ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా కలిసి చేస్తున్న కిరాతక దాడి విషయంలో ప్రధానమంత్రి మోదీ ఎటు వైపు ఉన్నారో తేలిపోయింది. ఇరాన్ మీద దాడిని మోదీ ఇప్పటివరకు ఖండించ లేదు. ఇరాన్ అధినేత అలీ ఖామేనీని హతమార్చిన తరవాత మోదీ కనీసం సంతాపం అయినా తెలియజేయలేదు. అంటే ఆయన
నిర్మొహమాటంగా ఇజ్రాయెల్, అమెరికా మొదలుపెట్టిన యుద్ధాన్ని సంపూర్ణంగా సమర్థిస్తున్నట్టే. యుద్ధంలో బాధకు గురవుతున్న ఇరాన్ మీద మోదీకి ఏ మాత్రం చింతలేదు. తరతరాలుగా ఇరాన్తో మనకున్న మైత్రీ బంధం కూడా మోదీకి గుర్తుకు రాలేదు. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం నిలిపివేయించానని బీరాలు పలికిన మోదీ నాలుగు రోజులుగా ఇరాన్ మీద జరుగుతున్న దాడిపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయితే మోదీ ఓ విచిత్రమైన పని చేశారు. సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్, బహ్రేన్ రాజు హమీద్ బిన్ అల్ ఖలీఫాతో సోమవారం రాత్రి ఫోన్ చేసి మాట్లాడారు. ఇజ్రాయెల్, అమెరికా విపరీతంగా బాంబుల వర్షం కురిపిస్తున్నందు వల్ల ఇరాన్ అరబ్బు దేశాలలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై దాడి చేస్తోంది. దాదాపు తొమ్మిది దేశాలలో అమెరికా సైనిక స్థావరాలు ఉన్నాయి.
వీటిని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణులు ప్రయోగిస్తోంది. ఇరాన్ గురి అమెరికా సైనిక స్థావరాల మీదే తప్ప తన చుట్టూ ఉన్న అరబ్ దేశాల మీద కాదు. పర్షియన్ సింధు శాఖ చుట్టూ ఉన్న అరబ్ దేశాలన్నీ ఇస్లాం మతం అనుసరించేవే. ఇరాన్ కూడా ముస్లిం దేశమే. కానీ ఇరాన్ ఒక్కటే పర్షియన్ సింధు శాఖలో అరబ్ దేశం కాదు. అక్కడి అరబ్ దేశాలన్నీ ఎప్పటినుంచో అమెరికాకు బంట్లుగా ఉన్నాయి. ఇరాన్ మొదటి నుంచీ అమెరికా పెత్తనాన్ని ఎదిరిస్తూనే ఉంది. అయినా ఇరాన్కు అరబ్ దేశాలతో శత్రుత్వం ఏమీ లేదు. ఆ దేశాలన్నీ అమెరికాకు దాసోహం అంటున్నా ఇరాన్ అభ్యంతర పెట్టిన ఉదంతాలు లేవు. కానీ ఇప్పుడు అమెరికా కురిపిస్తున్న బాంబుల వర్షం ఇరాన్ మీదే కనక అమెరికా సైనిక స్థావరాల మీద దాడి చేయాలని ఇరాన్ అనుకోవడంలో అసమంజసమైంది ఏమీ లేదు. తనకు ముప్పు ఎదురైనప్పుడు తిరగబడని దేశం ఎక్కడ ఉంటుంది. ఈ క్రమంలో సౌదీఅరేబియా, బహ్రేన్ లాంటి దేశాలకు ఇరాన్ దాడుల వల్ల నష్టం కలిగింది కనక మోదీ ఆ దేశాధినేతలతో మాట్లాడి సానుభూతి తెలియజేశారు. అసలు యుద్ధానికి బలవుతున్న ఇరాన్ మీద మోదీకి ఏ మాత్రం సానుభూతి లేదు. గతంలో అవసరం
వచ్చినప్పుడల్లా ఇరాన్ మనకు అండగా నిలిచింది. ఇరాన్ నుంచి మనం భారీ స్థాయిలో ముడి చమురు, గ్యాస్ దిగుమతి చేసుకుంటూ ఉంటాం. మన విద్యార్థులు చాలా మంది ఇరాన్లో చదువుకుంటున్నారు. అనేకమంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఇవేవీ మోదీకి బాధ కలిగించలేదు. ఆత్మరక్షణలో భాగంగా ఇరాన్ అమెరికా సైనిక స్థావరాలున్న ప్రాంతాలపై క్షిపణులు ప్రయోగిస్తూ ఉంటే మోదీ హృదయం కరిగి నీరైపారుతోంది. సౌదీ మొదలైన దేశాలలోని అమెరికా స్థావరాలపై దాడి ఆ దేశాల
సార్వభౌమాధికారానికి భంగం కలిగించినట్టేనని మోదీ అంటున్నారు. ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్లో భీకరమైన విధ్వంసం సృష్టిస్తూ ఉంటే అది ఇరాన్ సార్వభౌమాధికారం మీద దాడిగా మోదీకి కనిపించడం లేదు. “ప్రాంతీయ శాంతి, సుస్థిరత త్వరలో నెలకొనాలని సౌదీ, బహ్రేన్ నాయకులు భావించారట. సౌదీ
మీద ఇరాన్ చేస్తున్న దాడిని మోదీ అరమరికలకు తావు లేకుండా ఖండించారని సౌదీ ఓ అధికారిక ప్రకటనలో తెలియజేసింది. క్లిష్టమైన ఈ సమయంలో సౌదీలో ఉ న్న భారతీయులను జాగ్రత్తగా చూసుకోవాలని కూడా మోదీ విజ్ఞప్తి చేశారట. బహ్రేన్ రాజు హమీద్ బిన్ అల్ ఖలీఫాతోనే కాక జోర్డాన్ రాజు రెండవ అబ్దుల్లాతో కూడా మోదీ ఫోన్లో మాట్లాడారు. ఇరాన్ క్షిపణులు పని చేయకుండా చేస్తున్నామని బహ్రేన్ చెస్తోంది. ఇరాన్ ప్రతిఘటన న్యాయమైంది కాదని జోర్డాన్ అంటోంది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను వమ్ము చేసే క్రమంలో జోర్డాన్ చేస్తున్న ప్రయత్నాల వల్ల ఆ శిథిలాలు కూలి కొంతమంది గాయపడ్డారు. యుద్ధ పరిణామాల వల్ల ఎదురవుతున్న పరిస్థితి పై మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తాము శాంతి కోరుకుంటున్నామని, జోర్డాన్ ప్రజలు క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నామని మోదీ
అన్నారు. జోర్డాన్లో ఉన్న భారతీయులకు తగిన రక్షణ కల్పించినందుకు జోర్డాన్ ప్రభుత్వానికి మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. అమెరికా స్థావరాల మీద దాడి క్రమంలో తమ దేశం మీద జరుగుతున్న దాడిని ప్రతిఘటిస్తామని సౌదీ అరేబియా చెస్తోంది. ఇరాన్ క్షిపణులను సౌదీ అడ్డగిస్తున్నప్పటికీ తూర్పు ప్రాంతంలో జరిగిన దాడుల వల్ల కొంత నష్టం జరిగిందని సౌదీ అంగీకరించింది. ఈ దాడులు మరింత పెరుగుతాయేమోనన్న భయంతో సౌదీ అరేబియా తన సైన్యాన్ని సంసిద్ధం చేస్తోంది. మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వంతో కూడా మాట్లాడి సానుభూతి తెలియజేశారు. ఇరాన్ అనుభవిస్తున్న క్షోభ గురించి మాత్రం నోరెత్తలేదు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రికి ఫోన్ చేసి ఈ యుద్ధానికి త్వరలో ముగింపు పలకాలని కోరారు. సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత, పౌరుల భద్రత లాంటి పడికట్టు
మాటలను మోదీ సునాయాసంగా దొర్లించారు. సంప్రదింపుల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని ఆకాంక్షించారు. కానీ ఇరాన్తో జెనీవాలు చర్చలు జరుగుతున్నప్పుడే మధ్యలో ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ప్రారంభించిన విషయం మోదీకి తెలియదనుకోలేం. గల్ఫ్ దేశాల్లో చాలామంది భారతీయులు ఉన్నారు.
సౌదీ అరేబియాలో 25 లక్షల మంది, బహ్రేన్లో దాదాపు 3,25,000 మంది, జోర్డాన్లో 1,50,000 మంది భవన నిర్మాణ రంగంలో, చమురు, గ్యాస్ కర్మాగారాల్లో పని చేస్తున్నారు. వాణిజ్య రంగంలో నిమగ్నమై ఉన్న వారూ ఉన్నారు. మొత్తం మీద మోదీ పశ్చిమాసియా విషయంలో, మరీ ముఖ్యంగా పలస్తీనియన్లకు మనం దశాబ్దాలుగా ఇస్తున్న మద్దతు గురించి కావాలనే ప్రస్తావించడం లేదు. స్వాతంత్య్రం రాక ముందు, స్వాతంత్ర్యానంతరం మనం పలస్తీనాకు అండగా నిలబడ్డాం. ఈ విధానాన్ని మోదీ తిరగతోడారు. యుద్ధోన్మాదులకు అంటకాగుతున్నారు. కిరాతకానికి పాల్పడుతున్న ఇజ్రాయెల్ను మోదీ ఒక్క మాట అనలేరు. ట్రంపు కన్నెత్తి చూసే పరిస్థితీ లేదు. యుద్ధం ప్రారంభం కావడానికి రెండు రోజుల ముందే మోదీ ఇజ్రాయెల్లో పర్యటించారు. ఆ సమయంలో యుద్ధం గురించి ప్రస్తావన రాలేదనుకోలేం. కచ్చితంగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహూ యుద్ధం ప్రారంభించే సంకల్పాన్ని మోదీకి చెప్పే ఉంటారు. ఇజ్రాయెల్ వెళ్లి మోదీ సాధించుకొచ్చిందేమిటో ఇంతవరకు తెలియదు.
మోదీ తలుపు చాటు దౌత్యం
- Advertisement -


