపై పడుతుంది. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్రాలు కలిసి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక ప్రకటించాలి. గల్ఫ్ లో ఉన్న భారతీయుల భద్రతపై నిరంతర పర్యవేక్షణ, అవసరమైతే
తక్షణ తరలింపు చర్యలు ప్రారంభించి పల్లె గుండెల్లో రగులుతున్న భయాన్ని తొలగించాలి.
సీనియర్ జర్నలిస్ట్, 7702262666

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు